క్లాసులు ఖల్లాసేనా.. (కర్నూలు)

 

కర్నూలు, ఆగస్టు 19 (globelmedianews.com - Swamy Naidu): రాయలసీమ విశ్వవిద్యాలయానికి ఇంజినీరింగ్‌ కళాశాల మంజూరైంది. అధికారులు సైతం టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారు. భవన నిర్మాణాలు పూర్తైనా మౌలిక వసతులు కానరావడం లేదు. విద్యుత్తు పరికరాలు.. ప్రయోగశాల పనులు.. ఫర్నిచర్‌.. ఇలా చాలా పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. అధ్యాపకుల నియామకమూ జరగలేదు. మరోవైపు మొదటి విడత ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ముగిసింది. పలువురు విద్యార్థులు వివిధ విభాగాలను సైతం ఎంపిక చేసుకున్నారు. రాయలసీమ విశ్వవిద్యాలయం అనుబంధంగా ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) 2019-20 విద్యా సంవత్సరం నుంచి ఇంజినీరింగ్‌ విద్య అమలుకు అనుమతులిచ్చింది. భవన నిర్మాణాలు పూర్తి చేసేందుకు రూ.15 కోట్ల అంచనాతో వర్సిటీ అధికారులు ప్రారంభంలో హడావుడి చేశారు. 
క్లాసులు ఖల్లాసేనా.. (కర్నూలు)
ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో వర్సిటీ నిల్వ ఖాతా నుంచి గుత్తేదారుడికి రూ.7 కోట్లు మంజూరు చేయగా చకచకా ఐదంతస్తుల భవనాన్ని నిర్మించారు. ఇప్పటికీ చాలా పనులు పూర్తి చేయాల్సి ఉంది. ప్రయోగశాలలు, మరుగుదొడ్లు, విద్యుత్తు పరికరాలు, సముదాయ నిర్మాణాలు అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. అంచనా నిధుల్లో పెండింగ్‌ ఉన్న రూ.8 కోట్లు చెల్లిస్తేనే పనులు ప్రారంభిస్తామని కాంట్రాక్టర్ స్పష్టం చేశారు. ఒకవైపు ఇంజినీరింగ్‌ కళాశాల తరగతుల నిర్వహణకు సమయం ముంచుకొస్తుండగా.. మరోవైపు ప్రభుత్వం నుంచి పైసా కూడా రాలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమైన పనులు ఎలా పూర్తి చేయాలని వర్సిటీ అధికారులు తలలు పట్టుకున్నారు.ఆర్‌యూ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఒక్కో బ్రాంచిలో 60 మంది చొప్పున కంప్యూటర్‌ సైన్సు, ఎలక్ట్రానిక్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు నిర్వహిస్తున్నట్లు ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. మొదటి విడత కౌన్సెలింగ్‌ పూర్తయ్యేలోపు 240 సీట్లకుగాను 146 మంది విద్యార్థులు వర్సిటీ కళాశాలలో చేరేందుకు ఆప్షన్లు ఇచ్చుకున్నారు. గురువారంనాటికి 111 మంది మాత్రమే జాయినింగ్‌ రిపోర్టు ఇచ్చారు. కాగా కళాశాలకు ప్రభుత్వం ఏటా రూ.10 కోట్లు మంజూరు చేస్తే ఆ మొత్తం జీతాల చెల్లింపు, నిర్వహణకే సరిపోతుంది. అరకొరగా వచ్చే నిధులతో మిగిలిన పనులు చేపట్టలేని దుస్థితి. ఈ ఏడాది బడ్జెట్‌లోనూ కేటాయింపులు జరిగినప్పటికీ ఆచరణలోకి వచ్చేసరికి ఈలెక్క తగ్గిపోయే అవకాశం ఉంటుంది. 2019-20 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్‌ కళాశాలలో బోధకులు, సిబ్బంది, 240 మంది విద్యార్థులకు తరగతులు నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆవరణలోనే బాలబాలికలకు వసతి కల్పించాల్సి ఉంది. చాలా పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. కనీసం కళాశాల పేరు ఆవరణలో ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న భవనాల్లో 16వ తేదీ నాటికి అన్ని తరగతులు ప్రారంభమవుతాయని ఇంజినీరింగ్‌ కళాశాల సిబ్బంది తల్లిదండ్రులకు హామీ ఇస్తున్నారు. కానీ నిర్దేశించిన సమయానికి అన్నివిధాలా సిద్ధం చేయగలుగుతారా అన్నది సందేహమే.

No comments:
Write comments