తెలంగాణ కేబినెట్ నుంచి ఈటెల ఔట్..? రెవెన్యూ చట్టం లీక్ పై గరం గరంగా కేసీఆర్

 

హైద్రాబాద్, ఆగస్టు 26, (globelmedianews.com - Swamy Naidu)
‘కొత్త రెవెన్యూ చట్టంలో ప్రస్తుత తహశీల్దార్లు, ఇతర స్థాయిలోని అధికార్ల హక్కులకు భంగం వాటిల్లే చర్యల్ని ప్రభుత్వం చేపట్టబోతోంది’.. కొత్తగా రూపొందిస్తున్న రెవెన్యూ చట్టం నుంచి బయటకు వచ్చిన లీకు ఇది. ఈ లీకు ఎంత వరకు నిజమో, కాదో తెలియదు కానీ.. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా హాట్ హాట్ చర్చ సాగుతోంది. ఓ వైపు ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు ఆందోళనతో కొత్త చట్టం వద్దంటూ వినతులు ఇస్తుండగా.. మరో వైపు.. ఈ లీకు బయటకు ఎలా వచ్చింది? దీన్ని లీక్ చేసింది ఎవరు? అంటే.. ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ అని కొన్ని పత్రికలు కోడై కూశాయి. రెవెన్యూ చట్టం గురించి ఎక్కడా బయట లీక్ చేయవద్దని మంత్రులకు, కలెక్టర్లకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే, మంత్రి ఈటల రాజేందర్‌ను కీసర ఆర్డీవో లచ్చిరెడ్డి కలిసేందుకు ప్రయత్నించారని, అయితే.. ఆయన లచ్చిరెడ్డిని తన ఇంటికి రాత్రి భోజనానికి రావాలని పిలిచారని, ఆ సందర్భంగా రెవెన్యూ ప్రక్షాళన విషయాన్ని లచ్చిరెడ్డి చెవిన వేశారని ఆ పత్రికలు వెల్లడించాయి.

 తెలంగాణ కేబినెట్ నుంచి ఈటెల ఔట్..?  రెవెన్యూ చట్టం లీక్ పై గరం గరంగా కేసీఆర్
దీంతో, లచ్చిరెడ్డి.. మేడ్చల్‌ తహశీల్దార్‌ గోవర్ధన్‌, తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘ నాయకుడు వంగా రవీంద్రరెడ్డిని కలిసి ప్రభుత్వ ఆలోచనను నిర్వీర్యం చేసేలా పథకాలు వేశారని పేర్కొన్నాయి. వీఆర్‌ఓలు కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని, ఓ ఉద్యమం కూడా చేపట్టాలని నిర్ణయించారని వివరించాయి. అయితే, ఇప్పుడు ఆ లీకు వ్యవహరమే మంత్రి ఈటల మెడకు చుట్టుకుంటుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అటు.. కలెక్టర్ల సమావేశంలో జరిగిన చర్చ బయటకు ఎలా పొక్కిందని సీఎం కార్యాలయ వర్గాలు షాక్‌లో ఉన్నాయి. కలెక్టర్లు లేదా మంత్రులే స్వయంగా లీక్ ఇస్తే తప్ప.. బయటికి పొక్కే ప్రస్తకే లేదని అంటున్నాయి. మంత్రి ఈటల లీకులు ఇచ్చారని వార్తలు వెలువడుతున్న తరుణంలో ఆయనపై సీఎం కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారని, మంత్రి వర్గం నుంచి ఈటలను ఏ క్షణమైనా తప్పించే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది. లీకులపై సీఎం కేసీఆర్‌కు ఆధారాలతో సహా సమాచారం అందిందని, రెవెన్యూ చట్టానికి తూట్లు పడేలా ఈటల వ్యవహారం ఉందని సీఎం ఓ అభిప్రాయానికి వచ్చారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఉద్యోగ సంఘాలు ఆందోళన బాటకు దిగే ఆలోచన కూడా ఈటలపై సీఎంకు ఆగ్రహం పెరగడానికి కారణమైందని పలు వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈటలకు మంత్రి వర్గం నుంచి ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. ఉద్యమ సమయం నుంచి ఈటలకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. తొలిసారి ప్రభుత్వం ఏర్పడ్డాక కీలక ఆర్థిక శాఖను కూడా అప్పగించారు. అయితే, రెండోసారి అధికారంలోకి వచ్చాక ఈటలకు మంత్రి పదవి ఇవ్వడానికి సీఎం అయిష్టత చూపారని, కానీ, చివరి నిమిషంలో పదవిని కట్టబెట్టారని, అదీ అంత ప్రాధాన్యం లేని ఆరోగ్య శాఖను కేటాయించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజా పరిణామాల నేపథ్యంలో ఈటలను పక్కనబెట్టేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారన్న కథనాలు వెలువుడుతున్నాయి.ఇదిలా ఉండగా, మంత్రి ఈటల లీకులిచ్చినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని, తాము కలిసిన సందర్భాన్ని అసత్య కథనాలతో ముడిపెడుతున్నారని రెవెన్యూ ఉద్యోగ 
సంఘాల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. మంత్రిని కలిసిన ఉద్దేశం వేరని, కానీ, పత్రికల్లో లీకులిచ్చినట్లు వార్తలు వచ్చాయని, వీటిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కొత్త చట్టాన్ని వ్యతిరేకించాలన్న ఆలోచన తమకు లేదని.. వీలైతే, చట్ట రూపకల్పనలో తమ వంతు పాత్ర ఉండాలని కోరుకుంటామని తేల్చి చెప్పారు.మంత్రి ఈటల లీకుల వ్యవహారం వెనుక సీఎం కేసీఆరే ఉన్నారా? అని కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈటలను తప్పించేందుకు పత్రికలకు పక్కాగా స్క్రిప్టు రాసి పంపించినట్లు సంచలన ఊహాగానాలు వస్తున్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు పత్రికలకు మాత్రమే లీకుల వ్యవహారంపై సమాచారం అందడం.. మరింత అనుమానానికి తావిస్తోందని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక సీఎం కార్యాలయ వర్గాలు ఉన్నాయని, ఇది 
ఓపెన్ సీక్రెట్ అనీ చర్చించుకుంటున్నారు. రాజేందర్‌ను పదవి నుంచి తప్పించాలన్న లక్ష్యంతోనే ఇదంతా చేశారని చెబుతున్నారు. ఇది నిజమో కాదో తెలియాలంటే.. స్వయంగా సీఎం కేసీఆర్ లేదా.. మంత్రి ఈటల బహిరంగంగా ప్రకటించాల్సి ఉంది. లేకపోతే.. మున్ముందు పరిణామాలను చూస్తూ తెలుసుకోవాల్సిందే.

No comments:
Write comments