పవర్ లేని పంచాయతీలు (ఆదిలాబాద్)

 

ఆదిలాబాద్, ఆగస్టు 03 (globelmedianews.com - Swamy Naidu): కొత్తగా పంచాయతీలు ఏర్పాటు చేశారు. ఎన్నికలు జరిగాయి. పాలకవర్గం ఏర్పాటైంది. పదవీ బాధ్యతలు చేపట్టారు. చెక్‌పవర్‌కు సంతకాలు చేశారు. కార్యదర్శులను నియమించారు. ఇంకేముంది అన్నీ పూర్తయ్యాయని అనుకుంటున్నారు కదు.. పాత పంచాయతీల నుంచి వేరుపడి కొత్త పంచాయతీలుగా రూపుదిద్దుకున్నా.. ఇంకా నిధులు, పనులు, గత పంచాయతీల నుంచే నిర్వహించాల్సి వస్తోంది. ఆసరా పింఛన్లు, రేషన్‌ సరకుల పంపిణీ, ఉపాధిహామీ పనులు, మరుగుదొడ్లకు నిధులు, మహిళా సంఘాల విభజన, క్షేత్ర సహాయకుల నియామకాలు ఇలా అనేక శాఖలకు సంబంధించిన పనులు వేరుగా నిర్వహించాల్సి ఉంది.. వీటిని విభజించకపోవడంతో గతంలో మాదిరిగానే పనులు జరుగుతున్నాయి. పంచాయతీలకు నిధులు, అధికారాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలని కొత్తగా ఎన్నికైన సర్పంచులు కోరుతున్నారు.పంచాయతీలు ఏర్పాటై ఏడాది దాటింది. పాలకవర్గం ఎన్నికై ఆరు నెలలు అవుతోంది. పంచాయతీలకు భవనాలు లేవు. కూర్చునేందుకు కుర్చీ లేదు. గతంలో మంజూరు చేసిన నిధుల్లో కొత్తగా ఏర్పడ్డ పంచాయతీలకు నిధులు కేటాయించారు.. 

 పవర్ లేని పంచాయతీలు (ఆదిలాబాద్)
తరువాత ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి నేరుగా కొత్తపంచాయతీలకు నిధులు మంజూరు కాలేదు. అనేక పంచాయతీలకు భవన సౌకర్యం, ఫర్నిచర్‌ తదితర వాటికి నిధులు కేటాయించకపోవడంతో అద్దె, పాఠశాల, అంగన్‌వాడీ తదితర భవనాల్లో పంచాయతీలను కొనసాగిస్తున్నారు.కొత్త పంచాయతీలకు చెందిన పింఛన్‌దారులు ఇప్పటికీ పాత పంచాయతీలకే వెళ్లాల్సి వస్తోంది. బయోమెట్రిక్‌ సిగ్నల్‌ లేని పంచాయతీల్లో అయితే ఆటోల్లో వెళ్లి ఎక్కడ సిగ్నల్‌ వస్తే అక్కడ కూర్చొని తీసుకోవాల్సి వస్తోంది. డీలర్ల నియామకం చేయకపోవడంతో గతంలో మాదిరిగానే పాత పంచాయతీలకే వెళ్లి రేషన్‌ సరకులు తెచ్చుకోవాల్సి వస్తోంది. పంచాయతీల వారీగా మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నా, గతంలో ఉన్న పంచాయతీ కార్యదర్శి అధ్వర్యంలోనే చెల్లింపులు జరుగుతున్నాయి. ఉపాధిహామీ పథకం కింద పనుల ప్రతిపాదన, నిర్మాణాలు, చెల్లింపులు పాత పంచాయతీ అధ్వర్యంలోనే కొనసాగుతున్నాయి. మేట్స్‌, క్షేత్రసహాయకులను నియమించలేదు.  మహిళా సంఘాలకు చెందిన లావాదేవీలు పాత పంచాయతీలకు చెందిన సిబ్బంది ద్వారానే కొనసాగుతున్నాయి. కొత్తగా నియామకమైన కార్యదర్శులు గ్రామసభలు, తదితర వాటిని నిర్వహిస్తున్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచి, ఉపసర్పంచుల సంతకాలు చేయించి జాయింట్‌ పవర్‌ ఇచ్చారు.. నిధులు డ్రా చేసుకోలేకపోతున్నారు. కొత్తగా ఏర్పడ్డ పంచాయతీలకు పక్కాభవనాలు, కుర్చీలు లేవు.. భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు తీసుకున్నారు. ఇప్పటి వరకు మంజూరు కాలేదు. పారిశుద్ధ్యం పనులకు ప్రత్యేకంగా సిబ్బంది లేకపోవడంతో పనులు చేయించలేని పరిస్థితి ఉంది.కొత్తగా ఏర్పడ్డ పంచాయతీల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తేనే మా పంచాయతీ అనే భావన వస్తోంది.. గతంలో మాదిరిగానే ప్రతి పనికి పాత పంచాయతీకే వెళ్లాల్సి రావడంతో ప్రజలకు మేలు జరగడం లేదు. రేషన్‌సరకులు, పింఛన్ల పంపిణీ తదితర వాటిని పంచాయతీల్లోనే నిర్వహిస్తే దూరాభారం తగ్గుతుంది. దీంతో పాటు సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా ప్రభుత్వ స్థలం, భవనం, ఫర్నిచర్‌ తదితర వాటికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని సర్పంచులు కోరుతున్నారు

No comments:
Write comments