జల విద్యుత్ కు సిద్ధమౌతున్న జెన్ కో

 

హైద్రాబాద్, ఆగస్గు 8 (globelmedianews.com - Swamy Naidu):
కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. జూరాలతో పాటు శ్రీశైలం రిజర్వాయర్‌ కూడా నిండుకుండలా మారింది. దీంతో రికార్డు స్థాయిలో జల విద్యుత్ ఉత్పత్తి చేయడానికి జెన్ కో సిద్ధమైంది. శ్రీశైలంలో నీటి నిల్వ 150 టీఎంసీలు దాటడంతో పాటు.. వరద ఉధృతి కొనసాగుతుండడంతో ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రంలో కెపాసిటీకి మించి విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోంది. సోమవారం ప్రారంభమైన 915 మెగావాట్ల ఉత్పత్తి.. మూడు రోజులుగా ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతోంది.శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రం స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం 900 మెగావాట్లు. 150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు యూనిట్ల ద్వారా సామర్థ్యానికి మించి  జెన్‌కో కరెంటు ఉత్పత్తి చేస్తుంది. కృష్ణానదికి వరద పోటెత్తుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని హైడల్ పవర్ స్టేషన్లలో గరిష్ట విద్యుత్ ఉత్పత్తి చేయాలని తెలంగాణ జెన్‌కో నిర్ణయించింది. 
జల విద్యుత్ కు సిద్ధమౌతున్న జెన్ కో
ఇప్పటికే జూరాల, శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించిన జెన్‌కో నాగార్జునసాగర్, పులిచింతలలో విద్యుత్ ఉత్పత్తి కోసం వ్యవస్థలను సిద్ధం చేసింది. తెలంగాణ జెన్‌కో- ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ఆయా పవర్ స్టేషన్ల అధికారులు, జెన్ కో అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.కృష్ణా నదిలో నీటి ప్రవాహఉధృతి, రిజర్వాయర్లలో నీటి మట్టాలను సమీక్షించారు సీఎండీ ప్రభాకర్‌రావు. వారం రోజుల క్రితమే జూరాలలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించగా.. ప్రస్తుతం ప్రవాహ ఉధృతి ఎక్కువ ఉండడంతో పూర్తి సామర్థ్యంతో చేయడం సాధ్యం కావట్లేదు. అప్పర్, లోయర్ జూరాల కలిపి 120 మెగావాట్లే ఉత్పత్తి జరుగుతున్నదని అధికారులు చెప్తున్నారు. అటు ప్రవాహ ఉధృతిని అనుసరించి, విద్యుత్ ఉత్పత్తి చేయాలని.. ప్రతీ గంటా అప్రమత్తంగా ఉండి వ్యూహం అనుసరించాలని విద్యుత్ ప్లాంట్ల అధికారులకు ప్రభాకర్‌రావు సూచించారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తున్న నీరు నాగార్జునసాగర్‌కు వెళ్తుండడంతో సాగర్ నీటిమట్టం కూడా పెరుగుతోంది.శ్రీశైలం కూడా మరో రెండు రోజుల్లో పూర్తిగా నిండే అవకాశం ఉండడంతో గేట్లు ఎత్తడం ఖాయం. దీంతో వచ్చిన నీరు వచ్చినట్లే నాగార్జునసాగర్‌ చేరుతుంది. దీంతో నాగార్జునసాగర్‌లోనూ విద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు అధికారులు అప్రమత్తమయ్యారు. గరిష్ఠంగా 815 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని జెన్ కో టార్గెట్‌ పెట్టుకుంది. ఇక నాగార్జునసాగర్‌ కూడా నిండి నీరు విడుదలైతే.. పులిచింతలలో 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని జెన్ కో భావిస్తోంది.

No comments:
Write comments