. ఆకట్టుకుంటన్న దీదీ కా బోలో ప్రోగ్రామ్

 

కొల్ కత్తా, ఆగస్టు 3, (globelmedianews.com - Swamy Naidu)
పశ్చిమ బెంగాల్ లో పట్టు కోల్పోకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ పడరాని పాట్లు పడుతున్నారు. పశ్చిమ బెంగాల్ లో భారతీయ జనతా పార్టీ పుంజుకుంటుండటం మమత బెనర్జీకి ఆందోళన కల్గిస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల నేతలు పార్టీని వీడుతుండటం పై కూడా మమత బెనర్జీ కలవరం చెందుతున్నారు. త్వరలోనే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మమత బెనర్జీ అప్రమత్తమయ్యారు.పశ్చిమ బెంగాల్ లో ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నువ్వా? నేనా? అన్న రీతిలో పోటీని ఇచ్చింది. కాంగ్రెస్, కమ్యునిస్టు పార్టీల ఊసే లేకుండా చేసిన మమత బెనర్జీ భారతీయ జనతా పార్టీ విషయంలో మాత్రం కొంత ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలి. అందుకోసమే ఆమె ఎన్నికలకు ముందే నష్ట నివారణ చర్యలకు దిగారు. పార్టీని వీడిన నేతలందరూ బెంగాల్ ద్రోహులుగా మమత బెనర్జీ అభివర్ణిస్తున్నారు.మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం కోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సాయం తీసుకున్నారు. 


 ఆకట్టుకుంటన్న దీదీ కా బోలో ప్రోగ్రామ్


ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ టీం పశ్చిమ బెంగాల్ లోని అన్ని ప్రాంతాల్లో మకాం వేసి సర్వేలు ప్రారంభించింది. తృణమూల్ కాంగ్రెస్ బలహీనంగా ఉన్న ప్రాంతాలు, బీజేపీ బలోపేతం అవుతున్న ఏరియాలపై ప్రశాంత్ కిషోర్ టీం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎప్పటికప్పుడు మమత బెనర్జీకి అందిన నివేదికల మేరకు పార్టీకి చెందిన ముఖ్య నేతలను కూడా మార్చేసేందుకు సిద్ధమయ్యారని చెబుతున్నారు. ప్రజలకు చేరువయ్యేందుకు మమత బెనర్జీ “దీదీ కే బోలో” కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజల నుంచి నేరుగా వారి సమస్యలను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే దాదాపు రెండు లక్షలకుపైగా ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులయినట్లు గుర్తించారు. మమత బెనర్జీ పట్ల విశ్వాసానికి ఇది నిదర్శనమని తృణమూల్ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దీనికి తోడు గ్రామీణ ప్రాంతాల ప్రజల సమస్యలను పరిస్కరించేందుకు వెయ్యి మంది పార్టీ నేతలు గ్రామాలను పర్యటించనున్నారు. వీరికి మమత బెనర్జీ షెడ్యూల్ ను విధించారు. వంద రోజుల్లో పది వేల గ్రామాలను సందర్శించి సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. మొత్తం మీద మమత బెనర్జీ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి.

No comments:
Write comments