నిర్లక్ష్యానికి ‘మందు’లేవీ..? (కర్నూలు)

 

కర్నూలు, ఆగస్టు 20 (globelmedianews.com - Swamy Naidu): ప్రస్తుతం వర్షాకాలం కావడంతో సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నాయి. వైరల్‌ జ్వరాలతో బాధపడుతూ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరిగిపోతోంది. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర మందులు కరవయ్యాయి. ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడంతో పేదల పరిస్థితి దయనీయంగా మారింది. చివరికి వేలాది రూపాయలు ఖర్చు చేసి ప్రైవేటు వైద్యాలయాల్లో చికిత్స చేయించుకోవాల్సిన దయనీయ పరిస్థితి దాపురించింది.జిల్లాలో 87 పీహెచ్‌సీలు, 18 సీహెచ్‌సీలు ఉన్నాయి. ఒక్కో పీహెచ్‌సీకి మూడు నెలలకు రూ.లక్ష చొప్పున ఏడాదికి రూ.4 లక్షల విలువైన మందులను సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ నుంచి అధికారులు సరఫరా చేస్తారు. ప్రతి మూడు నెలలకు ముందే ఈ ఔషధి ద్వారా కావాల్సిన మందులను ఆయా పీహెచ్‌సీల వైద్యులు ఇండెంటు పెడతారు. ఒక్కో సీహెచ్‌సీకి ప్రతి క్వార్టర్‌కు రూ.2 లక్షల విలువైన మందులు ఇస్తారు. వైద్యులు పెట్టిన ఇండెంటు మేరకు ప్రత్యేక వాహనంలో ఆయా ఆస్పత్రులకు మందులు సరఫరా చేస్తారు

 నిర్లక్ష్యానికి ‘మందు’లేవీ..? (కర్నూలు)
కర్నూలులోని బోధన ఆస్పత్రికి రూ.4 కోట్ల నుంచి రూ.6 కోట్లు, నంద్యాలలోని జిల్లా ఆస్పత్రికి రూ.80 లక్షల విలువైన మందులను ఏడాదికి ఇస్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ప్రాంతీయ ఆసుపత్రులు, నంద్యాల జిల్లా ఆసుపత్రి, కర్నూలు బోధన ఆసుపత్రులకు ఏటా సుమారు రూ.12 కోట్ల విలువైన మందులను ప్రభుత్వం అందిస్తోంది. ప్రభుత్వాస్పత్రులకు మూడు నెలలకోసారి ఇండెంటు ప్రకారం రూ.3 కోట్ల విలువైన మందులు సరఫరా చేయాల్సి ఉంది. కానీ కేవలం 50 నుంచి 70 శాతం మందులు మాత్రమే పంపిణీ చేస్తున్నారు. ఫలితంగా అరకొర మందులతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు.ప్రతి క్వార్టర్‌లో కీలక మందులు సరఫరా చేయకపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు కొన్ని మందులు క్వారెంటీలో ఉంటాయి. వాటికి క్లియరెన్స్‌ వచ్చేంత వరకు సరఫరా చేసేందుకు వీలు లేదు. మరోవైపు ఆస్పత్రుల్లో ఆన్‌లైన్‌లో సరఫరా లేని మందులను మాత్రమే బయట కొనుగోలు చేయాల్సి ఉంది. క్వారెంటీలో ఉన్న మందులు సరఫరాలో ఉన్నట్లు ఆన్‌లైన్‌లో చూపిస్తుండటంతో పీహెచ్‌సీ, సీహెచ్‌సీ వైద్యులు బయట కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. జిల్లావ్యాప్తంగా ఉన్న పలు పీహెచ్‌సీలలో ప్రధానంగా పిల్లలకు వాడే సిరప్‌లు, దగ్గుకు వాడే మందులు లేవు. రోగులకు సెలైన్‌ పెట్టేందుకు ఉపయోగించే ఐవీ సెట్‌, చక్కెర వ్యాధిగ్రస్తులకు ఇచ్చే ఇన్సులిన్‌, కుక్కకాటుకు వేసే ఏఆర్‌వీ టీకాలు అందుబాటులో ఉండటం లేదు. ఈ మందులేకాక అత్యవసరానికి వాడే టీకాలు సైతం కరవయ్యాయి. ఆస్పత్రులకు సంబంధించి మూడు నెలలకోసారి 256 రాకల మందులను ఏపీఎంఎస్‌ఐడీసీ ఆధ్వర్యంలో నడిచే సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ నుంచి ప్రతి మూడు నెలలకోసారి మందులు అందిస్తుంటారు. జ్వరం లేదా తలనొప్పితో బాధపడేవారికి వైద్యులు పారాసిట్‌మాల్‌ అందిస్తున్నారు. జిల్లాలోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలతోపాటు పెద్దాస్పత్రి, నంద్యాల జిల్లా ఆస్పత్రి, ఆదోని ప్రాంతీయ ఆసుపత్రికి కలిసి ప్రతి మూడు నెలలకోసారి డ్రగ్‌ స్టోర్‌ నుంచి సుమారు 10 లక్షల మాత్రలు అవసరం కాగా మూడు నెలల నుంచి పలు ఆస్పత్రుల్లో మందులు లేక రోగులకు ఇవ్వడం లేదు.ప్రస్తుతం వర్షాలు పడుతున్న నేపథ్యంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశముంది. ఆయా వైద్యాలయాల్లో ఓపీల సంఖ్య సైతం పెరిగింది. ఎక్కువ మంది గ్రామీణ ప్రజలు వైరల్‌ జ్వరాలతో బాధపడుతూ వస్తున్నారు. కానీ గత మూడు నెలలుగా అత్యవసరమైన మందులు లేకపోవడంతో వైద్యులు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. చివరికి మొక్కుబడి వైద్యం అందించి మమ అనిపించేస్తున్నారు. జులై, ఆగస్టు నెలల్లో రోగుల సంఖ్య ఎక్కువగా ఉంది. కానీ అవసరమైన మందులు మాత్రం అందుబాటులో లేవు. దీనిపై నిరంతరం పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. చివరికి చాలామంది రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. అధికారులు స్పందించి మందుల కష్టాలు తొలగించాల్సిన అవసరం ఉంది.

No comments:
Write comments