ట్రబుల్ షూటర్ కు తప్పని కష్టాలు

 

కాకినాడ, ఆగస్టు 6, (globelmedianews.com - Swamy naidu)
రాజకీయాల్లో లక్కు చిక్కడం ఎంత కష్టమో.. తోట త్రిమూర్తులును చూస్తే.. తెలుస్తుందని అంటున్నారు పరిశీలకులు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నుంచి నాలుగు సార్లు గెలిచిన ఆయన ఇప్పటికీ మంత్రిగా చక్రం తిప్పాలని అనుకున్న తన కలను మాత్రం నెరవేర్చుకోలేక పోయారు. తోట ఇండిపెండెంట్‌గాను, టీడీపీ నుంచి, కాంగ్రెస్ నుంచి… 2014లో మ‌ళ్లీ టీడీపీ నుంచి ఇలా పార్టీలు మారినా విజ‌యం సాధించారు. జిల్లా కాపుల్లో మంచి ప‌ట్టున్న ట్రబుల్ షూట‌ర్‌గా ఆయ‌న‌కు పేరుంది. మొత్తంగా ఆయన తన భవితవ్యాన్ని కేవలం చర్చలకే పరిమితం చేసి, దూకుడు ప్రదర్శించని కారణంగా కోల్పోయారని అంటున్నారు పరిశీలకులు.రాజకీయంగా దూకుడుగా ఉండే నాయకుడు తోట. కాపు సామాజిక వర్గంలో బలమైన నాయకుడిగా గుర్తిం పు పొందిన ఆయన.. రామచంద్ర పురంలోనూ తనకు సొంతగానే ఇమేజ్‌ సొంతం చేసుకున్నారు. 

 ట్రబుల్ షూటర్ కు తప్పని కష్టాలు

త‌న‌పై ఎంత వ్యతిరేక‌త ఉన్నా… వివాదాలు ఉన్నా ఆయ‌న వాటిని త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకోవ‌డంలో దిట్ట. ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు ఆయనకు అప్పటి విపక్షం వైసీపీ మంచి ఆఫర్‌ ప్రకటించింది. పార్టీలోకి రావాలని జగన్‌ స్వయంగా తోటను ఆహ్వానించారు. అంతేకాదు, తమ ప్రభుత్వం ఏర్పడితే.. మంత్రి పదవి కూడా ఇస్తామని హామీ ఇచ్చారు.ఇక, ఇదే విషయంలో వైసీపీని అభిమానించే కాపు నాయకులు కూడా ఆయనపై ఒత్తిడి తెచ్చారు. టీడీపీలో ఉండి ఏం చేస్తావు? వైసీపీలోకి వెళ్తే బెటరని సూచించారు. ఇక, వైసీపీలోని ఆయన సొంత వియ్యంకుడు, కృష్ణాజిల్లా జగ్గయ్య పేట ఎమ్మెల్యే సామినేని ఉదయ భాను కూడా తోట త్రిమూర్తులను ఆహ్వానించినట్టు సమాచారం. దీంతో సోషల్‌ మీడియాలోనూ పెద్ద ఎత్తున తోటపై కథనాలు వచ్చాయి. ఇంకేముంది రేపో మాపో.. పార్టీ మారిపోవడం ఖాయమని ప్రచారం జరిగింది. అయితే, తనపై ఎన్ని వత్తిళ్లు వచ్చినా .. తోట మాత్రం పార్టీ మార్పుపై ఎటూ ఆలోచించుకోలేక, ఎలాంటి నిర్ణయమూ తీసుకోకుండా కాలక్షేపం చేశారు.జ‌గ‌న్ వ‌ద్ద తోట త‌న‌కు రామ‌చంద్రాపురం సీటుతో పాటు త‌న కుమారుడికి కాకినాడ రూర‌ల్ సీట్లు ఇవ్వాల‌న్న కండీష‌న్ పెట్టగా జ‌గ‌న్ తిర‌స్కరించార‌న్న టాక్ వ‌చ్చింది. అయితే, ఇప్పుడు ఇదే విషయాన్ని ఆయన శిబిరం ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. అదే తోట త్రిమూర్తులు పార్టీ మారి వైసీపీ తీర్థం పుచ్చుకుని, ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఉంటే.. ఖచ్చితంగా గెలిచి ఉండేవారని, అంతేకాకుండా కాపుల కోటాలో మంత్రి పదవిని సైతం సొంతం చేసుకుని ఉండేవారని అంటున్నారు. మొత్తానికి తన నిర్ణయం తీసుకోవడంలో చూపిన జాప్యమే ఇప్పుడు తోటకు శాపంగా మారిందనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. మొత్తంగా కురసాల కన్నబాబు కాపుల కోటాలో మంత్రి పదవిని దక్కించుకుని చక్రం తిప్పుతున్నారు. సీనియ‌ర్‌గా ఎంతో అనుభ‌వం ఉన్న తోట ఇప్పట‌కీ త‌న కెరీర్‌లో తీర‌ని కోరిక‌గా ఉన్న మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకోలేక‌పోయారు.

No comments:
Write comments