దస్తావేజుల డిజిటలైజేషన్ లో రిజిస్ట్రేషన్ శాఖ

 

హైద్రాబాద్, ఆగస్టు 30, (globelmedianews.com)
స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ నూతన సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. పాతకాలం నాటి దస్తావేజులను డిజిటలైజేషన్ చేయడంతో పాటు స్టాంప్ పేపర్ల విక్రయాల్లో అక్రమాలకు తావులేకుండా పటిష్టచర్యలు చేపట్టాలని ఆ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. స్టాంపు పేపర్ల విక్రయాలకు సంబంధించి కృత్రిమ కొరత కలిగించకుండా, ఎలక్ట్రానిక్ పద్ధతిలో విక్రయించేందుకు ఆ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ విక్రయాలను కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు అప్పగించాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.దీనికి అనుమతి కోరుతూ సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా త్వరలో దీనిపై ఓ నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్టుగా ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. 
దస్తావేజుల డిజిటలైజేషన్ లో రిజిస్ట్రేషన్ శాఖ

స్థిరాస్తులకు సంబంధించి క్రయ, విక్రయాలు, ఒప్పందాలు, బ్యాంకుల రుణ ఒప్పందాలకు రిజిస్ట్రేషన్‌ల శాఖ ప్రత్యేకంగా స్టాంప్ పేపర్లను విక్రయిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రానికి అవసరమైన స్టాంప్ పేపర్ల ముద్రణ మహారాష్ట్రలోని నాసిక్‌లో జరుగుతోంది. అక్కడి నుంచి రాష్ట్ర రిజిస్ట్రేషన్‌ల శాఖ 20, 50, 100 రూపాయలు విలువ చేసే స్టాంపులను కొనుగోలు చేసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా స్టాంప్ వెండర్లకు విక్రయిస్తోంది.ఈ స్టాంపులను ప్రభుత్వ అనుమతి పొందిన వెండర్లు మాత్రమే ప్రజలకు విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో వెండర్లు స్టాంపుల కొరతను సృష్టిస్తుండడంతో పాటు అధిక ధరలను వసూలచేస్తూ ప్రజలు ఇబ్బందులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో వెండర్లపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతోపాటు స్టాంపులు అమ్మకాల్లోనూ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నగదు దుర్వినియోగం అయినట్టు ఆరోపణలు రావడంతో లావాదేవీలపై ఆంక్షలను విధించారు. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం అమల్లోకి తెచ్చిన ఈ స్టాంపుల విధానంతో చలాన్లలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట పడడంతో, ఇదే విధానాన్ని స్టాంపుల విక్రయాల్లోనూ తీసుకురావాలని ఆ శాఖ అధికారులు భావించారు.అందులో భాగంగా ఎలక్ట్రానిక్ స్టాంపులు విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని ఆ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీనిపై అధ్యయనం చేయడానికి ఇప్పటికే ఓ బృందాన్ని వేరే రాష్ట్రాలకు పంపించగా ఆ బృందం అక్కడ అధ్యయనం చేసి ఓ నివేదిక ఇచ్చింది. ఈ విధానం వలన పలు రాష్ట్రాల్లో సత్ఫలితాలు వస్తున్నాయని ఆ బృందం ప్రభుత్వానికి సూచించడంతో దీనినే ఇక్కడ అమలు చేయాలని ఆ శాఖ భావిస్తోంది.ఇదిలా ఉండగా 1860 నుంచి 1999 వరకు మాన్యువల్‌గా ఉన్న స్థిరాస్తుల దస్తావేజులను డిజిటలైజేషన్ చేయడానికి కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనికిగాను రూ.20 కోట్లను విడుదల చేసింది. ఈ డిజిటలైజేషన్ బాధ్యతలను తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్‌కు అప్పగించడంతో టెండర్లను ఆహ్వానించింది. వాస్తవానికి బ్రిటీష్ కాలం 1860 నుంచి స్థిరాస్తిలకు సంబంధించి దస్తావేజుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ అధికారికంగా జరుగుతోంది.100 ఏళ్లకు పైగా చేతితో రాసిన దస్తావేజులను గత ప్రభుత్వాలు నిర్లక్షం చేశాయి. అవి ప్రస్తుతం చిరిగిపోయే పరిస్థితిలో ఉన్నాయి. చేతిరాత ద్వారా తయారు చేసిన దస్తావేజులను రిజిస్ట్రేషన్ చేసేవారు. రెండు కాపీలను అమ్మకందారులకు, కొనుగోలు దారులకు ఇచ్చి మరో కాపీని రికార్డుల్లో భద్రపరిచేవారు. ఈ ప్రక్రియ 1999 వరకు కొనసాగింది. అనంతరం కంప్యూటరీకరణ మొదలయ్యింది.గతంలో చేతిరాతతో చేసినవి చిరిగిపోయే దశకు చేరుకోవడంతో ప్రభుత్వం డిజిటలైజేషన్ చేయాలని నిర్ణయించింది. 2005లో మొదటగా రికార్డులను డిజిటలైజేషన్ చేయగా అవి ఇప్పటివరకు ఆరువేల రికార్డులను డిజిటలైజేషన్ చేసినట్టుగా అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో మిగతా వాటిని ఆధునీకరించాలని ఆ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించడంతో దీనికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రభుత్వం రూ. 20 కోట్లను మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి అనంతరం పూర్తిస్థాయి డిజిటలైజేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

No comments:
Write comments