కరవు కాటేసింది.. (అనంతపురం)

 

అనంతపురం, ఆగస్టు 21 (globelmedianews.com- Swamy Naidu): జిల్లాలో వ్యవసాయం శతకోటి సమస్యలకు.. అనంత కోటి ఆపదలకు చిరునామాగా మారింది. వర్షాధారం.. అందులోనూ వేరుసెనగ సాగే రైతులకు ప్రధాన జీవనాధారం.. అందుకే ఎన్నిసార్లు వ్యవసాయ జూదంలో ఓడినా ఆశ చావక పదేపదే ఖరీఫ్‌లో వేరుసెనగ వైపే మొగ్గు చూపుతున్నారు. కానీ ఏటా వాతావరణం అనుకూలించడం లేదు. ఈసారి జిల్లా వ్యాప్తంగా నాలుగోవంతు కూడా పంట సాగు కాలేదంటే అనావృష్టి ఎంతటి విలయతాండవం చేస్తుందో ఇట్టే అర్థమవుతుంది. అందులోనూ కదిరి ప్రాంతంలో కరవుకే కరవొచ్చింది. ఖరీఫ్‌ ఆరంభం నుంచి చినుకు నేల రాలలేదు. విత్తుకు పదును కాలేదు. అరకొర తేమకే వేసిన విత్తనం మొలకెత్తక కొంత, మొలకలయ్యాక కొంత పంట ఎండుతోంది. మరోవైపు తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. గ్రాసంలేక పశువులను కబేళాలకు తరలిస్తున్నారు. 
కరవు కాటేసింది.. (అనంతపురం)
సొంతూరులో జీవనం కష్టమై ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసలకు సిద్ధమయ్యారు. మరో పదిహేను రోజుల్లో వినాయక చవితి పూర్తయితే మూటముళ్లు సర్దుకోవాల్సిందేనని అన్నదాతలు మదనపడుతున్నారు. వృద్ధులు, చిన్నారుల సంగతే సమస్యగా భావిస్తున్నారు. కదిరిలో వ్యవసాయమే జీవన ఆధారం.. ఎన్నడూ లేని విధంగా ఈసారి వర్షాభావం నెలకొంది. గతంలో విత్తనం వేసిన తర్వాత వానలు పడక పంటలు ఎండేవి. ఈ ఏడాది మాత్రం విత్తుకే పదును వర్షం కురవని దైౖన్యం. సాగుపై ఆశతో ఆపసోపాలు పడి ప్రభుత్వ రాయితీ విత్తనం కొనుగోలు చేశారు. కొన్న విత్తనం సిద్ధం చేశారే గానీ సాగు చేసింది కొంతే. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌ వేరుసెనగ సాధారణ సాగు విస్తీర్ణం 7 లక్షల హెక్టార్లు. అయితే జులై చివరి నాటికి కూడా వాన పడక పోవడంతో నాలుగో వంతు కూడా సాగుకు నోచుకోలేదు. రైతులు అష్టకష్టాలతో పొందిన విత్తనాన్ని నష్టానికి దుకాణాల్లో అమ్ముకోవాల్సి వచ్చింది. అరకొరగా విత్తువేసినా మొలకలోనే ఎండిపోతోంది. మరోవైపు వ్యవసాయానికి ప్రత్యామ్నాయమైన పాడిపైనా ప్రభావం పడింది. ఇప్పటికే గ్రాసానికి భారంగా ఉన్న పాడిరైతులు పూర్తిస్థాయిలో మేత కొనుగోలుకు భయపడి పాడిపశువులు అమ్ముకుంటున్నారు. పాడిపశువులు కొనేందుకు రైతులెవరూ ముందుకు రాకపోవడంతో కబేళాలకు అడిగిన ధరకే అమ్మేయాల్సి వస్తోంది. పంట రుణం, పాడిపరిశ్రమ పెట్టుబడి రెండు నష్టపోవడంతో ఉపాధి మార్గం మూసుకుపోయింది. వలసలే శరణ్యంగా రైతాంగం భావిస్తోంది. వినాయక చవితి పండగ తర్వాత వలస వెళ్లాలన్న నిర్ణయంతో రైతులు దిగాలుగా ఉన్నారు. కరవు ప్రాంతాల్లోని రైతులు, రైతు కూలీలకు ఉపాధి పనులు కల్పించే భరోసాతో పథకం అమలవుతోంది. అయితే గతేడాది నుంచి ఉపాధి బిల్లులు సక్రమంగా అందటం లేదు. జాబ్‌కార్డు కలిగిన రైతులు, రైతు కూలీలు పనులు చేశారు. ఒక్కొక్కరికి రూ.5 వేల దాకా బిల్లులు రావాల్సి ఉంది. అయితే కేంద్రం నుంచి నిధులు రాకపోవడంతోనే కూలీ సొమ్ము చెల్లింపులో జాప్యం నెలకొంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఇల్లు గడవని కూలీలు మళ్లీ పనులకెలా వెళ్లాలని వాపోతున్నారు. చేసిన కష్టానికి ఎప్పటికప్పుడు సొమ్ము పొందే చోటికి వెళ్లక తప్పడం లేదని పేర్కొంటున్నారు.గ్రామాల్లో తిండికే కాదు తాగునీటికీ కష్టంగా మారింది. వర్షాభావంతో బోర్లు, బావులు అడుగంటాయి. ట్యాంకర్లతో సరఫరా చేసినా ఎప్పుడొస్తాయో తెలియని దుస్థితి నెలకొంది. మనుషుల దాహార్తికే ఆందోళన పరిస్థితి. మూగజీవాలకు ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలని గ్రామీణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సొంత గ్రామంలో ఉంటే ఆనందమే.. కాకపోతే ఆకలి, దప్పులతో గడిపేదెలాగని ఆవేదన చెందుతున్నారు. కరవు పరిస్థితులపై ప్రభుత్వాలు పరిశీలనలు, అధికారులు అధ్యయనాలు చేస్తున్నా.. జీవనానికి తక్షణ ఉపాధి కల్పనలో తగిన చర్యలు లేవని జనం ఏకరవు పెడుతున్నారు.

No comments:
Write comments