నిండు కుండలా శ్రీశైలం రిజర్వాయర్‌

 


కర్నూలు, ఆగస్టు 5, (globelmedianews.com - Swamy Naidu)
కర్ణాటకలో కురుస్తున్న వర్షాలు గత ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా శ్రీశైలం రిజర్వాయర్‌కు జలసిరులను తీసుకువచ్చింది. గత ఆరు రోజులలో ఏకంగా 54 అడుగులను మించి నీరు రిజర్వాయర్‌కు వచ్చింది. జూలై 30వ తేదీ ఉదయం 6 గంటలకు 804 అడుగులుగా ఉన్న నీటిమట్టం క్రమంగా పెరుగుతూ ఆగస్టు 4వ తేదీ రాత్రి కల్లా 858 అడుగులకు చేరింది. ఇంకా ఎగువ నుంచి నీటి ప్రవాహం వస్తూనే ఉంది కాబట్టి, మట్టం పెరుగుతూనే ఉంది. ఈ ఆరు రోజులలో 54 అడుగులకు పైగా నీటిమట్టం పెరిగింది. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా తెలంగాణ ప్రభుత్వం 2000 క్యూసెక్కుల నీటిని ఇక్కడి నుంచి వినియోగిస్తుంది. 854 అడుగులకు చేరగానే పోతిరెడ్డిపాడు నుంచి గేట్లు తెరిచి, నీటిని బయటికి పంపించవచ్చు.రాత్రి వరకు గేట్లు తెరవకపోయినా, సోమవారం, లేదా మంగళవారం నాటికి గేట్లను ఎపి అధికారులు తెరుస్తారని విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఇక్కడ టెలీమెట్రీల ఏర్పాటు అంశంపై ఇంకా కృష్ణాబోర్డులో పెండింగ్‌లో ఉంది. వెళ్లే నీటి ప్రవాహానికి, టెలీమెట్రీలు చేస్తున్న రికార్డుకు తేడా భారీగా ఉంటుందన్న అంశాన్ని తెలంగాణ అధికారులు కృష్ణాబోర్డు దృష్టికి తీసుకువెళ్లారు.
నిండు కుండలా శ్రీశైలం రిజర్వాయర్‌
మరో వైపు ఒక నది లాంటి పోతిరెడ్డిపాడు పాయను చిన్న టెలీమెట్రీ వంటి పరికరంతో కొలువలేమని నిర్థారణకు కూడా వచ్చారు. మరో వైపు జూరాలకు, తద్వారా శ్రీశైలం రిజర్వాయర్‌కు భారీ స్థాయిలో నీటి ప్రవాహాలు ఎగువ నుంచి వచ్చి చేరుతున్నారు. శ్రీశైలంకు 2,20,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ప్రస్తుతం వస్తుంది. 857 అడుగుల మేర నీటిమట్టం ఉండగా, ప్రస్తుతం 98 టిఎంసిల నీరు ప్రస్తుతం నిల్వ ఉంది. ఇది అర్థరాత్రి వరకు 100 టిఎంసిలను దాటిందని తెలిసింది. జూరాల రిజర్వాయర్‌కు ప్రస్తుతం 2,33,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 2,34,000 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ఇక్కడ నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాల పంపులు, కుడి, ఎడమ కాలువలకు సైతం నీటిని వదిలారు. ఆల్మట్టికి 2,45,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 2,85,000 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్‌కు 2,85,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 2,71,000 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. తుంగభద్రకు సైతం స్థిరంగా ఇన్‌ఫ్లో వస్తుంది. ప్రస్తుతం 16309 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 100.8 టిఎంసిలకు గాను ప్రస్తుతం 34 టిఎంసిల నీరు నిల్వ ఉంది. ఇంకా66 టిఎంసిల నీరొస్తే డ్యాం గేట్లు తెరుస్తారు. ఇదేవిధంగా ఉజ్జయిని డ్యాంకు సైతం 61,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంది. 117 టిఎంసిలకు గాను ప్రస్తుతం 87 టిఎంసిల నీరు నిల్వ ఉంది. ఇంకా 30 టిఎంసిల నీరొస్తే ఉజ్జయిని గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతారు. ఆ నీరు జూరాలలో కలుస్తుంది. తుంగభద్ర నీరు నేరుగా ఆలంపూర్ దిగువన, శ్రీశైలానికి ఎగువ భాగంలో కలుస్తాయి.

No comments:
Write comments