సబ్సిడీలు, మాఫీలకు 20 వేల కోట్ల నిధులు

 

హైద్రాబాద్, సెప్టెంబర్ (globelmedianews.com)
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. శాసనసభలో కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం చదివి వినిపించారు. దేశంలోనే తెలంగాణ అద్భుత ప్రగతిని సాధిస్తోందన్నారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు... యావత్‌ దేశాన్ని ఆశ్చర్యపరిచాయని కేసీఆర్ తెలిపారు. దేశంలోనే నంబర్‌వన్‌ రాష్ట్రంగా తెలంగాణ సగర్వంగా నిలిచిందని కొనియాడారు.అయితే దురదృష్ట వశాత్తు, గత ఏడాదిన్నర కాలంగా దేశం తీవ్ర ఆర్థిక మాంద్యానికి గురవుతూ వస్తోందని కేసీఆర ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక మాంద్యం అన్ని రంగాలపై ప్రభావం చూపుతోందన్నారు. 
 సబ్సిడీలు, మాఫీలకు 20 వేల కోట్ల నిధులు

ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో కూడా, ఉన్న పరిమితుల్లోనే పేద ప్రజల, రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు, కార్యక్రమాలను కొనసాగించడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు.ముఖ్యంగా ఎన్నికల్లో హమీ ఇచ్చిన రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు. పంట రుణాల మాఫీ కోసం బడ్జెట్‌లో రూ. 6000వేల కోట్లు కేటాయించారు. అయితే, రుణమాఫీని ఒకే విడతలో చేస్తారా? లేదా గతంలో చెప్పినట్లు మళ్లీ నాలుగు విడతల్లో చేస్తారా అనే విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే గత ఆరు నెలల్లో రుణ మాఫీపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో రైతులపై బ్యాంకులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చేసిన కేటాయింపులతోనైనా రుణమాఫీ అమలు అవుతుందని భావిస్తున్నారు.రైతు బంధు పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం కింద అందించే మొత్తాన్ని రూ. 8000 నుంచి రూ. 10000 పెంచడమే రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అని కేసీఆర్ పేర్కొన్నారు. రైతుబంధు పథకాన్ని యథాతథంగా కొనసాగిస్తామని తెలిపారు. ప్రస్తుత బడ్జెట్లో రైతు బంధు పథకానికి రూ. 12 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా రైతు బీమా ప్రీమియం చెల్లించడానికి రూ. 1137 కోట్లు వెచ్చిస్తున్నామని పేర్కొన్నారు.ప్రస్తుతం వ్యవసాయానికి అందిస్తున్న ఉచిత విద్యుత్‌ను కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రం ప్రభుత్వం చేపడుతున్న భారీ నీటి పారుదల ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించడానికి అయ్యే విద్యుత్ బిల్లుల భారం రైతులపై పడకుండా ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. దీంతో వ్యవసాయ విద్యుత్ సబ్సిడీల కోసం వెచ్చించే వ్యయం పెరిగిందన్నారు. విద్యుత్ సబ్సీడీల కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ బడ్జెట్‌లో రూ. 8000 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు.

No comments:
Write comments