ఓడినా... హవా కొనసాగిస్తున్న ఆమంచి

 

ఒంగోలు, ఆగస్టు 14, (globelmedianews.com - Swamy Naidu)
ప్రకాశం జిల్లా చీరాల నియోజవకర్గం రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. రాజకీయ పండితులను సైతం విస్మయానికి గురి చేస్తున్నాయి. ఒకప్పుడు రోశయ్య వంటి రాజకీయ మేధావులు చక్రం తిప్పిన ఈ నియోజక వర్గంలో గతంలో రాజకీయాలు ప్రశాంతంగా ఉండేవి. అయితే, 2014 నుంచి మాత్రం ప్రతి రోజూ ఈ నియోజకవర్గం మీడియాలో నిలుస్తోంది. 2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఆమంచి కృష్ణమోహన్‌.. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి విజయం సాధించారు. దీనికి ముందు జరిగిన 2009 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు.అయితే, రాష్ట్ర విభజన ఎఫెక్ట్‌తో ఆయన సొంతంగానే నవోదయం అనే పార్టీ టికెట్‌పై పోటీ చేశారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆయన అప్పటి అధికార పార్టీ టీడీపీలోకి జంప్‌ చేశారు. ఈ క్రమంలోనే తన ఆధిపత్యం పెంచుకునేందుకు ప్రయత్నించారు. 

 ఓడినా... హవా కొనసాగిస్తున్న ఆమంచి
ఇదే సమయంలో టీడీపీ నేతలతో సఖ్యత లేని విధంగా వ్యవహరించారు. పార్టీలో ఉన్నారే కానీ.. పార్టీ తరఫున ఏ ఒక్క కార్యక్రమంలోనూ పాల్గొన్నది లేదు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు జనార్దన్‌తోనూ తెరచాటు విభేదాలు నడిచాయి. ఇక, అధినేత చంద్రబాబు పాల్గొన్న ఒకటి రెండు కార్యక్రమాలకు హాజరైనా అంటీ ముట్టనట్టే వ్యవహరించారు. నియోజకవర్గంలో అన్నీ తానే అయి చక్రం తిప్పారు.ఇక, 2019 ఎన్నికల సమయానికి ఆయన టీడీపీ నుంచి అనూహ్యంగా వైసీపీ లోకి జంప్‌ చేశారు. వైసీపీ తరఫున చీరాల టికెట్‌ సంపాయించుకున్నారు. అయితే, ఎన్నికల్లో మాత్రం టీడీపీ నుంచి పోటీ చేసిన కరణం బలరాం విజయం సాధించారు. అధికారంలోకి మాత్రం వైసీపీ వచ్చింది. దీంతో ఆమంచి మరోసారి పైచేయి సాదించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఆమంచి తనకు అనుకూలంగా ఉండే పోలీసు, రెవెన్యూ అధికారులను నియోజకవర్గంలో నియమించుకున్నారు. తాను ఓడినా.. తనపార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆయన తన హవా సాగించాలని నిర్ణయించుకున్నారు.ఇదే ఇప్పుడు వివాదంగా మారి.. చీరాల రాజకీయాలను హీటెక్కించింది. ఎన్నికల్లో ప్రజలు తనను గెలిపించారు కాబట్టి తన ఆధిపత్యమే చెల్లాలని టీడీపీ నాయకుడు కరణం అధికారులపై చెలరేగుతున్నారు. అయితే, మా పార్టీ అధికారంలో ఉండగా .. అధికారులైనా ఎవరైనా మా మాటే వినాలని ఆమంచి డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా చీరాల పాలిటిక్స్‌ గరం గరంగా మారాయి. మరి ఎప్పటికి చల్ల బడతాయో చూడాలి.

No comments:
Write comments