ఖమ్మంలో కమ్యూనిస్టుల ఖాళీ

 

ఖమ్మం, ఆగస్టు 16 (globelmedianews.com)
బెంగాల్‌లో కమ్యూనిస్టులను కమలం తుడిచిపెట్టేస్తోంది. త్రిపురలో వామపక్షాలను చాపచుట్టేసింది. ఇప్పుడు తెలంగాణలో కమ్యూనిస్టుల ఖిల్లా, ఖమ్మం జిల్లాపై అమిత్‌ షా, ఫోకస్ పెట్టారని హాట్‌హాట్‌గా డిస్కషన్‌ జరుగుతోంది. కేవలం కమ్యూనిస్టులే కాదు, కాంగ్రెస్, టీడీపీ, చివరికి టీఆర్ఎస్‌ నేతలపై కూడా బీజేపీ గురిపెట్టిందన్న ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఖమ్మంలో బీజేపీ వల విసురుతున్న నేతలెవరు ఆ నాయకుల ప్రజెంట్ సిచ్యువేషన్‌ కూడా అలానే ఉందా? తెలంగాణా ఉద్యమం తొలి దశ మలి దశ పోరాటాలకు వేదికగా మారిన ఉమ్మడి జిల్లా. చైతన్యవంతమైన రాజకీయాలకు కేంద్రంగా విలసిల్లుతోంది. ఇప్పటి వరకూ కాంగ్రెస్, కమ్యూనిస్టు, టిడిపి, టిఆర్ఎస్ పార్టీలకు మాత్రమే గ్రామ స్థాయిలో గట్టి పట్టున్న నేతలు, కార్యకర్తలు ఉండగా, బిజెపి మాత్రం ముందు నుంచి కాస్త బలహీనంగానే ఉంది. 
ఖమ్మంలో కమ్యూనిస్టుల ఖాళీ

ఐతే, జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయిలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులను అవకాశంగా తీసుకుని జిల్లాలో పట్టు పెంచుకునేందుకు బిజెపి నాయకత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. ముఖ్యంగా జిల్లాలో పట్టున్న మెజార్టీ సామాజిక వర్గాలు, మేధావులే లక్ష్యంగా పావులు కదుపుతున్న బిజెపి నేతలు, ప్రధాని నరేంద్ర మోడి మానియాను కింది స్థాయిలోకి తీసుకెళ్లి కమలదళాన్ని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.  ఖమ్మం జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల నుండి పార్లమెంటు ఎన్నికల వరకూ చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న బిజెపి నాయకత్వం, టిఆర్ఎస్, కాంగ్రెస్, టిడిపి ముఖ్య నేతలే టార్గెట్‌గా ఆపరేషన్ కమలం అమలు చేస్తోంది. అధికార పార్టీలో పార్లమెంటు ఎన్నికల వరకూ జిల్లాలో హవా నడిపి, అనూహ్య పరిణామాల్లో ఎన్నికల్లో పోటీచేయలేని పరిస్థితులు ఎదుర్కొన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై, ఢిల్లీ స్థాయిలో పార్టీ మారాలనే ఒత్తిడి తీవ్రంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి గత పార్లమెంటు ఎన్నికల ముందే పొంగులేటికి కాషాయ కండువా కప్పాలని ప్రయత్నాలు జరిగినా, ఆ నేత వేచి చూసే ధోరణితో సైలెంట్ అయినట్లు సమాచారం. పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో బిజెపి ఊహించని విధంగా నాలుగు ఎంపి స్థానాలను గెలుచుకుని టిఆర్ఎస్ పార్టీకి గట్టి సవాల్ విసరడంతో పాటు టిఆర్ఎస్ పార్టీలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఆ నేత కాస్త మనసు మార్చుకున్నట్లు బిజెపి శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. బిజెపిలోకి వస్తే ఢిల్లీ స్థాయిలో ప్రాముఖ్యత కల్పించడంతో పాటు వ్యాపార విస్తరణకు అవసరమైన అండదండలు అందిస్తామని ఏకంగా అమిత్ షాతో చెప్పించడంతో, ఇపుడు పార్టీ మారే విషయంలో ఆ అధికార పార్టీ నేత మల్లగుల్లాలు పడుతున్నారన్న చర్చ జరుగుతోంది. అంతేకాదు, టీఆర్ఎస్‌లో రాజ్యసభ ఇస్తారని హామి ఇచ్చారని, ఒకవేళ ఇవ్వకపోతే, కాషాయ కండువా కప్పకోవడం ఖాయమన్న ప్రచారం ఖమ్మంలో జోరుగా సాగుతోంది. ఖమ్మం జిల్లాలో అధికార టిఆర్ఎస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉండి, గత అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ నేతల వెన్నుపోటు రాజకీయాలతో ఓటమి పాలయిన మరో కీలక నేతపై కూడా, బిజెపి ఢిల్లీ పెద్దలు ద్రుష్టి పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. గతంలో టిడిపిలో ప్రస్తుతం టిఆర్ఎస్‌లో ఎదురులేని నేతగా ఉన్న ఆయన, తాజా రాజకీయ పరిణామాలతో మనస్థాపం చెంది తన వ్యవసాయ క్షేత్రానికే పరిమితమయ్యారు. దీనిని అవకాశంగా తీసుకున్న కమలదళం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి తీర్థం పుచ్చుకున్న ఆ సామాజిక వర్గ నేతల సహకారంతో, మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. మరోవైపు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయనతో ఢిల్లీ స్థాయిలో కీలక బిజెపి నేతలతో ఉన్న సన్నిహిత సంబంధాలను ఆసరాగా చేసుకుని పార్టీ మారమని ఆహ్వానం పలుకుతున్నట్లు తెలిసింది. ఐతే తాజా రాజకీయాలపై విరక్తితో ఉన్న పెద్దాయన, ఈ ప్రతిపాదనలను సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. అయినా పట్టువీడని కమల నేతలు ఆయన ఊ, అంటే చాలు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ దశ, దిశ మారుతుందనే ఆశతో అమిత్ షాతో మాట్లాడించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జిల్లాలో ఊపందుకుంది. ఇలా ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ ముఖ్య నేతలపై ద్రుష్టి పెట్టిన బిజెపి నాయకత్వం, కాంగ్రెస్, టిడిపి నేతలకు కూడా కాషాయ క్యాంపుకు ఆహ్వానం పలుకుతోంది. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిడిపి అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ బిజెపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారని తెలిసింది. ఆయనతో పాటు పలువురు ద్వితియ శ్రేణి టిడిపి నేతలు, కార్యకర్తలు కూడా అమిత్ షా సమక్షంలో బిజెపి తీర్థం పుచ్చుకునేందుకు రాజధాని పయనమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో తాజాగా నెలకొన్న అయోమయ పరిస్థితుల నేపథ్యంలో కొందరు జిల్లా కాంగ్రెస్ నేతలు బిజెపి నేతలతో పార్టీ మారే విషయంపై ఇప్పటికే బిజెపి తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ద్వారా చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. గత పార్లమెంటు ఎన్నికల్లో టిఆర్ఎస్ ఖమ్మం ఎంపి సీటు వచ్చినట్లె వచ్చి చేజారిపోయిన బడా పారిశ్రామికవేత్త పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిని సైతం, పార్టీలో చేర్చుకునేందుకు బిజెపి నేతలు చర్చలు సాగిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద అమిత్ షా రాష్ట్ర పర్యటన సందర్భంగా ఖమ్మం జిల్లాలో వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు, కార్యకర్తలను బిజెపిలో చేర్చుకోవడం ద్వారా పార్టీ బలోపేతం చేయాలనే కమలనాథుల వ్యూహాలు ఏమేరకు ఫలిస్తాయో వేచి చూడాలి

No comments:
Write comments