గులాబీలో సీన్ మారుతోంది...

 

హైద్రాబాద్, సెప్టెంబర్ 6, (globelmedianews.com)
టీఆర్ఎస్ పార్టీలో రంగులు మారుతున్నాయి. సీను మారుతున్నట్టు కనబడుతున్నది. నిరసన స్వరాలే కాదు.. గులాబీలకు ఓనర్లం, బాసులమనే నినాదాలు సైతం ఇప్పుడు వినబడుతున్నాయి.ఒకప్పుడు రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్‌ పార్టీలో ఇలాంటి స్వరాలే రోజుకొకటి వినబడేవి. అంత తీవ్ర స్థాయిలో కాకపోయినా ఇప్పుడు కారు పార్టీలో రోజుకో గొంతు పెల్లుబుకుతున్నది. నియంతృత్వాన్నిభరించలేకో, దాన్ని ఎదిరించలేకో, పదవులు రాలేదని బాధో లేక ఉన్న పదవులు పోతాయనే ఆందోళనో తెలియదుగానీ మొత్తం మీద గుంభనంగా ఉన్న గులాబీ పార్టీ కాస్తా క్రమక్రమంగాకుమ్ములాటలకు కేంద్రంగా మారుతున్నదనే సంకేతాలు బలంగా వస్తున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అధికార పార్టీలో ఇప్పుడు ముఖ్యంగా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ట్రబుల్‌ షూటర్‌గాపేరు తెచ్చుకుని సిద్ధిపేటకే పరిమితమైన హరీశ్‌రావు, పదవీ గండం  పొంచి ఉన్న వైద్య మంత్రి ఈటల, ఎంతో అనుభవమున్నా అదంతా ఎందుకూ పనికిరాకుండా పోతున్నదనే ఆవేదనతోరగిలిపోతున్న మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి శిబిరాలు అత్యంత క్రియాశీలకంగా పని చేస్తున్నాయని వినికిడి. 
గులాబీలో సీన్ మారుతోంది...

గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న పరిణామాలను గమనిస్తే ఈ విషయం ఇట్టేఅర్థమైపోతున్నది. కొద్ది రోజుల క్రితం గులాబీ జెండాకు ఓనర్లం మేమేనంటూ పార్టీ పెద్దలనుద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేసిన ఈటలకు.. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నుంచి అదే రోజు ఫోన్‌కాల్‌ వెళ్లింది.దాంతో తన వ్యాఖ్యలను సోషల్‌ మీడియాలో వక్రీకరించారంటూ పత్రికలకు మంత్రి ఏకంగా ఓ ప్రకటనే విడుదల చేశారు. ఆ తర్వాత రెండు మూడు రోజులకు తెలంగాణ భవన్‌లో జరిగిన ఓ సమావేశంలోకేటీఆర్‌ మాట్లాడుతూ.. 'కొంతమంది నాయకులు.. పదవులు రాగానే ఏదేదో మాట్లాడుతున్నారు...' అంటూ హెచ్చరించారు. ఇది జరిగి వారం రోజులు కాకముందే తాజాగా కరీంనగర్‌లో జరిగినఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఈటల సమక్షంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ చేసిన వ్యాఖ్యలు.. టీఆర్‌ఎస్‌లో కుంపట్లు ఉన్నాయనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. 'ఈటలకూ, నాకూనిజాలు మాట్లాడటమే తెలుసు. కడుపులో ఏమీ దాచుకోం.మాకు అబద్ధాలు రావు...' అంటూ రసమయి ఆవేదన వ్యక్తం చేయగా.. అదే వేదికపైనున్న ఈటల.. జాగ్రత్తగా మాట్లాడాలంటూ ఆయనకుసూచించారు. ఆ తర్వాత ఆయనే మాట్లాడుతూ.. 'కొంత మంది రాజకీయ నాయకులకు మెరిట్‌ లేదు. రాజ్యాంగంలో రాసుకున్నట్టు మనం ఉన్నామా..? అంబేడ్కరిజంపై చర్చ జరగాలంటూ...' తనఆవేదనను వ్యక్తం చేశారు. ఈటలను మంత్రివర్గం నుంచి తొలగిస్తారనే వార్తల నేపథ్యంలోనే.. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే ప్రచారం జోరుగా కొనసాగుతున్నది.మరోవైపు గత ప్రభుత్వంలో ఆనాటి డిప్యూటీ సీఎం రాజయ్యను మంత్రివర్గం నుంచి తప్పించటంతో ఆకస్మికంగా ఉప ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న సీనియర్‌ నేత కడియం శ్రీహరి సైతం.. ఇన్నాళ్లూమౌనంగా ఉండి, ఇప్పడు చలో కాళేశ్వరం అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అధినేతను ప్రసన్నం చేసుకోవటం, తద్వారా త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో తన బెర్తును ఖాయంచేసుకోవటంలో భాగంగానే ఆయన ఉన్నఫళంగా ఈ యాత్ర చేపట్టారన్నది నిర్వివాదాంశం. మరోవైపు మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి బెర్తు ఖాయం చేసి.. జగదీశ్‌రెడ్డిని పక్కనబెడతారనే ప్రచారం కూడా కొనసాగుతున్నది. ఇదే జరిగితే ఆ జిల్లాలో మరో కుంపటి రాజుకున్నట్టేననే కామెంట్లు అధికార పార్టీలోనే వినబడుతున్నాయి.సీనియర్‌ అయిన తుమ్మల.. ముందస్తు ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత కొద్ది రోజులకే హైదరాబాద్‌లోని తన క్వార్టర్‌ను ఆయన ఖాళీ చేశారు. ఖాళీ చేయొద్దంటూ సీఎంవో నుంచి ఫోన్‌ వెళ్లినాఆయన పట్టించుకోలేదు. ఆయనకు ఎమ్మెల్సీ పదవినిచ్చి.. క్యాబినెట్‌లోకి తీసుకుంటారని భావించినా, ఇప్పటి వరకూ అలాంటి ఊసే లేకపోవటంతో ఆయన ఒకింత గుర్రుగా ఉన్నట్టు సమాచారం.ఇబ్రహీంపట్నం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డిది సైతం ఇదే పరిస్థితి. హ్యాట్రిక్‌ కొట్టిన తనకు కాకుండా జూనియర్లకు మంత్రి పదవులు కట్టబెట్టటాన్ని నిరసిస్తూ..ముందస్తు ఎన్నికల తర్వాత ఇప్పటి వరకూ ప్రగతి భవన్‌ మెట్లెకక్కపోవటాన్నిబట్టి ఆయన అధిష్టానంపై ఏ స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారనేది తెలిసిపోతున్నది. ఇలాంటి అసంతృప్త స్వరాలన్నీహరీశ్‌ వెనుక చేరుతున్నాయనే గుసగుసలు వినబడుతున్నాయి. వీరి ఎత్తులు, పొత్తులు ఈ విధంగా ఉండగా.. టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకూ అప్రధానంగా,అనామకుడిగా ఉండిపోయిన ట్రబుల్‌ షూటర్‌ హరీశ్‌రావు మాత్రం.. పరిస్థితులన్నింటినీ జాగ్రత్తగా బేరీజు వేసుకుంటున్నారన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఈయన మౌనం వెనుకా, ఈటల మాటలవెనుకా కమలం పార్టీ హస్తం ఉందనే ప్రచారం కొనసాగుతున్న వేళ... వీటిన్నింటికీ చెక్‌ పెట్టాల్సిన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ మౌనంగా ఉండటం ఒకింత ఆశ్చర్యం కలిగించే విషయమే.అయితే ఆయన వ్యూహాత్మకంగానే పెదవి విప్పటం లేదని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతుండటం గమనార్హం.

No comments:
Write comments