నీళ్లొచ్చినా లాభమేదీ..? (ఖమ్మం)

 

ఖమ్మం, ఆగస్టు 23 (globelmedianews.com - Swamy Naidu): సాగర్‌కు కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. కృష్ణా పరివాహకం జలకళను సంతరించుకుంది. పాలేరు జలాశయానికి భారీగా నీరు వచ్చి చేరుతుండడంతో ఆయకట్టుకు నీరందించేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రైతుల మోములో ఆనందం వ్యక్తమవుతోంది. ఇక్కడ వర్షాలు అంతగా లేకపోయినా సాగర్‌ నిండటం, అక్కడ నుంచి ఆయకట్టుకు నీరు అందుతుండటంతో రైతులు వరి సాగు చేయడానికి సన్నద్ధమవుతున్నారు. సాగర్‌ కాలువలను చూస్తే అన్నదాత గుండె తరుక్కుపోతుంది. ఆధునికీకరణ పనులు చేసినా.. చివరి వరకు నీరు వస్తుందనే నమ్మకం కుదరడం లేదు. తూములు శిథిలావస్థలో ఉండటం, కాలువల నిండా చెత్తాచెదారంతోపాటు కంప చెట్లు పెరగడంతో రైతులకు ఇబ్బందులు తప్పేలా లేదు. ఖమ్మం జిల్లాలోని సాగర్‌ ఆయకట్టులోని కాలువలు చాలావరకు అధ్వానంగా ఉన్నాయి. 
నీళ్లొచ్చినా లాభమేదీ..? (ఖమ్మం)
తూములకు షట్టర్లు లేకపోవడం, లైనింగ్‌ దెబ్బతినడం, తూములు శిథిలమవడం, కాలువల నిండా ముళ్లకంప పెరిగి దర్శనమిస్తున్నాయి. ఈ దుస్థితిలో ఉన్న కాల్వల్లో నీరు సాఫీగా ప్రవహించే పరిస్థితి కనిపించడంలేదు. గతేడాది నుంచి వీటికి ఇంత వరకు ఎలాంటి మరమ్మతులు చేయలేదు. ప్రపంచ బ్యాంకు ఆర్థికసాయంతో 2008లో రూ.వందల కోట్లు వెచ్చించి ఆధునికీకరణ పనులు చేపట్టారు. ఇంకా ఆయా ప్యాకేజీలకు సంబంధించిన పనులు వందశాతం పూర్తికాలేదు. కేవలం ప్రధాన కాలువలు, బ్రాంచి కాలువలు, మేజర్లకు మాత్రమే ఈ పనులు చేశారు. ఒక్కో బ్రాంచి కాలువ పరిధిలో 10 నుంచి 15 వరకు మేజర్లు ఉండగా, మేజర్‌ పరిధిలో 5 నుంచి 10 వరకు మైనర్లు ఉన్నాయి. మేజర్ల నుంచి రైతు పొలానికి నీరు అందాలంటే మైనర్లు కూడా చాలా కీలకం. వాటికి గత పదేళ్ల నుంచి మరమ్మతుల ఊసేలేదు. దీంతో చాలావరకు ఆనవాళ్లు కోల్పోయాయి. కాలువల లోపల, కట్టలపైనా ముళ్లకంప ఆక్రమించింది. నీటి కోసం కాలువ మీద తిరగడానికి కూడా ఆస్కారం లేకుండా ఉన్నాయి. పనుల సమయంలో తప్ప ఇంత వరకు ఎన్నెస్పీ అధికారుల జాడలేదని రైతులు ఆరోపిస్తున్నారు.చివరికి అందేనా.. కాలువలు అధ్వానంగా ఉండటంతో చివరి ఆయకట్టుకు నీరందడం గగనంగా ఉంది. ప్రస్తుతం సాగర్‌ ఆయకట్టు పరిధిలో పత్తి, మొక్కజొన్న సాగవుతుండగా, ఇప్పుడిప్పుడే మిరప సాగు చేపట్టారు. సాగర్‌ జలాలు వస్తుండటంతో మాగాణి భూముల్లో వరి సాగు చేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. బోనకల్లు, మధిర, నందిగామ బ్రాంచి కాలువల పరిధిలో మేజర్లు, మైనర్లు అధ్వానంగా ఉన్నాయి. గతేడాది కూడా ఈ బ్రాంచి కాలువల పరిధిలో చివరి ఆయకట్టు వరకు నీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రి సమయంలో కాలువల వెంట తిరిగి కిందకు నీరు తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం కాలువలు సక్రమంగా లేకపోవడం, తూములకు షట్టర్లు లేకపోవడం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నీటి వృథా ఎక్కువైంది. పెద్ద మేజర్ల పరిధిలో చివరి భూములకు నీరందలేదు. తల్లాడ, కల్లూరు సబ్‌ డివిజన్ల పరిధిలోనూ సాగర్‌ కాలువలు అధ్వానంగా ఉన్నాయి. మాగాణి భూములు అధికంగా ఉండటంతో వీటికి నీరు అధికంగా అవసరం. చివరి ఆయకట్టుకు నీరందాలంటే అధికారుల పర్యవేక్షణ అధికంగా ఉండాలి.

No comments:
Write comments