సచివాలయ నిర్మాణంపై ప్రభుత్వం పునరాలోచన

 

హైద్రాబాద్, సెప్టెంబర్ 26, (globelmedianews.com)
కొత్త సచివాలయం నిర్మాణంపై రాష్ట్ర సర్కారు ఆచితూచి అడుగేస్తున్నది. ఆర్థిక మాంద్యం నెలకొన్న పరిస్థితుల్లో నిర్మాణంపై పునరాలోచనలో పడినట్టుగా తెలిసింది. అసెంబ్లీ నిర్మాణం కోసం చారిత్రక ఎర్రమంజిల్‌ భవనాన్ని కూల్చొద్దని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కొత్త సచివాలయం నిర్మాణానికి కూడా కోర్టు బ్రేకులు వేసే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తున్నది. ఆర్థిక మాంద్యంతో కారణంగా 2019-20 బడ్జెట్‌లో అన్ని శాఖలకు నిధుల్లో కోత విధించిన విషయం తెలిసిందే. అత్యంత కీలకమైన సంక్షేమం, విద్య, వైద్యం రంగాలకు నిధులు తగ్గించడంపై ఆయా వర్గాల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కీలక శాఖలకు నిధుల్లో కోత విధించి వాటిని కొత్త సచివాలయం నిర్మాణం కోసమే ఖర్చు చేస్తారనే బడ్జెట్‌లో విమర్శలు రావచ్చనే అభిప్రాయంలో కూడా సర్కారు ఉంది. 
సచివాలయ నిర్మాణంపై ప్రభుత్వం పునరాలోచన

ఈ నేపథ్యంలోనే సచివాలయం నిర్మాణం కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికోసం సుమారు రూ. 500 కోట్ల పైనే నిధులు ఖర్చవుతాయనీ, ఆర్థిక మాంద్యం ప్రభావం తీవ్రంగా వున్న తరుణంలో సచివాలయం నిర్మాణం అవసరమా? అని ప్రభుత్వం భావిస్తున్నది. మాంద్యం నేపథ్యంలో నిధులు ఖర్చు చేసేముందు ఆర్థిక వనరుల లభ్యత, పని అవసరాన్ని బేరీజు వేసుకోవాల్సిన అవసరముందని సీఎం కేసీఆర్‌ అన్నట్టు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో వందల కోట్టు ఖర్చు పెట్టి సచివాలయాన్ని నిర్మిస్తే ప్రతిపక్షాల నుంచే కాకుండా, ప్రజల నుంచి కూడా విమర్శలు వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డట్టు ప్రగతిభవన్‌ వర్గాలు చెబుతున్నాయి.ఎర్రమంజిల్‌ భవనాన్ని కూల్చొద్దని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది కొత్త సచివాలయం నిర్మాణంపైనా ఇదే తీర్పు రావచ్చనే భావన సర్కారులో ఉంది. పాత సచివాలయంలో వారసత్వపు కట్టడాలు లేకున్నప్పటికీ, వందేండ్ల నాటి చారిత్రక కట్టడం ఉంది. సచివాలయం నిర్మాణంలో భాగంగా ఆ భవనాన్ని కూల్చాల్సి ఉంది. పురాతన భవనాన్ని పరి రక్షించాలని ఇప్పటికే నిజాం వారసులు, స్వచ్ఛంద సంస్థలు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ క్రమంలో కోర్టు అభ్యంతరం చెప్పే అవకాశాలు ఉన్నాయి.ఏడాది కాలంగా కొత్త సచివాలయం నిర్మాణం చేపడతామని సర్కారు బల్లగుద్ది ప్రకటిస్తున్నప్పటికీ ఈ 2019-20 వార్షిక బడ్జెట్‌లో పైసా కేటాయించలేదు. దీంతో సచివాలయం నిర్మాణానికి సర్కారు వెనకడుగు వేసిందనడానికి మరింత బలం చేకూరుతున్నది. ఇంకా సబ్‌కమిటీ నివేదికను అధ్యయనం చేయలేదనీ, డిజైన్‌ కూడా పూర్తి స్థాయిలో ఖరారు కాకపోవడంతోనే బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఒక మంత్రి అన్నారు. సచివాలయం నిర్మాణంపై మంచి చెడులను బేరీజు వేసుకున్న తర్వాతనే ఈ విషయంపై సీఎం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. పైగా సచివాలయం ప్రాంగణంలో ఉన్న రెండు మసీదులను యధావిధిగా కొనసాగించాలని, శాసనసభలో మజ్లిస్‌ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ డిమాండ్‌ చేసిన విషయాన్ని కూడా సీఎం పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందన్నారు.హుస్సేన్‌సాగర్‌ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి బహుళ అంతస్తుల నిర్మాణాలు, విస్ఫోటనాలు, పేలుడు పదార్థాలు వాడకుండా నిషేధం ఉంది. కానీ నూతన సచివాలయం నిర్మాణం పనులు చేపట్టాలంటే ప్రస్తుతం ఉన్న భవనాలను కూల్చడానికి పేలుడు పదార్థాలను ఉపయోగించి కూల్చాల్సి ఉంటుందని రోడ్లు భవనాల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ అంశాలను జత చేస్తూ సచివాలయాన్ని కూల్చరాదని కొన్ని స్వచ్ఛంద సంస్థలు హైకోర్టులో పిటిషన్లు వేశాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే కొత్త సచివాలయం నిర్మాణంపై ప్రభుత్వం స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పాత సచివాలయంలో ఉన్న శాఖలను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎదురుగా ఉన్న బూర్గుల రామక ష్ణారావు భవనానికి అన్ని శాఖలు, విభాగాలను తరలించారు. ఇంకా అక్కడ మరమ్మత్తు పనులు, కొత్త ఛాంబర్ల పనులు జరుగుతూనే ఉన్నాయి.

No comments:
Write comments