నీళ్లొచ్చాయి.. విత్తనాలకు రెక్కలొచ్చాయి..(కర్నూలు)

 

కర్నూలు, ఆగస్టు 21 (globelmedianews.com - Swamy Naidu): నదులకు, కాల్వలకు పుష్కలంగా నీరు రావడంతో పంటల సాగుకు అన్నదాతలు సమాయత్తమవుతున్నారు. ప్రధానంగా వరి పంట సాగు ముమ్మరం చేశారు. ఒక్కసారిగా రైతులందరూ వరి సాగు చేసేందుకు సిద్ధమవడంతో విత్తనాల ధరలకు రెక్కలొచ్చాయి. రైతుల అవసరాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ధరలు అమాంతం పెంచారు. ధరలు పెరగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కృష్ణా నదికి నీళ్లు రావడంతో పోతిరెడ్డిపాడు ద్వారా వెలుగోడు జలాశయానికి నీళ్లు వదిలారు. తెలుగుగంగ ద్వారా నీళ్లు వదలడంతో ఎస్సార్బీసీ కాల్వకు జలకళ సంతరించుకుంది. మల్యాల, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల ద్వారా హంద్రీనీవాకు నిప్పుల వాగు ద్వారా కేసీ కెనాల్‌కు నీళ్లు వదులుతున్నారు. తుంగభద్ర జలాశయం నుంచి నీళ్లు విడుదల చేయడంతో కేసీ కెనాల్‌ ప్రధాన కాల్వకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. జిల్లావ్యాప్తంగా ఒక్కసారిగా కాల్వలు జలకళను సంతరించుకున్నాయి. 
నీళ్లొచ్చాయి.. విత్తనాలకు రెక్కలొచ్చాయి..(కర్నూలు)
కాల్వలకు నీళ్లు రావడంతో పంటలు సాగుచేసేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు. ప్రధానంగా వరిపంట సాగుచేస్తున్నారు. దీంతో వరి విత్తనాలకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. జిల్లాలో సాధారణ వరి సాగు 70,120 హెక్టార్లు కాగా ఈనెల 5వ తేదీ వరకు కేవలం 4,066 హెక్టార్లు మాత్రమే సాగు చేశారు. కేవలం 6 శాతం విస్తీర్ణంలో మాత్రమే సాగైంది. ప్రస్తుతం నీళ్లు రావడంతో రైతులు వరి పంట సాగుకు సిద్ధమయ్యారు. దీంతో వరి విత్తనాలకు విపరీతంగా డిమాండ్‌ పెరిగింది. వరి విత్తనాల ఉత్పత్తికి నంద్యాల ప్రధాన కేంద్రంగా ఉంది. దీంతో నంద్యాలకు వందలాది మంది రైతులు వస్తున్నారు. వరి విత్తనాలకు డిమాండ్‌ పెరగడంతో వాటి ధరలకు రెక్కలొచ్చాయి. రైతుల అవసరాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌ ప్రారంభంలో 25 కిలోల విత్తనాల సంచి ధర రూ.750 విక్రయించారు. క్రమంగా రూ.800కు పెంచారు. రెండురోజులుగా విత్తనాల ధర అమాంతం పెరిగింది. ప్రస్తుతం ప్యాకెట్‌ ధర రూ.900కు చేరింది. దీంతో విధిలేని పరిస్థితిలో వ్యాపారులు చెప్పిన ధరకే కొనుగోలు చేయక తప్పడం లేదు.
విత్తనాల ధరలకు ప్రభుత్వం నిబంధనలు విధించింది. ప్యాకెట్‌ ధర రూ.1100 వరకు విక్రయించుకోవచ్చని అనుమతులు ఇచ్చింది. ఏటా రూ.800కు మించి విక్రయించడం లేదు. విత్తనాలకు డిమాండ్‌ పెరిగినప్పుడు ధరలు పెంచుతున్నారు. నిబంధనలు అడ్డు పెట్టుకుని సొమ్ముచేసుకుంటున్నారు. విత్తనాల మద్దతు ధర తగ్గించాలని రైతులు కోరుతున్నారు. విత్తన కంపెనీలు రైతుల నుంచి విత్తనాలు సేకరిస్తున్నాయి. వారికి క్వింటాలుకు కేవలం రూ.1,500 మాత్రమే చెల్లిస్తున్నారు. ప్యాకెట్‌ ధర రూ.800 ప్రకారం విక్రయించినా క్వింటాలుకు రూ.3,200 వస్తుంది. కానీ ప్రభుత్వం రూ.4,400 ధర నిర్ణయించింది. దీన్ని కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.

No comments:
Write comments