అడుగంటున్న భూగర్భ జలాలు...

 

అదిలాబాద్, సెప్టెంబర్ 10, (globelmedianews.com)
అదిలాబాద్ జిల్లాలో ఇసుక దందా మళ్లీ జోరందుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగి.. ఇసుక మేటలు వేసింది. ఇది అక్రమార్కులకు వరంగా మారింది. వాగుల నుంచి నిత్యం వందలాది వాహనాల్లో అక్రమార్కులు దర్జాగా ఇసుక తరలిస్తున్నారు. యథేచ్ఛగా వివిధ ప్రాంతాలకు ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. మైన్స్, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. వాగుల నుంచి ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున ఇసుకను తరలిస్తుండడంతో క్రమేణ భూగర్భ జలాలు అడుగంటి పోయే ప్రమాదం నెలకొంది. కొన్నేళ్లుగా నిరంతరాయంగా అక్రమ ఇసుక రవాణా సాగుతోంది. 
అడుగంటున్న భూగర్భ జలాలు...

దీంతో భూగర్భ జలాలు అడుగంటి సాగునీటి వనరులు గణనీయంగా తగ్గిపోతున్నాయని రైతులు పేర్కొంటున్నా ప్రయోజనం లేకుండాపోతోంది. ప్రవాహిస్తున్న వాగుల నుంచి సైతం ఇసుకను తొడేస్తున్నారు. దాడుల సమయంలో పది వాహనాలు పట్టుబడితే వాటిలో కొన్ని వదిలేసి నాలుగైదు వాహనాలకే జరిమానాలు విధిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఆయా గ్రామాల శివారు ప్రాంతాల్లోని ప్రజలు సంబంధిత అధికారులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించినా పట్టించుకోవడంలేదని విమర్శలున్నాయి.ఆదిలాబాద్‌ మండలం లాండసాంగ్వి, అర్లి(బి) శివారు ప్రాంతాల్లోని సాత్నాల వాగు, చాందా(టి), భీంసరి, జైనథ్‌ మండలం తరోడ, పూసాయి, బేల మండలం పెన్‌గంగ పరీవాహక ప్రాంతాలు, తాంసి, తలమడుగు, ఇచ్చోడ, బోథ్, ఉట్నూర్‌ తదితర మండలాల్లోని వాగుల నుంచి ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. ఆయా ప్రాంతాల్లోని వాగుల్లో వర్షాకాలంలో కురిసే వర్షాలతో వాగు ప్రవహిస్తుంది. దీంతో ఆయా వాగు పరీవాహక ప్రాంతంలో రైతులకు సంబంధించి పంట పొలాలకు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి.ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి అధికారులు ఎంతమాత్రం కృషి చేయడం లేదు. పగలు రాత్రీ అని తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా సాగుతున్నా ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదని ప్రజలు వాపోతున్నారు. నిత్యం వందలాది ట్రాక్టర్లతో ఇసుక పట్టణంతోపాటు వివిధ ప్రాంతాలకు తరలిపోతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో భూగర్భజలమట్టం మరింతగా పడిపోయే ప్రమాదం ఉందని ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇసుక అక్రమ రవాణా అరికట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

No comments:
Write comments