మాఫీ మాయ (ఆదిలాబాద్)

 

ఆదిలాబాద్, ఆగస్టు 19 (globelmedianews.com - Swamy Naidu): రైతన్నను ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై రెండు నెలలు పూర్తయినా.. ఇప్పటికీ ప్రభుత్వం రుణమాఫీపై స్పష్టత ఇవ్వకపోవడంతో గతేడాది బ్యాంకుల ద్వారా రుణాల తీసుకున్న రైతులు చెల్లించి తిరిగి పునరుద్ధరించుకోవాలా..? రుణమాఫీ అమలు చేసేవరకు వేచి చూడాలా..? అంతుపట్టక అన్నదాతలు అయోమయంలో పడ్డారు.
జిల్లాలో 1,57,456 మంది రైతులు ఉన్నారు. గతేడాది రూ. 1,409 కోట్ల రుణం లక్ష్యం ఉండగా.. 1,06,368 మంది రైతులకు రూ.1,209 కోట్ల రుణాలు ఇచ్చారు. ఈ సంవత్సరం రూ.1,520 కోట్ల రుణలక్ష్యం ఉండగా.. ఇప్పటివరకు 32 వేల మంది అన్నదాతలకు రూ.274 కోట్లు ఇచ్చారు. రుణమాఫీ అమలు చేస్తారా.. చేయరా.. అనే విషయమై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. రుణమాఫీకి సంబంధించి కటాఫ్‌ తేదీని కూడా ప్రకటించకపోవడంతో ఎంతమంది రుణమాఫీకి అర్హులు అవుతారో కూడా తెలియడం లేదు. రుణమాఫీ ఉంటుందా.. ఊడుతుందా.. తెలియక రైతులు అయోమయంలో ఉండిపోతున్నారు. 
 మాఫీ మాయ (ఆదిలాబాద్)
రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చేంతవరకు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు చెల్లించడానికి గడువు పెంచాలని కోరుతున్నారు.పంటల పెట్టుబడి కోసం ప్రభుత్వం రైతుబంధు పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రెండు పర్యాయాల్లో దాదాపు 1.36 లక్షల మంది రైతులు పెట్టుబడి సాయం పొందారు. మిగతా రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందకపోవడంతో రైతుబంధు పథకానికి దూరం కావాల్సి వచ్చింది. వీరందరికీ ఇటీవల నిర్వహించిన భూముల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా కొత్త పట్టాదారు పాసుపస్తకాలు వచ్చినా.. మూడోవిడత రైతుబంధు పథకానికి దరఖాస్తు చేసుకునే గడువు జూన్‌ 9న పూర్తయింది. దీంతో ఈసారి కూడా జిల్లాలో దాదాపు 21 వేల మంది  అన్నదాతలు రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయానికి దూరమయ్యారు. వీరితోపాటు గతేడాది ఖరీఫ్‌, రబీ సీజన్‌లలో పెట్టుబడి సాయం పొందిన రైతుల్లో మరో 22 వేల మంది రైతులు మూడోవిడత రైతుబంధు కింద సాయం వారి బ్యాంకుఖాతాల్లో జమకాలేదు. పాత లబ్ధిదారులకు, కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులు పెట్టుబడి సాయం అందకపోవడంతో ప్రైవేటులోనే అప్పులు తీసుకొచ్చి పంటలు సాగుచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరితోపాటు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలు కూడా బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను పునరుద్ధరించడానికి అప్పులు చేయాల్సి వస్తోంది. రుణమాఫీలేక.. రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందక జిల్లాలోని వేల సంఖ్యలో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుల కష్టాలు తీర్చడానికి రుణమాఫీ వెంటనే ప్రకటించాలని విన్నవిస్తున్నారు.

No comments:
Write comments