స్టాంపుల్లేవ్..(కృష్ణాజిల్లా)

 

విజయవాడ, ఆగస్టు 23 (globelmedianews.com - Swamy Naidu): జిల్లాలో విద్యార్థులే కాదు వ్యాపారులు, ఇతర వర్గాల వారు నాన్‌జ్యుడీషయల్‌ పత్రాలు లభించక ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా రూ.100, రూ.50 విలువ కలిగిన పత్రాలు లభించక లావాదేవీలు ఆగిపోయాయి. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనూ, ప్రైవేటు వెండర్ల వద్ద కూడా దొరకడం లేదు. కొరతను సాకుగా చూపి కొంతమంది అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అవి కూడా ఖాళీ అయ్యాయి. ఇతర జిల్లాల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. స్థిరాస్తి క్రయ విక్రయాలపై ప్రభావం చూపుతోంది. జిల్లాలో స్తిరాస్థి వ్యాపారంతోపాటు ఇతర లావాదేవీలకు స్టాంపు పేపర్లు వినియోగిస్తారు. కాంట్రాక్టర్ల పనులు, ఒప్పందాలు, విద్యార్ధులు, ఉద్యోగులు, ప్రమాణ పత్రాలు సమర్పించేందుకు, న్యాయస్థానాల్లో హామీ పత్రాలు, అంగీకార పత్రాలు, అప్పులు ఇచ్చినప్పుడు ఇతర లావాదేవీలకు ఈ స్టాంపు పత్రాలను వినియోగిస్తారు. లైసెన్సు కలిగిన వెండర్ల వద్ద కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసిన వ్యక్తి పేరు దానిపై పేర్కొంటారు..
స్టాంపుల్లేవ్..(కృష్ణాజిల్లా)
కృష్ణా జిల్లాలో విజయవాడ రేంజి (డీఐజీ) పరిధిలో మచిలీపట్నం, విజయవాడ, విజయవాడ తూర్పు రిజిస్ట్రేషన్‌ జిల్లాలు ఉన్నాయి. ముగ్గరు జిల్లా రిజిస్ట్రార్ల పరిధిలో మొత్తం 28 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. ఈ కార్యాలయాల్లో ఎక్కడా స్టాంపు పత్రాలు లభించడం లేదు. ప్రైవేటు వెండర్ల వద్ద అతికష్టం మీద అధిక ధరలకు కొంటున్నారు. తెల్గీ కుంభ కోణం తర్వాత రూ.100 విలువ కలిగిన వాటి కంటే తక్కువ పత్రాలే వస్తున్నాయి. రూ.500 అంతగా రావడం లేదు. ఇవి ప్రభుత్వ ప్రింటింగ్‌ ప్రెస్‌ నాసిక్‌ నుంచి సరఫరా కావాల్సి ఉంది. అత్యంత భద్రత మధ్య ఇవి అక్కడ ముద్రిస్తారు. అక్కడి నుంచి తగిన సంఖ్యలో రావడం లేదు. స్టాంపు పత్రాల అవసరం, ఆవశ్యకత ఎంతో ఉంది. దీనికి అనుగుణంగా ముందస్తు ఇండెంట్‌ సమర్పించి నాసిక్‌ నుంచి తెప్పిస్తారు. ఇవి జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో నమోదైన తర్వాత సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వెళతాయి. అలాగే ప్రైవేటు వెండర్స్‌ దగ్గరకు వెళతాయి. అక్కడ నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి. గత నాలుగైదు నెలలుగా ఈ పత్రాలు జిల్లాకు రాలేదు. దీంతో వెండర్లు ఇష్టానుసారం ధరలు పెంచి విక్రయించారు. ప్రస్తుతం వారివద్ద కూడా పత్రాలు అయిపోయాయి. వారం కిందట నాసిక్‌ నుంచి స్టాంపు పత్రాలు జిల్లాకు వచ్చాయి. అయితే వాటిని అన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. దీనికి సర్వర్లు పనిచేయకపోవడం వల్ల ఇంతవరకు వాటిని వినియోగించే పరిస్థితి లేదు. ఇటీవల కాలంలో స్థిరాస్తి లావాదేవీలు స్తంభించాయి.

No comments:
Write comments