నష్టాల ఊబిలో అన్నదాత

 

ఏలూరు ఆగస్టు 24, (globelmedianews.com - Swamy Naidu)
ఆరుగాలం కుటుంబ సభ్యులు మొత్తం రెక్కలు ముక్కలు చేసుకొని పంటలు పండించే రైతు నష్టాల ఊబిలోకి నెట్టబడుతున్నాడు. ఏటా వ్యవసాయ పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఎరువులు, పురుగుమందుల ధరలకు రెక్కలొచ్చాయి. నారు మడి దున్నడం నుంచి నూర్పిళ్లు వరకూ ట్రాక్టర్‌ ఖర్చులు, కూలి ఖర్చులు అధికమయ్యాయి. ఇన్ని రకాల పెట్టుబడులు పెట్టి, చీడపీడలు రాకుండా కాపాడుకొని పంట పండిస్తే దానికి ప్రభుత్వం సరైన గిట్టుబాటు ధర కల్పించడం లేదు. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా రాక రైతు దివాళా తీస్తున్నాడు. వ్యవసాయం పెట్టుబడులు భారీగా పెరిగాయి. వరి పంటకు పెట్టిన పెట్టుబడులు రాక రైతులు నష్టపోతున్నారు. ఒక ఎకరంలో వరిని పండించేందుకు దశలవారీగా సుమారు రూ.30 నుండి రూ.35 వేలు ఖర్చవుతుంది. ఈ ఖర్చు దశల వారీగా పరిశీలిస్తే... ఆకుమడి దుక్కు చేసేందుకు మూడు పర్యాయాలు భూమిని దున్నడం జరిగింది.
నష్టాల ఊబిలో అన్నదాత
దీనికి పశువులతో దున్నితే రూ.900, అదే ట్రాక్టర్‌ ద్వారా దున్నితే రూ.1,800 ఖర్చయింది. ఎకరం పొలానికి రెండు బస్తాల విత్తనాలు అవసరం. ఆర్‌జిఎల్‌ రకం విత్తనాలు రెండు బస్తాలకు రూ.1,400. నారు బాగా ఎదిగేందుకు ఎరువులు, గుళికలు, పురుగు మందులకు కలిపి సుమారు రూ.1000 ఖర్చయింది. పొలానికి బలం చేకూరేందుకు అవరసరమైన పచ్చిరొట్ట ఎరువులు మొదట వేసేందుకు సుమారు రూ.1000. నాట్లు వేసేందుకు దమ్ము దున్నడం, దమ్ములో వేసే డిఎపికి కలిపి రూ.5,000 ఖర్చయింది. నాట్లు వేసేందుకు అవసరమైన కూలి ఖర్చు సుమారు రూ.3,500. అలాగే అరగళ్ల చెక్కడానికి (పారపని) రూ.1000. అంటే ఆకుమడి దున్నడం నుంచి నాట్లు వేసే వరకూ ఎకరాకి 14,700 ఖర్చయింది. ఇంకా కలుపు తీసేందుకు రూ.2,000. వరినాట్లు వేసిన తరువాత కనీసం రెండు పర్యాయాలు ఎరువులు వేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించి పొటాష్‌, యూరియా, డిఎపి, గుళికలకు కలిపి సుమారు రూ.5,000. పురుగుమందులకు రూ.3000. పంట కోతలకు దాదాపుగా రూ.4,000. పంట నూర్పిళ్లకు రూ.3,000 వరకు ఖర్చు అవుతుంది. అంటే కలుపు తీయడం నుంచి నూర్పిళ్ల వరకూ 17,000 ఖర్చవుతుంది. మొత్తంగా చూసుకుంటే 31,700 వరకూ పెట్టుబడి అవుతుంది. చీడపీడలు ఎక్కువైతే వీటి ఖర్చు మరింత పెరిగి రూ.35,000 వరకూ వళ్తుంది.కాటా బస్తా ధాన్యం ధర ఏనాడూ రూ.1200కి మించి లేదు. ఎకరానికి సుమారు 30 బస్తా ధాన్యం పండితే, ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం రూ.36 వేలు వస్తుంది. పెట్టిన పెట్టుబడితో పోల్చితే వచ్చిన ఆదాయం దాదాపు అదే విధంగా ఉంది. ఇక అతి వృష్టి, అనావృష్టి, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే పంట ద్వారా ఆదాయం రాకపోగా, పెట్టిన పెట్టుబడి కూడా నష్టపోవాల్సి ఉంటుంది.ఎరువుల ధరలు తగ్గినట్లు ప్రభుత్వం చెబుతోంది. వాస్తవంగా గతేడాది కంటే వీటి ధరలు పెరిగాయి. గతంలో డిఎపి బస్తా రూ.900 నుండి రూ.950 వరకూ ఉంటే గతేడాది రూ.1200 ఉండేది. ఈ ఏడాది రూ.1500కు చేరింది. ప్రస్తుతం రూ.100 తగ్గి రూ.1400 ఉంది. పొటాష్‌ గతేడాది రూ.900 ఉండగా, ఈ ఏడాది రూ.1200కు పెరగ్గా, ఇప్పుడు రూ.100 తగ్గి ప్రస్తుతం రూ.1100 ఉంది. యూరియా గతేడాది రూ.270 ఉండగా, ఈ ఏడాది రూ.350కు పెరిగింది. ప్రస్తుతం ధర తగ్గిన తరువాత రూ.280కు విక్రయిస్తున్నారు. ఇక పురుగు మందుల ధరలు దాదాపు రెట్టింపయ్యాయి.ఎరువుల పురుగు మందుల ధరలను ప్రభుత్వం నియంత్రించకపోవడంతో రానురాను వ్యవసాయ రంగం తీవ్ర నష్టాల వైపు అడుగులు వేస్తుంది. కల్తీ ఎరువులు, పురుగు మందులను వ్యాపారులు రైతులకు అంటగడుతుండడంతో దిగుబడి పూర్తిగా తగ్గిపోయి తీవ్ర నష్టాల బారిన పడుతున్నారు. గిట్టుబాటు ధర కల్పించాల్సిన ప్రభుత్వం తనకేమీ సంబంధం లేనట్లు రైతులను గాలికొదిలేసింది. మార్కెట్లో బియ్యం కిలో రూ.50 నుండి రూ.70 ఉంటే, కాటా బస్తా ధాన్యం ధర ఏనాడూ రూ.1200కి మించి రైతుకు రావడంలేదు. దీంతో పెట్టుబడులు పెరిగి, ఆ మేరకు ఆదాయం రాక తీవ్ర నష్టాల ఊబిలో కూరుకుపోయి అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొంత మంది వరి, చెరకు పంటలను వదిలి ప్రత్యామ్నాయంగా సరుగుడు, ఇతర వాణిజ్య పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. ఏడాదికేడాదికి వ్యవసాయంలో పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. దీనికి తగ్గట్టు పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు దివాళా తీయవలసి వస్తుంది. ఎరువుల ధరలు తగ్గాయని ప్రభుత్వం చెబుతున్నా గతేడాదితో పోల్చితే పెరిగాయి. పురుగు మందులు ధరలు దాదాపుగా రెట్టింపయ్యాయి. ఈ పరిస్థితుల్లో వ్యవసాయం దండగ అనే పరిస్థితి దాపురించింది.

No comments:
Write comments