సక్కు ఆశలు అడియాశలు

 

అదిలాబాద్, సెప్టెంబర్ 17, (globelmedianews.com)
కుమ్రంబీమ్ జిల్లా అసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆదివాసీ ఎమ్మెల్యే. ఆదివాసీల హక్కుల కోసం పోరాటం చేసిన నాయకుడు. తుడుందెబ్బ అధ్యక్షుడు సోయం బాపురావుతో ఉద్యమాన్ని నిర్మించడంలో కీలక పాత్ర వహించిన లీడర్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అన్ని చోట్లా, కాంగ్రెస్ పార్టీ ఓడినా, ఆసిఫాబాద్‌లో మాత్రం ఆత్రం సక్కుకు, ఆదివాసీలు అండగా నిలిచి గెలిపించారు. అయితే ఎన్నికల తర్వాత మారిన సమీకరణలతో సక్కు , మరొక ఆదివాసీ ఎమ్మెల్యే రేగా కాంతారావుతో కలిసి, అనేక ఆశలు, అంచనాలతో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.  తనతో పాటు రేగా కాంతారావును సైతం టీఆర్ఎస్‌లో చేర్పించినా, సక్కు ఆశ మాత్రం మంత్రి పదవిపైనే అన్నది స్థానికంగా వారి అనుచరుల్లో జరిగిన చర్చ.  
సక్కు ఆశలు అడియాశలు

క్యాబినెట్‌ విస్తరణలో తనకు అవకాశం దక్కుతుందని చాలా కలలు కన్నారు సక్కు. ఆయనకు కేబినెట్‌ బెర్త్ ఖాయమన్న ప్రచారం కూడా జిల్లాలో జోరుగా సాగింది. పైగా రాష్ట్రంలో గిరిజన మంత్రి ఖాళీగా ఉండటంతో, తానే గిరిజన మంత్రినని అనుచరులతో ప్రచారం చేసుకున్నారట. విస్తరణ జరిగితే చాలు, అమాత్య పదవి అసిఫాబాద్‌కు దక్కుతుందని ఆయన అనుచరులు జోరుగా ప్రచారం చేసుకున్నారట. ఇక మంత్రినైతే చాలు ఆదివాసీల పోడు భూముల సమస్యలు, మౌలిక వసతులు కల్పిస్తామని ఆదివాసీ సంఘాలకు భరోసానిచ్చారట. కాని మొత్తం రివర్సయ్యింది. మొన్న జరిగిన మంత్రివర్గ విస్తరణలో సక్కుకు చోటు లభించలేదు. ఆయన ఆశ అడియాశలైంది. ఏళ్లుగా కంటున్న మంత్రి పదవి కల సాకారం అవుతుందని భావిస్తే, చివరకు పదవి దక్కపోవడంపై, ఆత్రం సక్కు తీవ్ర నిరాశకు గురయ్యారట. తనతోపాటు గులాబీ తీర్థం పుచ్చుకున్న రేగా కాంతారావుకు విప్ పదవైనా లభించింది. తనకు మాత్రం ఏ పదవీ రాలేదని రగిలిపోతున్నారట. పార్టీలో కొందరు పెద్దలు తన గురించి అసత్య ప్రచారాలు చేశారని, అందుకే మంత్రి పదవి దక్కలేదని తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారట సక్కు. కమలం గూటికి చేరుతారన్న ప్రచారమే, అమాత్య పదవిని దూరం చేసిందన్న చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. మరోవైపు మాటకు కట్టుబడి ఉండే నాయకుడిగా ఆదివాసీలలో మంచి పేరుంది ఆత్రం సక్కుకు. అలాంటిది మంత్రి పదవి వస్తుందని ప్రతి గూడెంలో ప్రచారం చేసుకున్నా, చివరకు పదవి రాకపోయేసరికి ఆదివాసీల్లో, పరపతి తగ్గుతుందని మధనపడుతున్నారట. పార్టీ మారినా, ఏంచేసినా, ఆదివాసీల కోసమేనని చెప్పుకున్న నాయకుడు, ఇప్పుడేం చేయాలో తెలియక సతమవుతున్నారట. అదేవిధంగా ఆదివాసీ నాయకుడికి కాకుండా, గిరిజన మంత్రి పదవి లంబాడా సామాజిక వర్గానికి చెందిన సత్యవతి రాథోడ్‌కు ఇవ్వడాన్ని అసలు జీర్ణించుకోలేక పోతున్నారట సక్కు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని పోరాటం చేసిన సక్కుకు, ఈ పరిణామం మరింత కుంగదీస్తోందట. అయితే కార్పొరేషన్ పదవుల్లో ప్రాధాన్యం లభిస్తుందని అనుచరులకు సర్ది చెబుతున్నారట సక్కు. మరి సక్కు ఆశ, కార్పొరేషన్‌ రూపంలోనైనా నెరవేరుతుందో లేదో చూడాలి.

No comments:
Write comments