వరికి సరి.. మరి పత్తికి..! (కరీంనగర్)

 

కరీంనగర్, ఆగస్టు 19 (globelmedianews.com - Swamy Naidu): జిల్లాలో వర్షపాతం సాధారణ స్థితికి చేరింది. గత నెల వరకు లోటుగా ఉండగా 15 రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. వరుస వానలతో చెరువులు జలకళ సంతరించుకున్నాయి. వరిసాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది. మొన్నటి దాకా సాగవుతాయో లేదో అనుకున్న భూముల్లో రైతులు వరినాట్లు వేస్తున్నారు. మరోవైపు ఏకధాటిగా కురిసిన వర్షాలు పత్తిరైతుకు ఆశనిపాతమయ్యాయి. తేమ అధికం కావడంతో పత్తి మొక్కల్లో ఎదుగుదల నిలిచింది. ఎర్రబారుతూ కొన్ని మొక్కలు ఎండిపోతున్నాయి. జిల్లాలో 14 మండలాలున్నాయి. జిల్లాలో ఖరీఫ్‌ సాధారణ వర్షపాతం 563.1 మిల్లీమీటర్లు...కాగా ఇప్పటి వరకు 560.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. జులై మాసాంతం వరకు 10 మండలాల్లో లోటు వర్షపాతం ఉండగా 15 రోజుల పాటు కొనసాగిన వర్షాలతో పరిస్థితి మారిపోయింది. 
వరికి సరి.. మరి పత్తికి..! (కరీంనగర్)
ధర్మారం, కమాన్‌పూర్‌, పెద్దపల్లి, శ్రీరాంపూర్‌ మండలాల్లో సాధారణం కంటే అధికంగా వర్షపాతం కురవగా, అంతర్గాం, రామగుండంలో లోటు వర్షపాతం నెలకొంది. పాలకుర్తి, రామగిరి, జూలపల్లి, సుల్తానాబాద్‌, ఓదెల, ముత్తారం, ఎలిగేడు మంథనిలో సాధారణ వర్షపాతం నమోదయింది. సాధారణ వర్షపాతం కంటే 20 శాతం తక్కువగా నమోదయితే లోటుగా గుర్తిస్తారు. 20 శాతం అధికంగా నమోదయితే అధిక వర్షపాతం కింద పరిగణిస్తారు. జిల్లాలో రెండు మండలాల్లో లోటు, మూడు మండలాల్లో అధిక వర్షపాతం నమోదయింది. జులై మాసాంతం వరకు నీరు లేక బోసిపోయిన చెరువులు సగం మేరకు నిండాయి. కుంటలు జలకళను సంతరించుకున్నాయి.జిల్లాలో వరిసాగు  విస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది. గత నెల చివరి వారం నుంచి కొనసాగుతున్న వర్షాలతో జిల్లాలో వరిసాగుపై నెలకొన్న ప్రతిష్టంబన తొలగిపోయింది. జిల్లాలో సాధారణ వరిసాగు విసీˆర్ణం 44 వేల హెక్టార్లు...జులై మాసాంతం వరకు జిల్లాలో వరిసాగు 45-50 శాతం మాత్రమే. అల్పపీˆడన ప్రభావంతో వర్షాలు కొనసాగడంతో చెరువులు, బావుల్లో నీరు చేరింది. ఈ నేపథ్యంలో పది రోజుల్లో 25 శాతం మేరకు వరిసాగు  విస్తీర్ణం పెరిగింది. వరుస వర్షాలు పత్తిపంటలకు ప్రతికూలంగా మారాయి. అధిక తేమతో పత్తి ఎదుగుల నిలిచిపోయింది. ఇంకా వర్షాలు కొనసాగితే పత్తికి తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. జిల్లాలో సాధారణ పత్తిసాగు విస్తీర్ణం 33 వేల హెక్టార్లు...ఈ ఏడాది ప్రతికూల వాతావరణంతో 30 వేల హెక్టార్లలో రైతులు సాగు చేశారు. మే చివరి వారం నుంచి జూన్‌ మొదటి వారం వరకు ఆయా మండలాల్లో పత్తి గింజలు వేశారు. అరంభంలో అనుకూల వాతావరణం ఉన్నా జులైలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో జులై 25 నుంచి వరుసగా వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో పత్తి చేలలో తేమ అధికమయింది. చేలలో నీరు నిలిచి ఉండడంతో పత్తి మొక్కలు ఎర్రబారిపోయాయి. వేరుకుళ్లుతో ఎండిపోతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ సమయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులు నుంచి ఎలాంటి సూచనలు అందించడం లేదని రైతులు చెబుతున్నారు.

No comments:
Write comments