దోమల దండయాత్ర (ఖమ్మం

 

ఖమ్మం, ఆగస్టు 19 (globelmedianews.com - Swamy Naidu): ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వీటి విజృంభణతో ప్రజలు వ్యాధుల బారిన పడుతూ వ్యయ ప్రయాసలకు గురవుతున్నారు. గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో వాననీటికి పురపాలకాల్లోని డ్రైనేజీలు పొంగి పొర్లడంతో అపరిశుభ్రత తాండవిస్తోంది. ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ ఉండడంతో దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. తరుణవ్యాధులు ప్రబలకుండా పురపాలక యంత్రాంగం కనీస జాగ్రత్తలు తీసుకోవడంలో ఉదాసీనత ప్రదర్శిస్తుండడంతో వ్యాధులు ప్రబలుతున్నాయి. పలుచోట్ల ఫ్రైడే డ్రైడే కార్యక్రమం అటకెక్కింది. ఈ విషయాన్ని పట్టించుకొనేవారే కరవయ్యారు. ప్రతి శుక్రవారం ఇంటిలో నిల్వ చేసిన నీళ్లను తొలగించి.. నీటి నిల్వ ప్రాంతాలను బ్లీచింగ్‌ పౌడర్‌తో శుభ్రం చేసుకోవాలి. ఇదే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన పెంచాలి. తరుణ వ్యాధులపై అప్రమత్తం చేయాలి. కానీ ఆ ఊసే కరవైంది.
 దోమల దండయాత్ర (ఖమ్మం
ఖమ్మం నగర పాలక సంస్థతోపాటు ఉభయ జిల్లాల్లోని పురపాలక సంఘాల పరిధిలో ఈ పరిస్థితి నెలకొంది. ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలో శానిటరీ స్థాయి సంఘం కూడా ఉంటుంది. అయినా నగరంలో పారిశుద్ధ్యం కొరవడుతోంది. వర్షాలు వస్తున్న తరుణంలో దోమలు వృద్ధి చెందకుండా నివారణ చర్యలు తీసుకోవాలి. ప్రజారోగ్యపరంగా నిరంతరం ఈ ప్రక్రియ నిర్వహించాల్సిన ఆవశ్యకత నెలకొంది. వర్షాకాలం సగం గడిచిపోయినా ఫాగింగ్‌ ఊసే కరవైంది. నగరంలోని శివారు ప్రాంతాల్లో పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. డ్రైనేజీల్లో పూడికతీత, చెత్త తరలింపు చర్యలు లేకపోవడంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. అపరిశుభ్రత నెలకొన్న చోట బ్లీచింగ్‌ చల్లడం దాదాపుగా మరిచిపోయారు.

No comments:
Write comments