చిన్నమ్మకు అన్నాడీఎంకే బాధ్యతలు

 

చెన్నై, సెప్టెంబర్ 30  (globelmedianews.com)
తమిళనాట అన్నాడీఎంకేలో త్వరలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయా? త్వరలో విడుదల కానున్న శశికళ వైపు కొందరు అధికార పార్టీకి చెందిన నేతలు ఆసక్తి చూపుతున్నారా? అంటే అవుననే అంటున్నారు. ఇప్పటికే అన్నాడీఎంకే వరస పరాజయాలతో కూనారిల్లి పోయి ఉంది. పన్నీర్ సెల్వం, పళనిస్వామి నాయకత్వం పార్టీని ఏమాత్రం విజయం వైపు నడిపించడం లేదు. వరసగా జరుగుతున్న ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని చెప్పక తప్పదు.ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు ఇద్దరూ వేర్వేరు కుంపట్లు పార్టీలోపెట్టుకున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటును మాత్రమే అధికార పార్టీ గెలుచుకోగలిగింది. 
చిన్నమ్మకు అన్నాడీఎంకే బాధ్యతలు

అదీ పన్నీర్ సెల్వం కుమారుడు రాఘవేంద్ర పోటీ చేసిన తేని నియోజకవర్గం మాత్రమే. దీంతో పార్టీ సీనియర్ నేతల్లో అలజడి ప్రారంభమయింది. ఇప్పటికిప్పుడు అధికార పార్టీకి ప్రమాదం ఏమీ లేకపోయినా భవిష్యత్తులో ప్రమాద ఘంటికలు ఆ పార్టీ నేతలను కలవరపెడుతున్నాయి.మరోవైపు డీఎంకే దూసుకుపోతోంది. స్టాలిన్ నాయకత్వంలో వరస విజయాలతో మంచి ఊపు మీద ఉంది. ఈ నేపథ్యంలో శశికళను మళ్లీ పార్టీలోకి ఆహ్వానించాలన్న చర్చ అన్నాడీఎంకేలో మొదలయింది. దీనివల్ల నాయకత్వ సమస్య తీరడంతో పాటు క్యాడర్ లో కూడా ఉత్సాహం పెరుగుతుందని సీనియర్ నేతలు ఆశిస్తున్నారు. ఇప్పటికే సీనియర్ నేతలు తంబిదురై వంటి నేతలు శశికళ పార్టీలోకి వస్తే అదనపు బలం సమకూరుతుందని వ్యాఖ్యానిస్తున్నారు కూడా.శశికళ త్వరలోనే శిక్ష పూర్తి చేసుకుని విడుదల కానున్న నేపథ్యంలో ఆమెను పార్టీలోకి తిరిగి ఆహ్వానించాలని ఎక్కువ మంది నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే దినకరన్ ను మాత్రం దాదాపుగా అందరూ నేతలు వ్యతిరేకిస్తున్నారు. చిన్నమ్మ సాఫ్ట్ గా డీల్ చేస్తే, దినకరన్ వైలెంట్ గా ఉంటారని, ఆయనను మాత్రం పార్టీలోకి అనుమతించబోమని మరికొందరు సూచిస్తున్నారు. శశికళ బయటకు రాగానే అధికార అన్నాడీఎంకేలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు మాత్రం పుష్కలంగా కన్పిస్తున్నాయి.

No comments:
Write comments