బజారు సమస్యకు చెక్ పెట్టిన అధికారులు

 

నిజామాబాద్, ఆగస్టు 1, (globelmedianews.com -Swamy Naidu)
నిజామాబాద్ జిల్లా కేంద్రమైన నిజామాబాద్ నగరం నడిబొడ్డున గల వీక్లీమార్కెట్‌లో ట్రాఫిక్ సమస్యకు ప్రధాన కారణంగా నిలుస్తున్న రోడ్లపై కూరగాయలు, మాంసం, ఇతర వస్తువుల విక్రయాల సమస్య ఏళ్ల తరబడి దూరం కాలేకపోతోంది. గత పక్షం రోజుల క్రితం పోలీస్ కమిషనర్ కార్తికేయ వీక్లీ మార్కెట్ ప్రాంతాన్ని సందర్శించి ట్రాఫిక్ సమస్య తీవ్రతను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. నిజానికి సీ.పీ పర్యటించిన రోజున ఒక మోస్తారుగా వర్షం కురుస్తుండడం వల్ల ట్రాఫిక్ ఇక్కట్లు అంతగా కనిపించలేదు. అయినప్పటికీ, ఎటుచూసినా రోడ్లను ఆక్రమించుకుని కూరగాయలు, మటన్, చికెన్, ఫిష్ మార్కెట్‌లను నిర్వహిస్తుండడాన్ని గమనించిన సీ.పీ వ్యాపారుల తీరును తప్పుబట్టారు. రోడ్లపై క్రయవిక్రయాలు జరపడం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని, కూరగాయల విక్రయాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డీఎస్ మార్కెట్ షెడ్డును వినియోగించుకోవాలని సూచించారు. 
 బజారు సమస్యకు  చెక్ పెట్టిన అధికారులు 

ఎవరైనా రోడ్లను ఆక్రమించుకుని కూరగాయాలు కానీ, ఇతరాత్ర వ్యాపారాలు నిర్వహిస్తే బాధ్యుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టమైన హెచ్చరికలు చేశారు. అయితే సీ.పీ హెచ్చరికలు కూడా ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేకపోయాయనే చెప్పాలి. సీ.పీ పర్యటించి వెళ్లిన మరుసటి రోజు నుండే వీక్లీ మార్కెట్ ప్రాంతంలో పరిస్థితి యథాతథంగా మారింది. ఇక్కడ కూరగాయల వ్యాపారంతో పాటు మటన్ మార్కెట్‌ల నిర్వహణ పూర్తిగా గాడితప్పడం అనేక సమస్యలకు కారణమవుతోంది. అనునిత్యం ఉదయం నుండి రాత్రి బాగా పొద్దుపోయేంత వరకు కూడా ఎంతో రద్దీ నెలకొని ఉండే ఈ ప్రాంతంలో ప్రధాన కూడలికి నలువైపులా రోడ్లను ఆక్రమించుకుని కూరగాయల వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతూ ట్రాఫిక్ కష్టాలతో ప్రజలు బేజారెత్తిపోతున్నారు. అసలే మిషన్ భగీరథ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాల కోసం ఎక్కడికక్కడ గుంతలు తవ్వి, వాటిని సరిగా పూడ్చకపోవడంతో వీక్లీ మార్కెట్ ప్రాంతంలోని రోడ్లన్నీ అస్తవ్యవస్తంగా తయారయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్లను ఆక్రమించుకుని వ్యాపారాలు సాగిస్తుండడం సమస్యను మరింత తారాస్థాయికి చేరుస్తోంది. ఖలీల్‌వాడి నుండి గోల్‌హన్మాన్‌కు, హైదరాబాద్ రోడ్, ఫులాంగ్, పూసలగల్లి తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు వీక్లీమార్కెట్ చౌరస్తా మీదుగానే రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. ఈ కూడలిలో రోడ్లపైనే వ్యాపారాలు నిర్వహిస్తుండడం, పండ్ల బండ్లు వరుసగా బారులుతీరి నిలబెడుతుండడంతో రోడ్డు కుచించుకుపోయి కనీసం కాలినడకన వెళ్లేందుకు కూడా అపసోపాలు పడాల్సిన దుస్థితి నెలకొంది. సమస్య తీవ్రతను గుర్తించి గత దశాబ్ద కాలం క్రితమే వీక్లీ బజార్ చౌరస్తాకు సమీపంలో కూరగాయల వ్యాపారుల కోసం ప్రత్యేకంగా షెడ్డును నెలకొల్పారు. 

No comments:
Write comments