వరుస తప్పులతో కోడెల డ్యామేజ్

 

ఆగస్టు 24, (globelmedianews.com - Swamy Naidu)
కోడెల శివప్రసాద్ ఖచ్చితంగా చిక్కుల్లో పడ్డారు. ఆయన కుటుంబ సభ్యులపై ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి. కోడెల శివప్రసాద్ దీర్ఘకాలం నుంచి రాజకీయాలు నెరుపుతున్న నేత. ఎన్టీరామారావు పార్టీ స్థాపించిన నాటినుంచి డాక్టర్ కోడెల శివప్రసాదరావు అనేక పదవులు నిర్వహించారు. హోంమంత్రిగా, వైద్యాశాఖ మంత్రిగా అనేక ముఖ్యమైన పోస్టులను టీడీపీ కట్టబెట్టింది. కానీ ఎప్పుడూ లేనన్ని ఆరోపణలు ఇప్పుడు కోడెల శివప్రసాద్ చుట్టూ బిగుసుకుంటున్నాయి.ప్రస్తుతం కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మిపై దాదాపు 17 కేసులు నమోదయ్యాయి. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతలే కోడెల కుటుంబంపై కేసులు నమోదు చేశారు. స్థల వివాదాలు, భవన నిర్మాణంలో వసూళ్లు, కేబుల్ తగాదాలు ఇలా ఒకటి కాదు అనేక కేసులు నమోదయ్యాయి. 
వరుస తప్పులతో కోడెల డ్యామేజ్
అయితే దీనిపై సత్తెనపల్లి, నరసరావుపేట పోలీసులు న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఉన్నాయోమోనన్న పరిశీలిస్తున్నారు. స్పీకర్ గా కోడెల శివప్రసాద్ ఉన్న సయమంలో ఆయన కుటుంబం అనేక అరాచకాలకు పాల్పిడిందన్న ఆరోపణలున్నాయి.తొలుత కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామ్ ఫస్ట్ టార్గెట్ గా కనపడుతున్నారు. కోడెల శివరామ్ పై నమోదయిన కేసులకు సంబంధించి పూర్తి ఆధారాలు లభించాయని చెబుతున్నారు. ఇప్పటికే కోడెల శివరామ్, విజయలక్ష్మిలు తమను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీంతో పోలీసు అధికారులు పకడ్బందీగా కేసులును నమోదు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే కోడెల శివరామ్ అరెస్ట్ ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది.కోడెల శివప్రసాద్ స్పీకర్ కాకముందు టిడిపి లో హుందాగా నడుచుకునే నేతగానే అందరికి తెలుసు. గతంలో కోడెల శివప్రసాద్ ఇంట్లో పేలిన బాంబు పేలుడిపై సిబిఐ విచారణ వరకు పోయింది. ఆ తరువాత పరిటాల కేసులో ప్రధాన నిందితుడు మొద్దు శ్రీను తన అభిమాన నేత కోడెల శివప్రసాద్ అంటూ నాడు సంచలన వ్యాఖ్యలు అందరికి గుర్తుండే ఉంటాయి. అయితే గత వివాదాలు అలా ఉంటే ఆ తరువాత విభజన తరువాత ఏర్పడ్డ తొలి అసెంబ్లీకి స్పీకర్ గా కోడెల శివప్రసాద్ మంచి సంప్రదాయాలని అనుసరించి మార్గదర్శిగా నిలుస్తారని అంతా భావించారు. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేశారు పెద్దాయన.స్పీకర్ పదవి పార్టీలకు అతీతంగా ఉండేది. ఆ బాధ్యతలు చేపట్టాక ఎవరు ఎలా అందులో వ్యవహరిస్తున్నారో ప్రజలు నిశీతంగా పరిశీలిస్తూ వుంటారు. ముఖ్యమంత్రి తరువాత అంతటి అత్యున్నత పదవిగా స్పీకర్ పోస్ట్ ను ఉదాహరిస్తారు. మొత్తం అసెంబ్లీ అంతా ఆయన కనుసన్నల్లోనే ఉంటుంది. కానీ కోడెల శివప్రసాదరావు స్పీకర్ గా పనిచేసిన కాలం అంతా గతంలో ఎన్నడూ లేనన్ని ఆరోపణలను, విమర్శలను ఎదుర్కొన్నారు ఆయన. నేరుగా టిడిపి కార్యకర్తలా ఆయన వ్యవహారాలు సాగించేవారు. పార్టీ వేదికలపైనా హల్ చల్ చేసిన సందర్భాలు వున్నాయి. ఇక స్పీకర్ స్వయంగా చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం మరింత రచ్చకు దారితీసిన ఆయన ఎక్కడా వెనక్కు తగ్గలేదు సరికదా మరింత ఎక్కువగానే తన పార్టీ పట్ల అధినేతపట్ల విధేయత ప్రదర్శిస్తూ కొత్త సంప్రదాయాలకు తెరతీసి అభాసుపాలయ్యారు.ఎపి అసెంబ్లీ కి వరదలు వచ్చి మునిగిపోతున్న సందర్భం ఎదురుకాలేదు. పోనీ ఏ అగ్నిప్రమాదం వచ్చింది లేదు. సెక్యూరిటీ పర్యవేక్షణలో ఉండే అసెంబ్లీలో దొంగల భయం ఉండదు. గోడలకు బింగించే ఎసిలను కూడా పట్టుకుపోవడానికి ఎలాంటి సాకులు అయినా వెతకడం కష్టమే. అయినా కానీ ఆయన స్పీకర్ కార్యాలయ అత్యంత విలువైన ఫర్నిచర్ ను మూడు లారీల్లో తరలించేశారు. ఈ వ్యవహారం కొత్త ప్రభుత్వం వచ్చాక తెలిసి ఇటీవల పోలీసుల విచారణకు సైతం ఆదేశించింది జగన్ సర్కార్. మాయమైన ఫర్నిచర్ కోడెల శివప్రసాద్ పట్టుకుపోయారని తెలిసి అంతా అవాక్కయ్యారు. ఇదంతా వైసిపి కుట్రే అనుకున్నాయి టిడిపి వర్గాలు. అయితే నిజం తెలిశాక పసుపు దండు షాక్ కి గురైంది. ఔరా అని ఆక్స్చర్య పోవడంతో బాటు ఈ వ్యవహారం పై కోడెల శివప్రసాద్ వివరణ కోసం ఎదురు చూసింది.నిజమే అసెంబ్లీ ఫర్నిచర్ నా దగ్గరే వుంది. అధికారులు వస్తే ఇచ్చేస్తా. లేదా ఆ ఫర్నిచర్ విలువ కడితే డబ్బు చెల్లించేస్తా. భద్రత లేకపోవడంతోనే వాటిని నేనే పట్టుకు వచ్చేశా. ఇందులో తప్పేముంది అంటూ కోడెల శివప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు ఎపి రాజకీయాలల్లో హాట్ టాపిక్ గా మారిపోయాయి. దీనిపై మంత్రి కన్నబాబు తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఇదే పని సామాన్యులు చేస్తే దొంగతనం అంటారా ? దోపిడీ అంటారా ? చేతివాటం అంటారా ? అంటూ ప్రశ్నల వర్షమే కురిపించారు. దీనిపై చంద్రబాబు ఏం సమాధానం చెబుతారంటూ విమర్శల వర్షం తుఫాన్ లా వచ్చి పడింది. అయితే టిడిపి శిబిరం లో కలకలం రేగింది. దీనిపై వ్యాఖ్యలు చేయడానికి ఏ ఒక్కరు ముందుకు రాలేదు. కోడెల శివప్రసాద్ కు మద్దతు పలికేందుకు సైతం ఆసక్తి చూపకపోవడం గమనార్హం. ఇప్పటికే గత ప్రభుత్వం హయాంలో కోడెల కుమారుడు, కుమార్తె కె ట్యాక్స్ పేరిట దందా 
చేశారని ఆరోపిస్తూ అనేక కేసులు నమోదు అయిపోయాయి. తాజాగా ఈ వివాదం ఆయన ఇమేజ్ ను మరింత డ్యామేజ్ చేసేసింది. ఈ ఫర్నిచర్ తరలింపు వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

No comments:
Write comments