హరిత హారానికి అడ్డంకులు (నిజామాబాద్)

 

నిజామాబాద్, ఆగస్టు 21 (globelmedianews.com - Swamy Naidu): హరితహారంలో తూతూ మంత్రం పనులకు తావు లేకుండాపోవడంతో జిల్లాలో ఇప్పటి వరకు లక్ష్యంలో కేవలం 20 శాతం మాత్రమే పూర్తి చేసుకొన్నారు. చట్టం కఠినంగా ఉండటంతో క్షేత్రస్థాయి సిబ్బంది, ప్రజాప్రతినిధులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. గతంలో ప్రభుత్వం గ్రామానికి ఒక లక్ష్యం నిర్దేశించి మొక్కలు పంపించి వాటిని నాటాలని సూచించేది. అధికారుల ఆదేశాల మేరకు ఉపాధి హామీ, ఇతర శాఖల సిబ్బంది ప్రభుత్వ స్థలాలు, రోడ్లకు ఇరువైపులా, వ్యవసాయ క్షేత్రాల్లో వాటిని నాటించేవారు. ఆ మొక్కలు బతుకుతాయా లేదా అనే అంశాన్ని అంతగా పరిగణనలోకి తీసుకునేవారు కాదు. దీంతో పెద్దగా ఇబ్బంది లేకుండానే అనుకున్న లక్ష్యాన్ని అందుకునేవారు. నూతన పంచాయతీరాజ్‌ చట్టంలో నాటిన వాటిల్లో 85 శాతమైనా బతికించాలనే నిబంధన పెట్టినట్లు సర్కారు వెల్లడించింది. 
హరిత హారానికి అడ్డంకులు (నిజామాబాద్)
ఇది అమలు కాని చోట సిబ్బందిపై చర్యలుంటాయని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగా మొక్కుబడి తంతు చేపట్టే పరిస్థితి లేదు. లెక్కలు చూపడానికే నాటితే పశువులు, ఇతర కారణాలతో వాటిని రక్షించడం కష్టమవుతుందని సిబ్బంది భావిస్తున్నారు. అనువైన స్థలాలను ఎంపిక చేసుకొని ముందుకెళ్లాలనుకుంటున్నారు. అవసరం మేరకు ప్రదేశాలు దొరకక ఏం చేయాలో తోచక మదనపడుతున్నారు.గతేడాదితో పోలిస్తే ఈసారి హరితహారంలో మొక్కలు నాటేందుకు ఇచ్చే కూలి ఒక్కసారిగా తగ్గించారు. ఈ కారణంగా కూలీలు పనులు చేసేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. నిరుడు ఒక ఫీటున్నర గుంత తీయడానికి రూ.13.35, మొక్క నాటినందుకు రూ.4.06 కలిపి మొత్తం రూ.17.41 ఇచ్చేవారు. ఈసారి గుంత లోతును కేవలం ఫీటు మాత్రమే తీయాలని సూచిస్తున్నారు. ఇందుకు రూ.4.84, నాటినందుకు రూ.1.22 కలిపి మొత్తం రూ.6.06 చెల్లిస్తున్నారు. గతంలో కూలీలు తక్కువ సమయంలో వారికి కేటాయించిన మొక్కలు నాటి వెళ్లేవారు. ఆ తర్వాత ఇతర పనులు చేసుకునే అవకాశం దొరికేది. దీంతో ఈ కార్యక్రమం వారికి గిట్టుబాటయ్యేది. ఇప్పుడు కూలి తగ్గించడంతో సాయంత్రం వరకు పని చేసినా శ్రమకు తగిన డబ్బులు రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం పల్లెల్లో జోరుగా వరి నాట్లు కొనసాగుతున్నాయి. ఆ పనులకే కూలీలు దొరకడం లేదు. రోజుకు ఆడవారికి రూ.400, మగవారికి రూ.500 కూలి ఇస్తున్నారు. ఉపాధి హామీలో రోజుకు గరిష్ఠంగా రూ.200 మాత్రమే ఇస్తారు. ఈ నేపథ్యంలో అందరూ పొలం పనులకే మొగ్గచూపుతున్నారు. క్షేత్రస్థాయిలో ఇలాంటి పరిస్థితి ఉండటంతో ఉపాధి హామీ సిబ్బంది హరితహారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితి నుంచి బయట పడటానికి మహిళా సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి 10, విద్యార్థులకు అయిదేసి మొక్కలు పంపిణీ చేస్తున్నారు. మరి ఇలా తీసుకెళ్తున్న వారు నాటుతున్నారా? లేదా? అనే దానిపై స్పష్టత లేదు. పర్యవేక్షణా కొరవడింది.

No comments:
Write comments