జాగా ఉందిగా...వేసేయ్ పాగా

 

కాకినాడ, ఆగస్టు 12 (globelmedianews.com - Swamy Naidu)
ఖాళీ స్థలం కన్పిస్తే చాలు పాగా వేసేస్తున్నారు. అవి పర్ర భూములా..తీర ప్రాంత భూములా..చెరువులా..గుట్టలా..దేవదాయ భూములా..మఠం భూములా..అసైన్డ్‌ భూములా.. రోడ్లా.. ప్రైవేటు భూములా.. అని చూడటం లేదు. దొరికితే చాలు చదును చేసేస్తున్నారు. ఆన్‌లైన్‌లో రికార్డులు మార్చేస్తున్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సృష్టించేస్తున్నారు. కాకినాడలోని తూరంగి గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 20 ఎకరాలు, కొవ్వూరు రోడ్డులో 1.5 ఎకరాలను సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు  కబ్జా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. తన స్థలమే అంటూ చివరికి ప్రభుత్వ  నిధులతో వేసిన రోడ్డును కూడా ధ్వంసం చేశారు. ఆయన అనుచరులు అదే తీరులో ఆక్రమణలకు పాల్పడుతున్నారు. గతంలో కాకినాడ మెయిన్‌రోడ్డులో గల జగన్నాథపురం వంతెన సమీపంలోని విలువైన స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై ఎమ్మెల్యే అనుచరులు రాత్రిరాత్రికి కబ్జా చేసేందుకు యత్నించిన వైనం అప్పట్లో వివాదాస్పదమైంది. ఆ స్థలంలో ఉన్న షాపును బలవంతంగా ఖాళీ చేయించేందుకు 
జాగా ఉందిగా...వేసేయ్ పాగా
యత్నించడంతో పాటు ఎమ్మెల్యే అనుచరులు పొక్లెయిన్‌ను తీసుకెళ్లి కూల్చేందుకు ప్రయత్నించారు. గ్రామస్థాయి నాయకుల వరకు కబ్జాలకు అండగా నిలుస్తున్నారు. జిల్లావ్యాప్తంగా రూ. 200 కోట్ల విలువైన సుమారు 200 ఎకరాల వరకు ఈ విధంగా ఆక్రమించారు. కళ్ల ముందు ఆక్రమణలు కన్పిస్తున్నా వాటిని కప్పిపుచ్చే ప్రయత్నమో...రాజీ చేయించడమో తప్ప అధికారులు చేసిందేమీ కన్పించడం లేదు. ఆక్రమణలపై కేసులు కూడా నమోదవుతున్నాయంటే జిల్లాలో టీడీపీ నేతల కబ్జాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.తుని నియోజకవర్గ పరిధిలో 84 ఎకరాల వరకు కబ్జా చేసేశారు. మంత్రి యనమల రామకృష్ణుడు, ఆయన సోదరుడు కృష్ణుడు అండ, ప్రోద్బలంతో ఆక్రమణలకు పాల్పడ్డారు. పోలీసు క్వార్టర్స్‌ భూమిని సైతం ఆక్రమించారు. దీని ఒక్కదాని విలువే రూ.10 కోట్ల వరకు ఉంటుంది. తొండంగిలోని మఠం భూములను సైతం కబ్జా చేశారు. 80 ఎకరాల మేర ఆన్‌లైన్‌లో రికార్డులు మార్చేసి పాగా వేశారు. వీటి విలువ రూ.25 కోట్ల వరకు ఉంటుందని అంచనా.సీఆర్‌జెడ్‌ పరిధిలోని ఉప్పలగుప్తం మండలం ఎస్‌.యానాంలో వందల ఎకరాల పర్రభూమిని అమలాపురం టీడీపీ నేతలు  ఆక్రమించేశారు. మడ అడవులను, సహజ సిద్ధంగా ఏర్పడిన భూములను ధ్వంసం చేయకూడదన్న నిబంధనలు ఉన్నప్పటికీ యథేచ్ఛగా ఆక్వా చెరువుల కోసం కబ్జా చేసి తవ్వేశారు. అమలాపురం మున్సిపాల్టీలోనైతే ఖాళీ స్థలం కన్పిస్తే చాలు పాగా వేసేస్తున్నారు. చెరువులు, డ్రెయిన్ల మురుగునీటి కోసం ఉన్న స్థలాలు సైతం ఆక్రమణకు గురయ్యాయి. ముఖ్యంగా బంగారక్క, తామరచెరువు, గరిగుంట చెరువు స్థలాలను ఆక్రమించి, దర్జాగా కట్టడాలు చేపట్టారు.

No comments:
Write comments