కేసీఆర్ కు కశ్మీర్ టెన్షన్

 

హైద్రాబాద్, ఆగస్టు 10, (globelmedianews.com - Swamy Naidu)
జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దుతో పాటు ఆ రాష్ట్ర విభజన నిర్ణయంతో బీజేపీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. తాజాగా నిర్ణయంతో దేశవ్యాప్తంగా తమ పార్టీని మరింత బలోపేతం చేసుకోవడానికి బీజేపీ వ్యూహరచన చేస్తోంది. ఈ క్రమంలోనే కాశ్మీర్ అంశంతో తెలంగాణలోనూ బలపడేందుకు బీజేపీ నేతలు ప్లాన్ రెడీ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. గతంలో హైదరాబాద్ సంస్థానాన్ని దేశంలో విలీనం చేసిన ఘటన సర్దార్ పటేల్‌కు దక్కితే... కాశ్మీర్‌ను పూర్తిస్థాయిలో భారత్‌లో విలీనం చేసిన ఘనత బీజేపీకి, ప్రధాని మోదీకి దక్కుతుందని ఆ పార్టీ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని యోచిస్తున్నట్టు సమాచారం. 
 కేసీఆర్ కు కశ్మీర్ టెన్షన్
తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకు ఈ అంశాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం తెలంగాణ విమోచన దినోత్సవంపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. తెలంగాణ విమోచన దినోత్సవం జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం నిరాకరిస్తుండటంతో... ఈ అంశంపై ఫోకస్ చేయాలని బీజేపీ యోచిస్తోంది. అంతేకాదు తెలంగాణకు చెందిన ఎంఐఎం పార్టీ కాశ్మీర్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి... అలాంటి పార్టీతో టీఆర్ఎస్ స్నేహం చేస్తోందనే వాదనను తెరపైకి తీసుకురావాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. మొత్తానికి తెలంగాణలో బలపడేందుకు బీజేపీ రెడీ చేస్తున్న కాశ్మీర్ అంశాన్ని కేసీఆర్ ఏ రకంగా ఎదుర్కొంటారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్

No comments:
Write comments