సొంత బలంపై అఖిలేష్ అంచనాలు

 

లక్నో, ఆగస్టు 26, (globelmedianews.com - Swamy Naidu)
ఉత్తరప్రదేశ్ లో నామమాత్రంగా మారిన పార్టీకి జవసత్వాలు అందించేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ నడుంబిగించారు. పార్టీలో నూతనోత్తేజం నింపాలని యోచిస్తున్నారు. వరస ఓటములతో పార్టీ శ్రేణులు పూర్తిగా నైరాశ్యం లోకి వెళ్లిపోయాయి. మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి పార్టీని సమాయత్తం చేయాలన్నది అఖిలేష్ యాదవ్ ఆలోచనగా కన్పిస్తుంది. అందుకే పార్టీ విభాగాలన్నింటినీ రద్దు చేశారు. ఒక్క పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి మాత్రమే అఖిలేష్ యాదవ్ మినహాయింపు నిచ్చారు.వరస ఓటములను ఉత్తరప్రదేశ్ లోని సమాజ్ వాదీ పార్టీని కోలుకోలేకుండా చేశాయి. శాసనసభ, లోక్ సభ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ అనుసరించిన వ్యూహం ఫలించలేదు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఓటమి పాలయ్యారు. 
సొంత బలంపై అఖిలేష్ అంచనాలు
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను పక్కన పెట్టుకుని తనకు బద్ధ శత్రువైన మాయావతి సారథ్యంలోని బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది.బీఎస్పీ పొత్తుతో అఖిలేష్ యాదవ్ యూపీలో కొత్త చరిత్రకు తెరలేపారు. పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధిస్తే మాయావతిని దేశ రాజకీయాల్లోకి పంపి తాను రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పవచ్చని భావించారు. కానీ యూపీ లోక్ సభ ఎన్నికల్లో 80 సీట్లకు గాను సమాజ్ వాదీ పార్టీ కేవలం ఐదు సీట్లను మాత్రమే సాధించింది. బీఎస్సీ పది సీట్లను గెలుచుకుంది. రెండు పార్టీల ఓట్లు ఒకరికొకరికి బదిలీ కాకపోవడంతో అన్ని సీట్లనూ బీజేపీ ఎగురేసుకుపోయింది.దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సొంతంగా సత్తా చాటాలని అఖిలేష్ యాదవ్ భావిస్తున్నారు. అందుకే పార్టీ విభాగాలన్నింటినీ రద్దు చేశారు. పాత వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని అఖిలేష్ యాదవ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకవైపు తండ్రి ములాయం సింగ్ కు పార్టీ బాధ్యలను అప్పగిస్తారనుకుంటున్న తరుణంలో అఖిలేష్ యాదవ్ తీసుకున్న నిర్ణయం నిజంగా సంచలనమనే చెప్పుకోవాలి. ఆయన ఈసారి ఎన్నికలకు ఎలాంటి వ్యూహం రచించనున్నారో మరి. మరోసారి అఖిలేష్ యాదవ్ సైకిల్ యాత్ర చేస్తారన్న ప్రచారం పార్టీలో విన్పిస్తుంది.

No comments:
Write comments