కమ్మేసిన కరవు మేఘం (కర్నూలు)

 

కర్నూలు, ఆగస్ట్ 03 (globelmedianews.com - Swamy Naidu): జిల్లాను మరోసారి కరవు మేఘం కమ్మేసింది. నిండుకుండల్లా ఉండాల్సిన ప్రాజెక్టులు ఎండిపోయి వెలవెలబోతున్నాయి. పల్లె, పట్టణం తేడా లేకుండా గొంతు తడుపుకోవడానికి జనం అల్లాడుతున్నారు. నీటి కోసం యుద్ధాలే చేస్తున్నారు. మరోవైపు చినుకు జాడలేక అన్నదాతలు చిత్తయ్యారు. జిల్లా ప్రజలను ప్రభుత్వం దృష్టిపెట్టి ఆదుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.కర్నూలు నగరానికి తాగునీటిని అందించే సుంకేసుల, గాజులదిన్నె పూర్తిగా ఎండిపోవడంతో నీటి ఎద్దడి పెరిగింది. ఇప్పటికే రోజుమార్చిరోజు ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నారు. నీటి సమస్యను అధిగమించడానికి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 16 బోర్లకు పైగా కొత్తవి తవ్వి వాటికి ట్యాంకులు అమర్చారు
కమ్మేసిన కరవు మేఘం (కర్నూలు)

బహుళ అంతస్థుల్లో ఉంటున్నవారు ట్యాంకరు నీటిని రూ.600 వరకు కొనుగోలు చేసి వాడాల్సిన పరిస్థితి ఉంది. కర్నూలు నగరానికి తాగునీటి సమస్య లేకుండా ఉండాలంటే గాజులదిన్నె ప్రాజెక్టులో 4.5 టీఎంసీల నీరు పెట్టాలి. దీనికి హంద్రీనీవా ప్రధాన కాల్వ 110 కి.మీ. వద్ద తూము ఏర్పాటు చేయాల్సి ఉంది. అందుకు రూ.5.10 కోట్లతో ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వానికి అందాయి. రెండేళ్ల నుంచి ఆచరణకు నోచుకోవడం లేదు. పశ్చిమ ప్రాంతంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. కోడుమూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరు, ఆదోని నియోజకవర్గాల పరిధిలో 28 మండలాల్లో నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ ఈ మండలాల పరిధిలోని సుమారు 205 గ్రామాల్లో ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. మరో 10 మండలాల్లో బోర్లు అద్దెకు తీసుకుని నీటిని అందిస్తున్నారు. ఇలా జిల్లాలో ప్రతి రోజూ ట్యాంకర్లతో 1400 ట్రిప్పులు తోలుతున్నారు. చాలీచాలని నీటితో చేసేది లేక దాహార్తి తీర్చుకోవడానికి పశ్చిమ ప్రాంతంలో చెలమలపై ఆధారపడుతున్నారు.జిల్లాలో నదులు, ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. సుంకేసుల 0.06 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇక గాజులదిన్నె ప్రాజెక్టు అయితే ఎండి రోజులు గడుస్తున్నాయి. దీంతో కర్నూలు, కృష్ణగిరి, బండగట్టు, డోన్, కోడుమూరుకు తాగునీటి సరఫరా ఆగిపోయింది. శ్రీశైలంలో 807 అడుగుల్లో నీటి మట్టం ఉండటం వల్ల పోతిరెడ్డిపాడు నుంచి నంద్యాల ప్రాంతానికి నీటి విడుదల లేదు. వెలుగోడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో ఉన్న 0.853 టీఎంసీని నంద్యాల ప్రాంతానికి నెలన్నరపాటు తీసుకునే అవకాశం ఉంది. నందికొట్కూరు, కర్నూలు ప్రాంతాలకు ముచ్చుమర్రి నుంచి తీసుకుందామనుకున్నా 810 అడుగులు నీటి మట్టం ఉంటేనే డ్రా చేసే వీలుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అవకాశమూ లేదు. తుంగభద్రలో ప్రస్తుతం వరద నీరు 18 టీఎంసీల వరకు వచ్చి చేరింది. ఈ నీటిలో జిల్లాకు కోటా ప్రకారం ఇంకా రెండు టీఎంసీలు అందాల్సి ఉంది. తాగునీటి అవసరాలకు వెంటనే ఒక టీఎంసీ అయినా అందేలా చూడగలిగితే నీటి యుద్ధాలను ఆపవచ్చు. ఈ ఏడాది జిల్లాను కరవు వెంటాడింది. వర్షాభావ పరిస్థితులతో ఖరీఫ్‌ సీజన్‌లో 60 రోజులు ముగిసినా... నేటికీ 23 శాతం పంటలే సాగయ్యాయి. గతేడాది 2.44 లక్షల హెక్టార్లలో పంటలు సాగవ్వగా, ఈ ఏడాది కేవలం 1.39 లక్షల హెక్టార్లలో పంటలు వేశారు. ఇప్పటివరకు పరిశీలిస్తే పగిడ్యాల, శ్రీశైలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. నందికొట్కూరు, కొత్తపల్లి, ఆత్మకూరు, ఓర్వకల్లు, ఆలూరు, అవుకు, దేేవనకొండ, హాలహర్వి వంటి 9 మండలాల్లో సాధారణ వర్షపాతం కురిసింది. మిగిలిన 43 మండలాల్లో తీవ్ర వర్షాభావం నెలకొంది. పెట్టుబడి రూ.కోట్లల్లో మట్టిపాలైనట్లైంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఈ ఏడాది రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. వరస కరవుతో చేసేదిలేక, తెచ్చిన అప్పుల తీర్చలేక తనువు చాలించారు. జూన్, జులై నెలలో ఇప్పటివరకు పది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 2018 ఖరీఫ్, 2018-19 రబీకి సంబంధించి రూ.659 కోట్ల పంట నష్ట పరిహారం అందాల్సి ఉంది. దీంతోపాటు 2018-19 రబీలో ప్రధాన మంత్రి పసల్‌ బీమా కింద 1,74,574 మంది రైతులు రూ.11.81 కోట్ల ప్రీమియం చెల్లించారు. ఇంతవరకు దీనికి సంబంధించి పరిహారం అందలేదు. జిల్లాకు గుండెకాయలాంటి గుండ్రేవుల ప్రాజెక్టు ఈ ప్రభుత్వంలోనైనా నెరవేరుతుందని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు. తుంగభద్ర నదిపై వచ్చే నీటిలో 20 టీఎంసీల కేటాయింపుతో గుండ్రేవుల నిర్మాణానికి గత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇది కార్యరూపం దాల్చితే పూర్తిస్థాయిలో కేసీ కెనాల్‌కు నీరు అందుతుంది. తద్వారా ఏటా రెండు పంటలు, తాగునీటికి ఢోకా లేకుండా ఉంటుంది. ఇలాంటి గుండ్రేవుల ప్రాజెక్టుపై జిల్లా నేతలు దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఇక బి.తాండ్రపాడు, తడకనపల్లి, గార్గేయపురం చెరువులను హంద్రీ నీటితో నింపాల్సి ఉంది. గత కలెక్టర్‌ విజయ్‌మోహన్‌ ఈ చెరువులకు ఎస్‌డీపీ నిధులు సైతం మంజూరు చేశారు. కేసీ కెనాల్‌కు కేటాయింపు 31.900 టీఎంసీలు ఉంది. కేసీ కెనాల్‌ ఆయకట్టు కింద 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. పంటల సాగు పెరగడంతో మరో ఐదు టీఎంసీలు పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. వీటిపై సమీక్ష చర్చించి రైతులకు ప్రయోజనం చేకూర్చుతారని రైతులు, ప్రజలు ఆశిస్తున్నారు.

No comments:
Write comments