చిన్న పనులకు నో చెబుతున్న కాంట్రాక్టర్లు

 

కరీంనగర్, సెప్టెంబర్ 21, (globelmedianews.com)
కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో అంతర్గత రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఆ నిధులతో అన్ని డివిజన్‌లలో రోడ్లు, మురుగు కాల్వలు, కల్వర్టులు నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నారు. వీటితో పాటు ప్రధాన రహదారులకు ఇరువైపులా నడకదారి, కూడళ్ల సుందరీకరణ చేస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం ఇప్పటివరకు కేటాయించిన నిధులతో పాటు తాజాగా మరో రూ.వందకోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. మొదటి విడతలో రూ.100కోట్లు రాగా ఆ పనులు సాగుతున్నాయి. రెండోవిడతలో రూ.247.23కోట్లు రాగా టెండర్లు నిర్వహించిన పనులు సాగిస్తున్నారు. 
చిన్న పనులకు నో చెబుతున్న కాంట్రాక్టర్లు

ఇందులోనే పలు డివిజన్లకు సంబంధించిన రోడ్లు, మురుగు కాల్వలు ఉండగా కొన్ని ప్రాంతాలకు కాంట్రాక్టర్లు కరవయ్యారు.నగరంలోని పలు డివిజన్‌లలో టెండర్లు నిర్వహిస్తున్నారనే ఉద్దేశంతో నగరపాలక అధికారులు ఎడాపెడా రోడ్లు తవ్వుతున్నారు. ప్రభుత్వం రూ.కోట్లు మంజూరు చేస్తుండగా.. పనులను నాణ్యతతో చేపట్టేందుకు, టెండర్ల నిర్వహణలో ఎక్కువ సంఖ్యలో కాంట్రాక్టర్లు పాల్గొనేలా చూడాల్సిన బాధ్యత అధికారులది. ప్రతి పనికి ఎక్కువ సంఖ్యలో  పాల్గొనేలా నిబంధనలు అమలు చేయాల్సి ఉంటుంది. అయితే టెండర్ దారులు మొదటిసారి క్లాస్‌-5 రిజిస్ట్రేషన్‌ చేసుకున్న సమయంలోనే రూ.50 లక్షలు వరకు పనులు చేసుకోవచ్చని అనుమతి పత్రాలు ఇస్తున్నారు. ఈ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్క గుత్తేదారుకు పనులు చేయడానికి అర్హత ఉండగా.. జీవో నం.40ని అమలు చేస్తూ కొంతమందికే అభివృద్ధి పనులు చేసుకునేలా అవకాశం కల్పించారు.మిషన్‌ భగీరథ కింద తాగునీటి పైపులైన్లు, ఇంటింటా భూగర్భ డ్రైనేజీ పనుల అనుసంధాన ప్రక్రియ చేపట్టారు. దాంతో ఆ వీధులన్నీ గుంతలమయంగా మారాయి. వర్షం పడితే చాలు రోడ్లు బురదమయంగా మారుతున్నాయి. జీవో నం.40 ప్రకారం అభివృద్ధి పనులకు టెండర్లు పిలువాలనే నిబంధన అమలు చేయడంతో నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు కరవయ్యారు. ఈ జీవో ప్రకారం కొంతమంది గుత్తేదారులకే అర్హతలు ఉండటం, నగరపాలికలో పనిచేస్తే అత్యధిక గుత్తేదారులకు అవకాశం లేకపోవడంతో టెండర్లలో పాల్గొనేందుకు పోటీ లేకుండా పోయింది. కొంతమంది గుత్తేదారులు ఇతరుల పేర్ల మీద టెండర్లు వేసి పనులు చేస్తున్నారు. దీంతో కొన్ని డివిజన్‌లలో పనులు జరుగుతుండగా.. మరికొన్ని డివిజన్‌లలో నిధులు కేటాయించినా పనులు కావడం లేదు.అభివృద్ధి పనులను వేగంగా చేపట్టాలనే ఉద్దేశంతో ఐదు శాఖలకు పనులు అప్పగించి టెండర్లు పిలుస్తున్నారు. ఇందులో సాంఘిక సంక్షేమ, మున్సిపల్‌ కార్పొరేషన్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, ప్రజారోగ్యశాఖ ఉన్నాయి. వీటిలో సుమారు రూ.కోట్ల నిధులకు సంబంధించిన టెండర్లు పలుమార్లు రీకాల్‌ చేస్తున్నారు. కాంట్రాక్టర్లు టెండర్‌లలో పాల్గొనకపోవడం, మళ్లీ మళ్లీ టెండర్లు నిర్వహిస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో నిలిచిన పనులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

No comments:
Write comments