గృహ సంకల్పం (శ్రీకాకుళం)

 

శ్రీకాకుళం, ఆగస్టు 19 (globelmedianews.com - Swamy Naidu): స్థలం ఉన్న వారికి ఇల్లు..లేనివారికి స్థలంతోపాటు ఇల్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఆగమేఘాలపై చర్యలు చేపడుతోంది. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు వీలుగా ఇప్పటికే జిల్లాలో వందల ఎకరాల భూములు గుర్తించారు. రెవెన్యూ గ్రామాల వారీగా నిర్వహిస్తున్న సర్వే చివరి అంకానికి చేరింది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అందరికీ ఇళ్లు మంజూరు చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందడుగేస్తోంది. జిల్లాలో గత కొన్నేళ్లుగా ప్రభుత్వం లక్షల కొద్దీ ఇళ్లు మంజూరు చేస్తున్నా ఇంకా నిలువ నీడలేని పేదలు భారీ సంఖ్యలోనే ఉన్నారు. సొంతిటి కల సాకారం చేసుకోవడమనేది పేదలకు తలకు మించిన భారం. అందుకే ప్రభుత్వాలు అందరికీ ఇళ్ల మంజూరుకు అధిక ప్రాధాన్యతనిస్తుంటాయి. వచ్చే ఉగాదికి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పర్యాయం 25 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. 
గృహ సంకల్పం (శ్రీకాకుళం)
ఇందుకు అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేసింది. గత అనుభవనాలను పరిగణనలోకి తీసుకుంటే మంజూరు చేసినా ఇళ్లు చాలా వరకు నిర్మాణాలకు నోచుకోవటం లేదు. ప్రభుత్వం ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఇంటి కోసం దరఖాస్తు చేసుకొనేందుకు వేల మంది పేదలు ముందుకు రావటం లేదు. దీనికి ప్రధాన కారణం స్థల సమస్యే. సొంత స్థలాలు లేనివారు భారీ సంఖ్యలో ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అసలు నిర్దిష్టంగా ఎంతమందికి స్థలాలు లేవు. వీరికి ఇళ్ల పట్టాలివ్వటానికి ఎంత భూమి అవసరం? ప్రస్తుతం జిల్లాలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములు ఎంత? ఇంకా ఎంత మేర సేకరించాల్సిన అవసరం ఉంటుంది. ఇత్యాది అంశాలను తేల్చేందుకు అధికారులను రంగంలోకి దింపింది. జిల్లాలో రెవెన్యూ గ్రామాల వారీగా సర్వేయర్లు ఈ మేరకు లెక్కలు తేల్చుతున్నారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వ, ఇతర భూములను గుర్తించి వివరాలు నమోదు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో అర్హుల గుర్తింపు బాధ్యత గ్రామ, వార్డు వాలంటీర్లకు అప్పగించనున్నారు. ఒక్కో బ్లాకులో 50 ఇళ్లు కేటాయిస్తున్న నేపథ్యంలో వారి పరిధిలో ఎంత మందికి ఇళ్లు లేవన్నది గుర్తించి వారు నివేదికలు అందజేస్తారు. ఇప్పటికే వార్డు వాలంటీర్లకు శిక్షణ సైతం చాలా వరకు పూర్తయింది. వారంతా ఆగస్టు 15వ తేదీ నుంచి క్షేత్రరంగంలోకి దిగనున్నారు! అర్హుల ఎంపికకు ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అధ్యక్షుడిగా, జిల్లా కలెక్టర్‌ ఉపాధ్యక్షుడిగా, సంయుక్త పాలనాధికారి కన్వీనర్‌గా, ప్రజాప్రతినిధులతోపాటు, గృహ నిర్మాణ సంస్థ పీడీ, పురపాలక సంఘాల కమిషనర్లు, సర్వేశాఖ ఏడీ, జెడ్పీ సీఈవో, జిల్లా రిజిస్ట్రార్, ఐటీడీఏ పీవో ఇలా అందరినీ కమిటీలో భాగస్వాములను చేసేలా కార్యాచరణ సిద్ధమవుతోంది. తగిన భూములు లేని క్రమంలో ప్రైవేటుగా కొనుగోలు చేసి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేలా కసరత్తు జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే సర్వే దాదాపుగా కొలిక్కి తెచ్చారు. మరో 105 గ్రామాల్లో మాత్రమే సర్వే చేయాల్సి ఉంది. ఒక ఎకరాలో 40 ఇళ్ల పట్టాలు మాత్రమే అందించే వీలుంది. ఇంత వరకు గుర్తించిన ప్రభుత్వ, ఇతర భూములు కేవలం 1156.08 ఎకరాలు మాత్రమే. వాటిని ఎకరాకు 40 పట్టాల చొప్పున 46,240 మందికి మాత్రమే అందజేసేందుకు వీలుంటుంది. అంతకన్నా ఎక్కువ మంది అర్హులుంటే ప్రైవేటు భూములు కొనుగోలు చేయక తప్పని పరిస్థితి తలెత్తుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో భూ సమస్య అధికంగా ఉంది. ఉదాహరణకు రాజాం పట్టణం మొత్తం శోధించినా ప్రభుత్వం భూమి సెంటు కూడా అధికారులు గుర్తించ లేకపోయారు. ఇంటి స్థలాల సమస్యను అధిగమించేలా జీ+3, జీ+4 విధానంలో బహుళ అంతస్తులు నిర్మించేలా రంగం సిద్ధం చేస్తోంది. ఈ విధానంలో ఇప్పటికే పాలకొండ మినహా మిగిలిన పట్టణాల్లో ఇళ్లు మంజూరు చేశారు. 25 శాతం నిర్మాణాలు కాని వాటిని ప్రభుత్వం నిలిపేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా వేలాది ఇళ్లు రద్దయ్యాయి. ఒకే దఫాలో అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేసేలా చర్యలు చేపడుతుండటంతో ఊరట కలిగించే అంశమే. కుటుంబంలోని మహిళ పేరునే ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగానే ఇంటి పట్టా కూడా మహిళ పేరునే అందజేసేలా చర్యలు చేపడుతోంది. అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరు చేసే దిశగా ఇప్పటికే వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఉగాది రోజున ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని సంకల్పించింది. కుటుంబంలోని మహిళ పేరుతో ఇంటి పట్టాను రిజిస్ట్రేషన్‌ చేయిస్తారు. ఒక్కొక్కరి పేరున పల్లెల్లో 1.5 సెంట్ల స్థలాన్ని ఇవ్వాలన్నది ప్రణాళిక. ఏపీ టిడ్కో, పురపాలక శాఖ, ఇతర ప్రభుత్వ సంస్థల ద్వారా అందుబాటులో ఉన్న పథకాల ద్వారా ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే గతంలో మంజూరై ప్రారంభం కాని ఇళ్లను ప్రభుత్వం రద్దు చేసింది. జిల్లాలో వేల ఇళ్లు రద్దయ్యాయి. వచ్చే ఉగాది వరకు ఇళ్లు మంజూరు చేయకూడదని ప్రభుత్వం భావిస్తోంది. అర్హులందరికీ ఇళ్లు ఇవ్వాలని సంకల్పించడమే ఇందుకు కారణం.

No comments:
Write comments