సౌకర్యాలేవీ..?(కృష్ణాజిల్లా)

 

మచిలీపట్నం, ఆగస్టు 16 (globelmedianews.com - Swamy  Naidu): వైద్యారోగ్య శాఖ పరిధిలోని ఉపశాఖల మధ్య సమన్వయ లోపం పేదల పాలిట శాపంగా మారుతోంది. వైద్యసేవలు అందని ద్రాక్షలా తయారవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యారోగ్య శాఖ పర్యవేక్షణలో జిల్లాకేంద్రమైన మచిలీపట్నంలో జిల్లా ఆసుపత్రితోపాటు 88 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, మరో 35 ఉన్నతస్థాయి ఆరోగ్యకేంద్రాలు, వీటికి అనుసంధానంగా 650 ఉపకేంద్రాలున్నాయి. ఈ శాఖకు సమాంతరంగా వైద్య విధాన పరిషత్తు కూడా జిల్లాలో జనాభా ప్రాతిపదికన, రోగుల సంఖ్య అధికంగా ఉన్న ప్రాంతాల్లో తొమ్మిది ప్రాంతీయ వైద్యశాలలను నిర్వహిస్తోంది. రెండేళ్ల క్రితం జిల్లాలో వైద్యారోగ్య శాఖ పరిధిలో ఉన్న ఆరు ఉన్నతస్థాయి వైద్యశాలలను గుర్తించి, వైద్య విధాన పరిషత్తు (వీవీపీ)కు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. నాటి నుంచి ఈ తొమ్మిది వైద్యశాలల్లో వైద్యుల నియామకాలు వీవీపీ చేస్తున్నప్పటికీ, ఇతర సదుపాయాలను మాత్రం కల్పించలేదు. 
 సౌకర్యాలేవీ..?(కృష్ణాజిల్లా)
ఈ ఆసుపత్రులను తమకు పూర్తిస్థాయిలో అప్పగించనందున తాము సదుపాయాలు కల్పించలేమని వీవీపీ అధికారులు చెబుతుండగా.. వారి పర్యవేక్షణలో ఉన్న వైద్యశాలలకు తమ శాఖ సదుపాయాలు కల్పించబోదంటూ వైద్యారోగ్య శాఖ అధికారులు దాటవేస్తున్నారు. రెండు విభాగాల మధ్య సమన్వయ లోపంతో రోగులకు సదుపాయాలు అందని దుస్థితి నెలకొంది.జిల్లాలో రెండేళ్ల క్రితం వరకు ఉన్నతస్థాయి ఆరోగ్య కేంద్రాలుగా ఉన్న విస్సన్నపేట, గన్నవరం, కంకిపాడు, జగ్గయ్యపేట, గూడూరు, కైకలూరు వైద్యశాలలను 2017లో వైద్యారోగ్య శాఖ అధికారులు వైద్యవిధాన పరిషత్తుకు అప్పగించారు. నాటి నుంచి వైద్యుల నియామకం, వారి జీతభత్యాలను వైద్య విధాన పరిషత్తే చూస్తోంది. వీవీపీ స్థాయిలో రోగులకు సదుపాయాల కల్పన మాత్రం అందడం లేదు. రోడ్డుప్రమాదాలు, ఘర్షణల్లో గాయాలపాలైన వారిని ఇన్‌పేషెంట్లుగా చేర్చుకునే అవకాశం లేక ప్రాంతీయ వైద్యశాలలకు సిఫారసు చేస్తున్నారు. అక్కడికి సకాలంలో చేరకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదముంది. ఆత్మహత్య, హత్య వంటి సందర్భాల్లో ప్రాంతీయ వైద్యశాలలకు తరలించేందుకు వాహన సదుపాయం లేనందున మృతదేహాల తరలింపు, తీసుకురావడంలో పేదలు వ్యయప్రయాసలకు గురవుతున్నారు.  కాన్పు సమయంలో ప్రమాదకర పరిస్థితులు ఎదురైతే ప్రాంతీయ వైద్యశాలలకు సిఫారసు చేస్తారు. పేదలు సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి, అప్పులపాలవుతున్నారు.జిల్లాలోని విస్సన్నపేట తదితర ఆసుపత్రులను వైద్య విధాన పరిషత్తుకు అప్పగించినందున ఆయా ఆసుపత్రుల్లో గర్భవతులు, చిన్నపిల్లలకు అవసరమైన సేవలందించేందుకు గైనకాలజిస్టు, పీడియాట్రిస్టులను, సాధారణ వైద్యసేవలకు మరో ముగ్గురు వైద్యులను నియమించారు. గర్భవతులను తరచూ పరీక్షలు చేసేందుకు స్కానింగ్‌ యంత్రాలను సమకూర్చారు. ఇన్ని సదుపాయాలు కల్పించిన అధికారులు ఆపరేషన్‌ థియేటర్ల ఏర్పాటు మాత్రం మరచిపోయారు. ప్రమాదకర పరిస్థితులు తలెత్తిన సందర్భాల్లో వీరిని కనీసం మరో మంచి ఆసుపత్రికి తరలించేందుకు వాహనం కూడా అందుబాటులో ఉంచలేదు.

No comments:
Write comments