మీ సేవకు... గుడ్ బైయేనా....

 

నెల్లూరు, ఆగస్టు 12, (globelmedianews.cm - Swamy Naidu)
ఏపీ లో పౌర సేవలను అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్న మీ సేవ కేంద్రాలను రద్దు చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు  తెలుస్తోంది. అక్టోబరు 2నుంచి  అందుబాటులోకి రానున్నగ్రామ సచివాలయాలలోనే మీ సేవలో అందించే పౌర సేవలన్నీఅందేలా చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. రద్దు చేసే మీ సేవ కేంద్రాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అర్బన్‌ మీ సేవ కేంద్రాలు ఉంటాయా? లేక ఫ్రాంఛైజీల ద్వారా నడిచే మీ సేవ కేంద్రాలు ఉంటాయా అనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యతో మీ సేవలో పనిచేస్తున్న చిరుద్యోగులు రోడ్డునపడే అవకాశాలున్నాయి.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2003లో మీ సేవ (ఇ) సేవలు ఏర్పాటు చేశారు. మొదట్లో నాలుగు రకాల సేవలతో ప్రారంభమైన మీ సేవలో  ఈరోజు 367 రకాల ప్రభుత్వ సేవలు, మరో 30 రకాల ప్రైవేటు సేవలు అందుతున్నాయి.  ప్రభుత్వ పాలనకు సంబంధించి పౌర సేవలన్నీ దాదాపుగా మీ సేవలో లభ్యమవుతాయి. 
 మీ సేవకు... గుడ్ బైయేనా....

ప్రజలు దాఖలు చేసిన అర్జీలను కంప్యూటర్‌లో నమోదు చేసి సంబంధిత శాఖలకు పంపించడం మీ సేవ నిర్వాహకుల ముఖ్య విధి. రాష్ట్రవ్యాప్తంగా 11,054 కేంద్రాలకు ప్రభుత్వం దశల వారీగా అనుమతిలిచ్చింది. ఇందులో రెండువేలకు పైగా మీ సేవలు పనులు లేక నిరుపయోగంగా మారడంతో మూతబడ్డాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అర్బన్‌ మీ సేవ కేంద్రాలు సుమారుగా 200 వరకు ఉన్నాయి. ఇందులో ఒక్క విజయవాడలోనే 14 కేంద్రాలు నడుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఫ్రాంచైజీల కింద 9,020 మీ సేవ కేంద్రాలు ప్రజలకు సేవలందిస్తున్నాయి.ప్రస్తుతం ప్రైవేటు ఏజెన్సీల గడువు ముగియడంతో కార్పొరేట్‌ కంపెనీలకు మీ సేవ సాప్ట్‌వేర్‌ అగ్రిమెంట్లను బదిలీ చేస్తారని అనుకుంటున్న సమయంలో  త్వరలో ప్రారంభమయ్యే గ్రామ సచివాలయాల ద్వారానే పౌర సేవలందించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపినట్లు సమాచారం. మీ సేవలో అందించే పౌర సేవలను కేటగిరీల వారీగా విభజించారు. రెవెన్యూ సేవల్లో ఎ కేటగిరీ కింద అందించే 15 రకాల సేవలను దరఖాస్తు చేసుకున్న 15 నిమిషాల్లో ఆందుకు అవసరమైన సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా వ్యవసాయ భూములకు సంబంధించిన నీటి తీరువా బిల్లులు, మంచినీటి కుళాయి పనులు, రెసిడెన్సీ సర్టిఫికెట్లు ఆదాయసర్టిఫికెట్లు,  ఫీజు రీ ఎంబర్స్‌మెంట్‌ సర్టిఫికెట్లు లాంటివి ఉన్నాయి. కేటగిరి -బి కింద సింగిల్‌ విండో ల్యాండ్‌కన్వర్షన్‌, డాటెడ్‌ ల్యాండ్స్‌, టూటిల్‌ డీడ్‌, 22ఎ , 22ఎ(1), 22ఎ(1బి), 22ఎ1(డి), 22ఎ1(ఇ) టైటిల్‌ డీడ్‌ కమ్‌ పాస్‌బుక్‌, ఈడబ్ల్యుఎస్‌ సర్టిఫికెట్లు, ఆదాయ ధృవీకరణ పథకం, నో ఎర్నింగ్‌ సర్టిఫికెట్స్‌, పాన్‌బ్రోకర్‌, అడంగల్‌ కంప్యూటరైజ్డ్‌ అడంగల్‌ 1బి, ఇంటిగ్రేటెడ్‌ సర్టిఫికెట్‌, సర్టిఫైడ్‌ కాపీస్‌ ఇష్యూడ్‌ బై ఆర్డీఓ, కుటుంబ సభ్యుల వివరాలతో కూడిన సర్టిఫికెట్లు, మ్యాన్యువల్‌ అడంగల్‌, ఓబిసి, ఈబిసి, నో ఎర్నింగ్‌ సర్టిఫికెట్లు, వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయానికి సంబందించిన సర్టిఫికెట్లు, ఈ పాస్‌బుక్‌ రీ-ప్టేస్‌మెంట్‌, ఈ -పాస్‌బుక్‌ డూప్లికేట్‌, సినిమా లైసెన్స్‌ రెన్యూవల్స్‌్‌, లోన్‌ ఎలిజిబిలిటీ కార్డు(ఎల్‌ఇసి), పట్టా సబ్‌ డివిజన్‌ లాంటి కీలకమైన సేవలన్నీ మీ సేవ ద్వారానే దరఖాస్తు చేసుకునే విధంగా ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఇటువంటి కీలకమైన పౌర సేవలందించేందుకు సర్వీస్‌ ఛార్జీగా ప్రభుత్వం ఒక్కో దరఖాస్తుదారునుంచి  కొంత మొత్తం ఫీజు గా వసూలు చేస్తుంది.  అక్టోబరు 2 నుంచి మీ- సేవలు రద్దు కానుండటంతో వీటిల్లో పనిచేసే ఉద్యోగుల భవిష్యత్తు రోడ్డున పడుతుందని పలువురు ఆందోళన చెందుతున్నారు.

No comments:
Write comments