వరదొచ్చినా చుక్కరాలేదు.. (కర్నూలు)

 

కర్నూలు, ఆగస్టు 27 (globelmedianews.com):
కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి కొన్ని రోజులుగా పోటెత్తిన వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. వరద నీరు ఒక్కసారిగా తగ్గిపోవడంతో శ్రీశైలంలో పదిగేట్లలో.. 8 గేట్లను మూసివేసి కేవలం రెండింటి ద్వారా సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. వరద ఆరంభ సమయంలో అవకాశం అందుబాటులో ఉన్నా, నేతలు..అధికారులు ఆలస్యంగా స్పందించడంతో రాయలసీమ జిల్లాలకు శాపంగా మారింది. వరదొచ్చి వెళ్లినా కర్నూలు నగర కేంద్రానికి దాహార్తి తీరలేదు. నేటికీ నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చినుకు జాడలేక కరవు తరుముతున్న సమయంలో ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు వరద పరుగులెత్తింది. ఒక్క కృష్ణా నీటితోనే శ్రీశైలం జలాశయం పూర్తి గరిష్ఠ నీటి మట్టానికి చేరుకుంది. 
వరదొచ్చినా చుక్కరాలేదు.. (కర్నూలు)

ఆ తర్వాత తుంగభద్ర వరద నీరు తోడవ్వడంతో వరద ఉప్పొంగిన సంగతి తెలిసిందే. గత నెల 31వ తేదీ నుంచి నుంచి మొదలైన వరద సోమవారం సాయంత్రం నాటికి 811.049 టీఎంసీలు శ్రీశైలం చేరినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో కృష్ణా నుంచి అత్యధికంగా 748.339 టీఎంసీలు, తుంగభద్ర నుంచి 62.71 టీఎంసీల వరద నీరు వచ్చింది.శ్రీశైలానికి 3.38 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయంలో 883.50 అడుగులకు నీటి మట్టం చేరింది. 207.41 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇందులో సోమవారం ఉదయం పది గేట్ల నుంచి 3.65 లక్షల క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు వదిలిన అధికారులు, ఇన్‌ఫ్లో తగ్గడంతో సాయంత్రానికి 2 గేట్లతో కేవలం 54,774 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. మల్యాల ద్వారా హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌కు నిరంతరంగా 2026 క్యూసెక్కులు వదులుతున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి అయితే ప్రస్తుతం 34 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఈ ప్రవాహానికి అక్కడక్కడా గండ్లు పడటం, కాల్వలు పొంగి పొలాలు నీట మునగడంతో రైతుల నుంచి ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో పూర్తిసామర్థ్యం 44 వేల క్యూసెక్కుల నుంచి పదివేలు తగ్గించి అధికారులు పంపుతున్నారు. వరదల సమయంలో శ్రీశైలంలో వెనుక జలాల నుంచి రాయలసీమకు నీళ్లు ఉపయోగించుకునే అవకాశం ఉన్నా అధికారులు, ప్రజాప్రతినిధులు ఆలస్యంగా స్పందిచారనే చెప్పాలి. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌, పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమలోని నాలుగు జిల్లాలకు ఇప్పటివరకు 33 టీఎంసీలే విడుదల చేయగలిగారు. నెల్లూరు, చెన్నై తాగునీటి అవసరాలకు మరో 15 టీఎంసీలు ఇవ్వగలిగారు. ఇలా వరద నీటిలో సాగర్‌కు దిగువకు వదలిందే తప్ప రాయలసీమలోని ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో నింపలేకపోయారు.వరద నీటిలో సుంకేసుల నుంచి నిత్యం 104 క్యూసెక్కులు కర్నూలుకు విడుదల చేస్తున్నారు. నీరు బురదగా ఉండటంతో మూడు సార్లు ఫిల్టర్‌ చేసి సరఫరా చేస్తుండటంతో పూర్తి జాప్యమవుతోంది. ఆరు లక్షల జనాభా కలిగిన నగరంలో నాలుగురోజులకోసారి నీరు అందుతున్నాయి. మరోవైపు గాజులదిన్నె ప్రాజెక్ట్‌ కు కర్నూలుతోపాటు, మరో ఐదు నియోజకవర్గాల తాగునీటి సమస్య తీరేందుకు హంద్రీనీవా నుంచి నీళ్లు నింపడానికి ప్రభుత్వానికి అధికారులు అనుమతి కోరారు. ప్రస్తుతం తాత్కాలికంగా హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌పై ఏర్పాటు చేసిన పైపుల ద్వారా ప్రతి రోజూ 200 క్యూసెక్కులు తరలిస్తుంటే అందులో వంద క్యూసెక్కులు ఆవిరవుతున్నాయి.

No comments:
Write comments