చౌక బియ్యం.. అవినీతికి ఆస్కారం (పశ్చిమగోదావరి)

 

ఏలూరు, సెప్టెంబర్ 16  (globelmedianews.com): 
ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తున్న కిలో రూపాయి బియ్యం పథకం అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది. జిల్లాలో అనేక మంది దళారులు, కొందరు మిల్లర్లు డీలర్ల సహాయంతో రేషన్‌ బియ్యాన్ని సేకరించి అక్రమంగా రవాణా చేస్తున్నారు. జిల్లాలో తరచూ ఏదో ఒక మూల విజిలెన్స్‌, రెవెన్యూ, పోలీసు అధికారుల దాడుల్లో రేషన్‌ బియ్యం పట్టుబడుతూనే ఉంది. ఏటా దాదాపు 5 వేల క్వింటాళ్ల బియ్యం అధికారుల తనిఖీల్లో పట్టుబడుతుందంటే అక్రమ రవాణా ఏ స్థాయిలో జరుగుతుందో అంచనా వేయొచ్ఛు. జిల్లాలో రేషన్‌ బియ్యం అక్రమ రవాణా అడ్డూఅదుపూ లేకుండా సాగుతోంది. జిల్లా సరిహద్దుల నుంచి నిత్యం టన్నుల కొద్దీ రేషన్‌ బియ్యం ఇతర రాష్ట్రాలకు తరలిపోతోంది. 
చౌక బియ్యం.. అవినీతికి ఆస్కారం (పశ్చిమగోదావరి)

మరోపక్క స్థానికంగా కొందరు మిల్లర్లు ప్రతి నెలా టన్నుల కొద్ది రేషన్‌ బియ్యాన్ని డీలర్ల నుంచి సేకరించి రీ సైక్లింగ్‌ చేసి సన్న బియ్యం పేరిట బహిరంగ మార్కెఫట్‌లో విక్రయిస్తూ జనానికి కుచ్చుటోపీ పెడుతున్నారు. ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్న కొందరు మిల్లర్లు రేషన్‌ బియ్యం కొనుగోలు చేసి తిరిగి ప్రభుత్వానికి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న తెల్లకార్డుదారులకు రేషన్‌ బియ్యం పంపిణీ చేసేందుకు ప్రతి నెలా ప్రభుత్వం సుమారు రూ.56 కోట్లు ఖర్చు చేస్తోంది. కిలో ధాన్యాన్ని రైతుల నుంచి రూ.17.50కి కొనుగోలు చేసి మిల్లులకు రవాణా చేసి బియ్యం మారుస్తారు. ఆ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ ద్వారా కార్డుదారులకు ప్రతి నెలా పంపిణీ చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు, మిల్లు ఖర్చు, గన్నీ సంచుల వ్యయం, రవాణా ఖర్చులన్నీ కలిపి కిలో బియ్యం పంపిణీకి ప్రభుత్వం రూ.35 ఖర్చు చేస్తున్నట్లు అంచనా. కార్డుదారుల్లో అధికశాతం మంది రేషన్‌ బియ్యం తినేందుకు ఇష్టపడటం లేదు. ఈ క్రమంలో ప్రతినెలా వచ్చే బియ్యాన్ని దళారులకు రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని దళారులు అక్రమంగా రవాణా చేసి సొమ్ము చేసుకొంటున్నారు.

No comments:
Write comments