ప్రతి నెల పంచాయితీలకు నిధులు

 

హైద్రాబాద్, సెప్టెంబర్ 18, (globelmedianews.com)
ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ ప్రభుత్వం సంక్షేమానికి పెద్ద పీట వేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. తాము స్థానిక సంస్థలను బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. శాసనసభలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పద్దులపై చర్చ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..ప్రతీ నెలా గ్రామపంచాయతీలకు రూ.339 కోట్లు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లాల ద్వారా సురక్షితమైన తాగునీరందిస్తున్నం. ప్రతీ ఇంటికి నీళ్లిచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దన్నారు. మిషన్ భగీరథను ఇతర రాష్ట్రాలు అధ్యయనం చేశాయి. గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం 30 రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నం. గతంలో గ్రామపంచాయతీ నిధులు తాగునీటికే సరిపోయేది. కొత్తగా 6లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నమని చెప్పారు.
ప్రతి నెల పంచాయితీలకు నిధులు

చెక్ పవర్ విషయంలో సర్పంచ్ తోపాటు ఉపసర్పంచ్ కు ఇవ్వడం వల్ల ఉన్న ఇబ్బంది ఏంటని సభ్యులను మంత్రి ఎర్రబెల్లి ప్రశ్నించారు. ఇద్దరు ప్రజాప్రతినిధులు గ్రామానికి మంచి సేవ చేసేందుకు అవకాశం ఉంటుంది. నెలకోసారి గ్రామ సభ పెట్టాలని స్పష్టంగా చెప్పాం. సర్పంచ్ కు చాలా అధికారాలు ఇచ్చినం. నిధులిస్తున్నాం.. సర్పంచ్ గ్రామాల్లో ప్రైమరీ స్కూల్స్, అంగన్ వాడీల మీద పర్యవేక్షణ చేయాలి. పాత విద్యుత్ స్తంభాలు, వైర్లను తొలగించి..ఎల్ ఈడీ లైట్లను ఏర్పాటు చేస్తున్నం. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీలను పటిష్టం చేస్తున్నాం. నిధులిస్తున్నం..మీ గ్రామాన్ని మీరు అభివృద్ధి చేసుకోవాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 30 రోజుల ప్రత్యేక ప్రణాళికలో రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతనిధులందరూ పాల్గొనాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులను ఆదుకున్నాం. చెరువులను బాగు చేసుకున్నాం. కాళేశ్వరంను ఛాలెంజింగ్‌గా పూర్తిచేసుకున్నాం. మిషన్ భగీరథను ఛాలెంజింగ్‌గా పూర్తిచేసుకున్నం. 24 గంటల కరెంటు అసాధ్యం కానిది సాధ్యం చేసి చూపించాం. ఈ రోజు రెండోసారి అధికారం చేపట్టాక గ్రామ సీమలు బాగుచేయాలని ఛాలెంజింగ్‌గా తీసుకుని పెద్దఎత్తున ముందుకు పోతున్నామన్నారు. డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాలు, చెత్త సేకరణ, మొక్కల పెంపకం, పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం లక్ష్యంగా ముందుకు పోతున్నట్లు తెలిపారు. ప్రతీ గ్రామపంచాయతీకి ఒక ట్రాక్టర్ కొనిచ్చే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నర్సరీలను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రామపంచాయతీలకు అధికారాలు ఇచ్చాం, నిధులు ఇచ్చాం. నిధుల కొరత లేదని మంత్రి పేర్కొన్నారు.

No comments:
Write comments