రొయ్యలపై నిరంతర పర్యవేక్షణ

 

ఏలూరు, ఆగస్టు 2, (globelmedianews.com)
విదేశాల్లో ఏపీ రొయ్యలకు చుక్కెదురవుతోంది. యాంటి బయోటిక్స్ వినియోగిస్తున్నారంటూ రొయ్యల కంటైనర్లను వెనక్కి పంపేస్తుండటంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. సాగు నుండి ప్రాసెసింగ్ దాకా పర్యవేక్షణ ఉంచాలని నిర్ణయించింది.సాగుకు ఉపయోగించే రొయ్య సీడ్ ఎక్కడ కొనుగోలు చేశారు? ఎన్ని ఎకరాల్లో ఎంత సీడ్ వేస్తున్నారు? ఏయే మేతలు ఉపయోగిస్తున్నారు? పట్టుబడి పట్టినప్పుడు ఎంత సైజులో ఉన్నాయి? ఏ ఏజన్సీ ఆ రొయ్యలను కొనుగోలు చేసింది? తదితర వివరాలను రైతులు ఎప్పటికప్పుడు నమోదు చెయ్యాల్సి ఉంటుంది. ఇక పట్టుబడి పట్టిన రొయ్యలు ఏ ప్రాసెసింగ్ యూనిట్ కొనుగోలు చేసింది? చెరువు నుంచి అక్కడికి తరలించడానికి ఎంత సమయం పట్టింది?  రొయ్యల చెరువులను శాటిలైట్ ద్వారా మ్యాపింగ్ చేయడంతోపాటు సాగు ప్రారంభం నుండి ప్రాసెసింగ్ పూర్తయ్యి, ఎగుమతి జరిగే వరకు ప్రతి అంశాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించనుంది. 
 రొయ్యలపై నిరంతర పర్యవేక్షణ

రొయ్యల ప్యాకెట్లపై పూర్తి స్థాయిలో వివరాలు ముద్రించనున్నారు.రాష్ట్రం నుండి ఏటా వేల కోట్ల రూపాయల రొయ్యల ఎగుమతులు జరుగుతున్నా.. ఇప్పటివరకు ప్రభుత్వం వద్ద సాగు జరిగే విస్తీర్ణం, దిగుబడి తదితర అంశాలపై కచ్చితమైన సమాచారం లేదు. రొయ్యల సాగు అత్యధిక శాతం అనధికారికంగా, అసంఘటితంగా సాగుతుండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. అయితే రొయ్యలు దిగుమతి చేసుకునే కీలక దేశాల నుండి విముఖత ఎదురవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అసలు రాష్ట్రంలో ఏయే ప్రాంతాల్లో ఎంత విస్తీర్ణంలో రొయ్యల సాగు జరుగుతోందనే విషయం నిర్ధారించే బాధ్యత మత్య్స శాఖకు అప్పగించింది. ఇక కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపెడ) యాంటి బయోటిక్స్ వినియోగంపై నిఘా పెట్టనుంది. ఇందు కోసం సాగు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ చెయ్యడమే కాకుండా ఆ సాగు చేసే రొయ్యల చెరువును శాటిలైట్ మ్యాపింగ్ చెయ్యనుంది. ఇందు కోసం రాష్ట్ర మత్య్స శాఖ, ఎంపెడ అధికార్లు బృందాలుగా ఏర్పడి ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. మత్య్స శాఖ, ఎంపెడ బృందాలు ప్రతీ చెరువును శాటిలైట్ మ్యాపింగ్ చేయడం ద్వారా ముందుగా సాగు వివరాలు కచ్చితంగా నిర్ధారించనున్నాయి. శాటిలైట్ మ్యాపింగ్ వల్ల ఏ సర్వే నెంబరులో చెరువు ఉంది, దాని విస్తీర్ణం ఎంత అనేది బహిర్గతం కానుంది. ఇక ఆయా చెరువులను సాగుచేసే రైతులు సాగు ప్రారంభం నుంచి అన్ని వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ రొయ్యలను హెడ్‌లెస్ చెయ్యడానికి ఎంత సమయం పట్టింది? ప్యాకింగ్ సమయం, కంటైనర్ పంపించడం తదితర వివరాలన్నీ కూడా ఆయా ప్రాసెసింగ్ ప్లాంట్లు నమోదు చేయాలి. ఈ వివరాలను ఎంపెడాకు ఆన్‌లైన్‌లో సమర్పించాలి. ఇక ప్రాసెసింగ్ చేసిన రొయ్యలను ఎగుమతి చేసే ప్యాకెట్లపై ఇప్పటి వరకు నాణ్యతా వివరాలు మాత్రమే నమోదు చేస్తున్నారు. ఇప్పుడిక చెరువు సర్వే నెంబరుతోపాటు సాగు వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలి.నమోదైన వివరాలన్నింటిని ఎంపెడ.. శాటిలైట్ ద్వారా రొయ్యలు దిగుమతి చేసుకునే దేశాలకు పంపిస్తుంది. తద్వారా దిగుమతిదార్లు ముందుగానే పరిశీలన చేసుకుని, ఆ కంటైనర్లను వీలైనంత త్వరగా మరో మారు పరీక్షలు జరిపి, ఆ దేశానికి పంపించుకోవడం జరుగుతుంది. దీనివల్ల రొయ్యల్లో నాణ్యత పెరిగి, వెనక్కి తిప్పి పంపే అవకాశముండదని ప్రభుత్వం భావిస్తోంది.

No comments:
Write comments