ఈసీ నిర్ణయంతో డీలా పడుతున్న దేవగౌడ

 

బెంగళూర్, సెప్టెంబర్ 30, (globelmedianews.com)
సమయం గడిచే కొద్దీ వేడి తగ్గిపోతుంది. సెంటిమెంట్ వర్క్ అవుట్ కాదు. కర్ణాటకలో జరగనున్న ఉప ఎన్నికలు వాయిదా పడటంతో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ లు ఒకింత ఊరట చెందినా మరో ముఖ్యమైన జనతాదళ్ ఎస్ మాత్రం అసహనంగా ఉంది. వీలయినంత త్వరగా ఎన్నికలు జరిగితే తిరిగి కుమార స్వామి ముఖ్యమంత్రి పీఠం ఎక్కే అవకాశముందని ఆయన తండ్రి, పార్టీ అధినేత దేవెగౌడ అంచనా వేసుకున్నారు. మధ్యంతర ఎన్నికలు వస్తాయని ముందు నుంచి చెబుతున్న దేవెగౌడ ఈ పదిహేను అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో సత్తా చాటి కుమారను మరోసారి పీఠంపై కూర్చోబెట్టాలనుకున్నారు.అందుకే దేవెగౌడ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడానికి నిరాకరించారు. లోక్ సభ ఎన్నికల్లో పొత్తు ప్రయోగం విఫలం కావడంతో దేవెగౌడ ఆ ఆలోచనను విరమించుకున్నారు. 
ఈసీ నిర్ణయంతో  డీలా పడుతున్న దేవగౌడ

మరోవైపు సిద్ధరామయ్య వ్యవహారం కూడా దేవెగౌడకు చికాకు తెప్పించింది. సిద్ధరామయ్య కారణంగానే కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి కారణమని నమ్మే వాళ్లల్లో దేవెగౌడ ఒకరు. అంతేకాకుండా క్యాడర్ లో కూడా పొత్తుతో అసహనం బయలుదేరినట్లు గుర్తించారు దేవెగౌడ అందుకే ఉప ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేయాలని నిర్ణయించారు.పదిహేను నియోజకవర్గాల్లో గత నెలన్నర రోజులుగా దేవెగౌడ విపరీతంగా పర్యటిస్తున్నారు. పార్టీ నేతలను, క్యాడర్ లో జోష్ నింపుతున్నారు. గతంలో మాదిరిగా ఈసారి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని హామీ ఇస్తున్నారు. పార్టీ విజయం సాధిస్తే అది కార్యకర్తలదే విజయమంటూ నినదిస్తున్నారు. కుమారస్వామి తిరిగి ముఖ్యమంత్రి అయితే కార్యకర్తలకు పెద్దపీట వేస్తామని భరోసా ఇస్తున్నారు. ఏ పార్టీతో ఎన్నికల్లో పొత్తు ఉండదని, పార్టీ ఓటు బ్యాంకును కాపాడుకోవాలని సూచనలిస్తున్నారు.అయితే ఎన్నికల కమిషన్ పదిహేను నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలను వాయిదా వేయడంతో దేవెగౌడ నిరాశ చెందారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకూ ఎన్నికలు జరిపే అవకాశంలేదు. ఎన్నికలు జరపటానికి ఎన్నికల కమిషన్ కు మరో నాలుగునెలల సమయం ఉంది. దీంతో జేడీఎస్ శిబిరం డీలా పడింది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కుమారస్వామి మెడకు చుట్టుకునేలా ఉంది. ఇప్పటికే సీనియర్ ఐపీఎస్ అధికారి అలోక్ కుమార్ ఇంట్లో సీబీఐ సోదాలు జరిపింది. ఎప్పుడైనా కుమారస్వామిని విచారించే అవకాశముందంటున్నారు. దీంతో దేవెగౌడ కొంత ఆందోళనకు గురవుతున్నట్లు కన్పిస్తుంది.

No comments:
Write comments