కల్లుగీత కార్మికుల ఎక్స్ గ్రేషియకు నిధుల కొరత

 

నల్గొండ, ఏప్రిల్ 7, (globelmedianews.com)
కల్లు గీత కార్మికులకు అందాల్సిన ఎక్స్‌గ్రేషియా నిధులు మూడేండ్లుగా ప్రభుత్వం విడుదల చేయడం లేదు. బాధిత కుటుంబాలకు మంజూరైనట్టు చెబుతున్నా నిధుల్లేక ఇవ్వడం లేదని అధికారులు అంటున్నారు. యాదాద్రి జిల్లాలో 65 కుటుంబాల కు పరిహారం అందాల్సి ఉంది. జిల్లాలో రూ.1.58 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. కుటుంబ పెద్దను కోల్పోయి కొందరు, వికలాంగులుగా మారి మరికొందరు సంసారాలను భారంగా నెట్టుకొస్తున్న పరిస్థితి.యాదాద్రి భువనగిరి జిల్లాలో కల్లుగీత వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న కుటుంబాలు 26వేలు ఉన్నాయి. గీత కార్మికుడు రోజుకు పది నుంచి 20 చెట్లు ఎక్కుతాడు. పొద్దుకు మూడుసార్లు చెట్లు ఎక్కిదిగుతున్నా పొట్ట గడవడమే కష్టంగా మారుతున్న దైన్యస్థితి. 
కల్లుగీత కార్మికుల ఎక్స్ గ్రేషియకు నిధుల కొరత

నిత్యం ప్రమాదపుటంచుల్లోనే వీరి జీవనం సాగుతోంది. గాలి వచ్చినా, వర్షం వచ్చినా చెట్టు ఎక్కక తప్పదు. ఈ క్రమంలో అనేకమంది ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇలా చెట్లపై నుంచి పడి రాష్ట్రంలో యేటా 150 మంది దాకా చనిపోతున్నారు. మరి కొందరు కాళ్లు, చేతులు, నడుములు పోగొట్టుకుంటున్నారు. జిల్లాలో మూడేండ్లలో తాటి చెట్టుపై నుంచి పడి 25 మంది ప్రాణం కోల్పోయారు. 50 మందికి పైగా గీత కార్మికులు శాశ్వత వికలాంగులుగా మారారు. 40 మంది తాత్కాలిక వికలాంగులయ్యారు. అయితే, వీరిలో 65 మందికి మాత్రమే మెడికల్‌ బోర్డు సర్టిఫికెట్‌ ఇచ్చారు. వారికి పరిహారం మంజూరైన నిధులు విడుదల కాక ఎదురుచూస్తున్నారు. మిగిలిన వారు మెడికల్‌ బోర్డు సర్టిఫికెట్‌ కోసం నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.జిల్లా ఎక్సైజ్‌ కార్యాలయం పరిధిలో 65మంది గీత కార్మిక కుటుంబాలు పరిహారం కోసం మూడేండ్లుగా ఎదురు చూస్తున్నాయి. చెట్టుపై నుంచి పడి 17 మంది చనిపోయారు. 15 మంది శాశ్వత వికలాంగులుగా మారారు. 33 మంది తాత్కాలిక వికలత్వం పొందారు. వీరికి ఎక్స్‌ గ్రేషియా మంజూరు చేసి మూడేండ్లు కావస్తున్నా నిధులు మాత్రం విడుదల చేయలేదు. చనిపోయిన గీత కార్మికుని కుటుంబానికి రూ.5లక్షలు, శాశ్వత వికలాంగులకు రూ.5లక్షలు, తాత్కాలిక వికలత్వం పొందిన వారికి రూ.10వేల చొప్పున మొత్తం కోటి 58లక్షల 30వేల రూపాయల ఎక్స్‌గ్రేషియా బకాయిలు జిల్లాలో పేరుకుపోయాయి.చెట్టుపై నుంచి పడిన బాధితులు ప్రభుత్వం నుంచి ఎక్స్‌గ్రేషియా పొందాలంటే.. మెడికల్‌ బోర్డు సర్టిఫికెట్‌ తప్పనిసరి. ఈ సర్టిఫికెట్‌ను జిల్లా ఆస్పత్రిలోని త్రిసభ్య కమిటీలో ఉండే వైద్యులు నిర్ధారించి జారీ చేయాలన్నది నిబంధన. కానీ త్రిసభ్య కమిటీ సమావేశమే నెలల తరబడి జరగడం లేదు. జిల్లా ఆస్పత్రిలో సరైన వైద్య సౌకర్యం లేక బాధితులు మెరుగైన వైద్యం కోసం హైదారబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, ఇతర ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. అక్కడి వైద్యులు నిర్ధారణ చేసిన సర్టిఫికెట్స్‌ ఉన్నప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోవడం లేదు. ఆ సర్టిఫికెట్లను ఈ త్రిసభ్య కమిటీ సభ్యులు పరిశీలించి మెడికల్‌ బోర్డు సర్టిఫికెట్‌ ఇవ్వాల్సి ఉంది.

No comments:
Write comments