కర్నూలులో భూ నిరసనలు

 

కర్నూలు, సెప్టెంబర్ 16, (globelmedianews.com)
హెల్త్‌ సిటీ, ఆటోనగర్‌ ఏర్పాటుకు తమ భూములు ఇచ్చేది లేదని ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నన్నూరు గ్రామ శివారులోని భూముల్లో సర్వే చేసేందుకు వచ్చిన అధికారులను గ్రామ రైతులు అడ్డుకున్నారు. నన్నూరు గ్రామంలో 183, 184-ఎ, బి, సి, డి, 1264, 1300 సర్వే నెంబర్ల వరకూ దాదాపు 468.39 ఎకరాల భూములను హెల్త్‌సిటీ, ఆటోనగర్‌ల ఏర్పాటు కోసం కలెక్టర్‌ వీరపాండ్యన్‌ మూడ్రోజుల క్రితం పరిశీలించారు. ఎపిఐఐసి ద్వారా భూములను సేకరించి ఉన్నతాధికారులకు నివేదించేందుకు సర్వేయర్లు, రెవెన్యూ యంత్రాంగం సోమవారం సర్వే చేసేందుకు వచ్చారు. 
కర్నూలులో భూ నిరసనలు

విషయం తెలుసుకున్న దాదాపు వందమంది రైతులు అక్కడికి చేరుకున్నారు. భూములను సర్వే చేయకుండా, పొలాల్లోకి రాకుండా అధికారులను అడ్డుకున్నారు. తమ భూములు ఇచ్చేది లేదని, తమకే కావాలని నినాదాలు చేస్తూ   నిరసన చేపట్టారు. తహశీల్దార్‌ శివరాముడు అక్కడికి చేరుకుని భూములు ఇస్తే గ్రామం మరింతగా అభివృద్ధి చెంది స్థానికులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పారు. ప్రజాప్రయోజనాల కోసం భూములను తీసుకునేందుకు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామని, ఏకపక్షంగా వ్యవహరించబోమని, సర్వే చేసేందుకు సహకరించాలని రైతులను కోరారు. గ్రామానికి చెందిన రైతులు విజయుడు, శివయ్య, నాగశేషులు, అయ్యస్వామి మాట్లాడుతూ... తమ భూములను ఇవ్వడానికి ఒప్పుకోమన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ చేసి మెజార్టీ రైతులు ఒప్పుకుంటేనే భూములు తీసుకోవాలని చట్టాలు చెబుతున్నాయని అన్నారు. రెవెన్యూ యంత్రాంగం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా భూములు సర్వే చేయడం ఏమిటని అధికారులను నిలదీశారు. భూములు తీసుకోవాలంటే ముందుగా గ్రామంలో సభ నిర్వహించాలని, రైతులతో సమావేశం నిర్వహించిన తర్వాతే నిర్ణయం తీసుకుని తెలుపుతామని అన్నారు. పరిహారం మార్కెట్‌ విలువ కంటే మూడింతలు ఎక్కువగా ఇవ్వాలని కోరారు. అంతవరకూ సర్వే చేయించేది లేదని అడ్డుకున్నారు. మండలంలోని లొద్దిపల్లె, మీదివేములలో పనికిరాని భూములు ఉన్నాయని, వాటిలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే రవాణా మార్గంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు కూడా అభివృద్ధి చెంది స్థానికులకు ఉపాధి కలుగుతుందని రెవెన్యూ అధికారులకు సూచించారు. రైతులు తెలిపిన విషయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామంటున్నారు తహశీల్దార్ రామ్మూర్తి. పరిహారం విషయంలో న్యాయం జరిగేలా చూస్తానని తెలిపారు. మరో వైపు 2013 భూసేకరణ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి భూములు తీసుకోవాలి. ఇప్పటికే శకునాల, బ్రాహ్మణపల్లె, గడివేముల మండలంలోని గని గ్రామాల్లో సోలార్‌ ప్లాంట్‌ కోసం వేలాది ఎకరాల భూములు తీసుకున్నారు. రైతులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం ఇవ్వలేదు. భూసేకరణ చట్టాన్ని అమలు చేయలేదు. నన్నూరులో హెల్త్‌సిటీ, ఆటోనగర్‌ల కోసం పేద రైతుల భూములు తీసుకుని అన్యాయం చేయడం దారుణం. రైతులకు అన్యాయం జరిగితే రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తాం. ప్రజాప్రయోజనాల కోసం ప్రభుత్వం భూములు తీసుకోవాలనుకున్నప్పుడు భూసేకరణ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి రైతులకు న్యాయం జరిగిన తర్వాతే భూములు సేకరించాలి.

No comments:
Write comments