ఏజెన్సీల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపం

 

కర్నూలు, ఆగస్టు 24, (globelmedianews.com - Swamy Naidu)
కోడిగుడ్లు సరఫరా చేస్తోన్న ఏజెన్సీల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారుతోంది. మురిగిన గుడ్లు సరఫరా చేస్తూ చేతులు దులుపుకొంటుండగా, కమీషన్ల మత్తులో అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్న పాఠశాలల్లో గతంలో వారానికి మూడు సార్లు కోడి గుడ్డు  అందజేసేవారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి వారానికి ఐదు గుడ్లు అందజేస్తున్నారు.దృష్టి సారించరేం?: కోడిగుడ్ల సరఫరా చేసేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ఏజెన్సీ హైదరాబాద్‌ ఫౌల్ట్రీల నుంచి రెండు వారాలకోసారి జిల్లాకు గుడ్లను ఇస్తున్నారు. ఒక్కో గుడ్డుకు సుమారు రూ.4.68 ప్రభుత్వం చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. సరఫరా సమయంలో ఎగుమతి, దిగుమతి చేసేటప్పుడు, మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేసిన గోదాముల నుంచి ఇచ్చేటప్పుడు ఎక్కువగా పగిలిపోయిన గుడ్లు వస్తున్నాయి. 
ఏజెన్సీల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపం
దీంతో గుడ్లు త్వరగా దెబ్బతిని దుర్వాసన వస్తుండగా.. మరికొన్ని వర్షాలకు తడిచి మురిగిపోయాయి. ఏజెన్సీ దెబ్బతిన్న గుడ్లనే అన్ని పాఠశాలలకు సరఫరా చేసింది. గత రెండు వారాలుగా ఫిర్యాదులు అధికంగా వస్తున్నా, సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. మరికొన్నిచోట్ల బరువు తక్కువ గుడ్లు వస్తున్నాయని అధికంగా ఫిర్యాదులు అందడంతో దీన్ని ఆధారంగా చేసుకుని కొన్ని పాఠశాలలకు ఏజెన్సీ సరఫరా నిలిపివేశారు. గతంలోనూ ఇలా సరఫరా చేయకుండానే బిల్లులు తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ప్రాథమిక(1976 పాఠశాలల్లో) 1.99 లక్షల మంది విద్యార్థులు, 485 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1.03 లక్షల మంది, 457 ఉన్నత పాఠశాలల్లో 57,630 మంది మధ్యాహ్న భోజనాన్ని తింటున్నారు. ఇలా చూస్తే వారానికి ఐదు రోజుల చొప్పున 3.59 లక్షల కోడి గుడ్లు భోజనంలో అందజేస్తున్నారు. ప్రతి నెలా 18 లక్షల కోడిగుడ్లను ఏజెన్సీ సరఫరా చేస్తోంది. నీలం, ఎరుపు, పసుపు, పచ్చ, బ్రౌన్‌ రంగుల్లో గుడ్లపై స్టాంపులు వేసి వారానికి ఒక రంగుతో సరఫరా చేయాల్సి ఉంటుంది. బయట మార్కెట్‌లో అక్రమంగా 
అమ్మకాలు చేయకుండా ప్రభుత్వం ఈ పద్థతిని అవలంబిస్తోంది.ఒక్కో గుడ్డులో 13 రకాల విటమిన్లు, ఖనిజ లవణాలు, ఆరు గ్రాముల మాంసకృత్తులతోపాటు... మనిషికి అవసరమైన తొమ్మిది రకాల అమినో ఆమ్లాలుంటాయి. ఈ పౌష్టికాహారం చిన్నారుల దరి చేర్చి, విద్యాభివృద్ధికి కృషి చేయడానికి మధ్యాహ్న భోజన పథకంలో కోడి గుడ్లు అందిస్తున్నారు. ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో అందించే గుడ్లు కుళ్లి దర్శనమిస్తున్నాయి. గత రెండు వారాలుగా జిల్లాలో ఎక్కడ చూసినా ఇదే సమస్య తలెత్తుతోంది. కొన్ని గుడ్లు అట్టల్లోనే కుళ్లి దుర్వాసనతోపాటు, పురుగులు బయటకు వస్తున్నాయి. మరికొన్ని గుడ్లు ఉడకబెడుతుండగా నీళ్లలో వేయగానే పైకి తేలుతున్నాయి. ఇలా ఒక్కో పాఠశాలలో రోజుకు 30-60 కోడి గుడ్లు వృథాగా పడేస్తున్నారు. జిల్లాలో సరాసరిన రోజుకు 80 వేలకు పైగా గుడ్లు పడేస్తున్నట్లు తెలుస్తోంది. మరికొందరు ఏజెన్సీ నిర్వాహకులు పట్టనట్లు దెబ్బతిన్న గుడ్లనే విద్యార్థులకు భోజనంలో పెడుతున్నారు. ఆశగా తినబోతున్న విద్యార్థులకు కుళ్లిన వాసన వస్తుండటంతో ఉడకబెట్టిన గుడ్లను సైతం పడేస్తున్నారు. మరికొన్నిచోట్ల బాగున్న వాటిని రెండుగా చేసి అర గుడ్డు చొప్పున విద్యార్థులకు అందిస్తున్నారు.

No comments:
Write comments