అనంతలో నీటి కష్టాలు

 

అనంతపురం, ఆగస్టు 20, (globelmedianews.com - Swamy Naidu)
కదిరి మున్సిపాల్ పాలకులు, అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది. 20 రోజులుగా మంచినీరు సరఫరా కావడం లేదు. పార్నపల్లి రిజర్వాయర్ వద్ద మోటార్లు మరమ్మతుకు గురయ్యాయని అధికారులు చెబుతుండగా, మరోవైపు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో నీటి మట్టం అడుగంటిపోవడంతో పట్టణ ప్రజలు మరింత తాగునీటి విషయంలో ఆందోళన చెందుతున్నారు. ఆరేళ్ల క్రితం రూ. 100 కోట్లతో పార్నపల్లి నుండి కదిరికి పైప్‌లైన్ ద్వారా తాగునీటి పథకం ఏర్పాటుచేశారు. అయితే దాని పరిరక్షణలో అధికారులు, పాలకులు నిర్లక్ష్యం వల్ల వర్షాకాలంలో కూడా ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులుపడుతున్నారు. ఇలా ప్రతి ఏడాది వర్షాకాలం, ఎండాకాలం అన్న తేడా లేకుండా తాగునీటి సమస్య తలెత్తుతూనే వుంది. పార్నపల్లిలో ఇంటెక్‌వెల్‌కు నీళ్లు అందడం లేదని ఎమ్మెల్యే చాంద్‌బాషా, మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్, డిఈ వెంకటరమణలు వెళ్లి పరిశీలించి కలెక్టర్‌తో మాట్లాడి తాగునీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అనంతలో నీటి కష్టాలు
తామేం తక్కువంటూ కౌన్సిలర్ల బృందం ఆ మరుసటి రోజే పార్నపల్లి రిజర్వాయర్‌ను సందర్శించి హడావుడి చేశారేతప్పా ఇంతవరకు తాగునీటి సమస్య పరిష్కరించ లేదు. పార్నపల్లిలో రెండు మోటార్లు ఏర్పాటుచేయడంతోపాటు ప్రత్యామ్నాయంగా మరో మోటారు సిద్ధం చేసి తాగునీటిని సరఫరా చేసేవారు. మోటారులో సాఫ్ట్ పోయిందని, దాదాపు రూ. కోటి దాకా నిధులు వెచ్చించారేకానీ శాశ్విత పరిష్కారం చూపలేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. దీనికితోడు పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయం చూపడంలో కూడా ఇటు పాలకులు, అటు అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. పాలకులకు పార్నపల్లి వద్ద విద్యుత్ మోటార్ల మరమ్మతుల పేరుతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా విన్పిస్తున్నాయి. తూతూమంత్రంగా పత్రికా ప్రకటనలు చేయడం, పార్నపల్లి రిజర్వాయర్ వద్దకు వెళ్లి పరిశీలించినట్లుగా ప్రజలకు మభ్యపెట్టడమే కానీ సమస్య పరిష్కారానికి కృషి చేయలేదని పట్టణ ప్రజలు విమర్శిస్తున్నారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్, కమిషనర్ పార్నపల్లి రిజర్వాయర్‌ను తనిఖీ చేసేందుకు వాహనంలో వెళ్లేందుకు అద్దె రూపంలో లక్షల రూపాయలు బిల్లులు చేసుకుంటున్నారేకానీ నీటి సరఫరా విషయంలో పార్నపల్లిలో సందర్శించిన పాపాన కూడా పోలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. వాహనాలకు అద్దెలు తీసుకునేందుకు లక్షల రూపాయలు బిల్లులు పెట్టేందుకు వున్న శ్రద్ధ తాగునీటి సమస్య పరిష్కరించడంలో లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వల్ల పట్టణ ప్రజలు తాగునీరు సరఫరాకాక తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్‌ను వివరణ కోరగా పార్నపల్లిలో కదిరికి సరఫరా చేసే ఇంటెక్‌వెల్‌కు నీరు అందడంలేదని, అందువల్ల పైపులను వేసి, విద్యుత్ మోటార్లు మరమ్మతు చేయిస్తున్నామని, రెండు, మూడు రోజుల్లో తాగునీరు సరఫరా చేస్తామని చెప్పారు.

No comments:
Write comments