కానరాని జలకళ (నిజామాబాద్)

 

నిజామాబాద్, ఆగస్టు 20 (gloebelmedianews.com - Swamy Naidu): జిల్లా వ్యాప్తంగా 1954 చెరువులు, కుంటలున్నాయి. వీటికింద 97,881 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇప్పటివరకు కురిసిన వర్షాలతో 21 చెరువులు నిండి అలుగులు పారుతున్నాయి. 85 నిండేందుకు చేరువయ్యాయి. 217 నీటి వనరుల్లో సగం వరకు నీరు చేరగా.. 549లో 25శాతం నుంచి 50శాతం వరకు చేరింది. మిగతా 1082లో పావు భాగమైనా జలకళ లేదు.రూ.355 కోట్లు వెచ్చించినా ఫలితం మిశ్రమంగానే ఉంది. ఈ పథకం పూర్తి చేసి 81 వేల ఎకరాలకు సాగు నీరందించాల్సి ఉండగా.. సగం ఆయకట్టుకైనా అందని పరిస్థితి ఉంది. పనులు పూర్తయిన చోట నాణ్యతాలోపం శాపంగా మారి ప్రమాదపు అంచున ఊగిసలాడుతున్నాయి. చెరువులకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకం పనులు పూర్తి చేసేందుకు గుత్తేదారులు నత్తకే నడక నేర్పుతుండగా.. చర్యలు చేపట్టేందుకు అధికారులుమీనమేషాలు లెక్కిస్తున్నారు.
కానరాని జలకళ (నిజామాబాద్)
ఈ పథకం ద్వారా చేపట్టాల్సిన పనుల్లో చేసింది గోరంతైతే మిగిలింది కొండంతలా ఉంది.జిల్లాలోని అనేక చెరువుల కట్టలు 2016 సెప్టెంబరులో కురిసిన కుంభవృష్టికి కొట్టుకుపోయే స్థితిలో కొనూపిరితో కొట్టుమిట్టాడాయి. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాలు.. ఉపరితల ఆవర్తనాలతో అలుపెరకుండా వానలు పడుతున్నాయి. పది రోజులుగా ఎడతెరపి లేని వానలతో జిల్లా తడిచి ముద్దవుతోంది. మరో రెండు, మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఇదే నిజమైతే చెరువులు నిండుకుండలే అవుతాయని సంబరపడుతున్న ప్రజానీకం.. మరోవైపు శిథిలదశకు చేరుకున్న నీటి వనరులు వరద తాకిడిని తట్టుకొని నిలుస్తాయా..? కొట్టుకుపోయి సముద్రంలో కలుస్తాయా..? అనే ఆందోళనతో కలవర పడుతున్నారు.మిషన్‌ కాకతీయ కింద జిల్లా కేంద్రం పరిధిలోని లింగాపూర్‌ చెరువు కట్ట మరమ్మతులకు నోచుకొన్నా.. గతంలో వరద తాకిడిని తట్టుకోలేక తూము వద్ద బుంగ పడే పరిస్థితి ఏర్పడింది. ఇంత జరిగినా అధికారుల ఉదాసీనత వల్ల ఇప్పటికీ దానికి తిరిగి మరమ్మతులు చేపట్టలేదు. నాణ్యత లేక మళ్లీ కుంగుతోంది. గ్రామస్థులు దీని గురించి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా చర్యలు లేవు. భారీ వర్షాలు కురిస్తే ఈ చెరువుకు గండం పొంచి ఉందని గ్రామస్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

No comments:
Write comments