మందు వ్యాపారంలోకి రియల్ ...

 

హైద్రాబాద్, సెప్టెంబర్ 17, (globelmedianews.com)
ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ప్రకటించనున్న తరుణంలో ఈ వ్యాపార రంగంలోకి కొత్త రక్తం దూసుకురావడానికి సిద్ధమవుతోంది. గడచిన రెండేళ్లలో మద్యం అమ్మకాలు పెరగడం, లాభాలుకూడా భారీగా రావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం వ్యాపారంలో ఉన్నవారితో పాటు కొత్తవారు పోటీకి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మందగించడంతో చాలా మంది రియల్టర్లు మద్యం వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నారు. నూతన మద్యం పాలసీ ప్రకారం ముందుగా దరఖాస్తు ఫారానికి డబ్బులు జమచేసి పోటీలో దిగితే చాలనుకుంటున్నారు. 
మందు వ్యాపారంలోకి  రియల్ ...

అదృష్టం వరించి లాటరీలో దుకాణం వస్తే ఆ తర్వాత సిండికేట్‌ కావచ్చన్న ధీమాతో ఉన్నారు. ఈ క్రమంలో ఈ సారి మద్యం దుకాణాల కోసం పెద్ద ఎత్తున పోటీ పడే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈసారి మద్యం దుకాణాల దరఖాస్తు ఫీజును రూ.2 లక్షలకు పెంచనుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో వ్యాపారులు ఆసక్తిగా ఉన్నారు. లాటరీలో దుకాణం వచ్చిన తర్వాతే ఈఎండీ చెల్లించాలన్న నిబంధన సడలింపుతో పోటీదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు సైతం భావిస్తున్నారు. జిల్లాలో మొత్తం 67 వైన్స్‌లు, 4 బార్లు ఉండగా 2017లో 1130మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో దరఖాస్తుకు రూ.లక్ష రుసుం తిరిగి చెల్లించని మొత్తాన్ని నిర్ణయించారు. దీంతో ప్రభుత్వానికి రూ.11.30 కోట్లు ఆదాయం వచ్చింది. ప్రధానంగా భువనగిరి, ఆలేరు, రామన్నపేట, మోత్కూర్‌ సర్కిళ్లలో అడ్డగూడూరు మండలం మినహా మిగతా 15 మండలాల్లో మద్యం దుకాణాలను ఏర్పాటు చేశారు. తాజాగా అడ్డగూడూరు మండలంతోపాటు, నూతన మన్సిపాలిటీల్లో బార్లు రాబోతున్నాయి. 2015లో మద్యం దుకాణం దరఖాస్తు రుసుం రూ.50వేలు ఉండగా ఆ మొత్తాన్ని 2107లో రూ.లక్షకు పెంచినప్పటికీ దరఖాస్తులు భారీగా వచ్చాయి. ఈసారి బార్లు, వైన్స్‌ల సంఖ్యతోపాటు మద్యం రెంటల్‌ కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి. గడిచిన రెండేళ్లలో జిల్లాలో మద్యం, బీర్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. అక్టోబర్‌ 2017 నుంచి సెప్టెంబర్‌ 2018 వరకు రూ.468.62 కోట్ల విలువ చేసే మద్యం, బీర్లు సేవించారు. 7,35,309 మద్యం సీసాలు, 14,06,130 బీరు బాక్సులు ఖాళీ చేశారు. అయితే రెండో సంవత్సరంలో అమ్మకాలు మరింత పెరిగాయి. అక్టోబర్‌ 2018 నుంచి ఆగస్టు 2019 వరకు  రూ.522.83 కోట్ల విలువైన మద్యాన్ని, బీర్లను సేవించారు. ఇందులో 7,60,337 మద్యం సీసాలు, 15,01,709 బీరు బాక్సుల అమ్మకం జరిగింది. దీంతో ప్రభుత్వానికి, వ్యాపారులకు ఆదాయం భారీగానే సమకూరింది. ఈసారి మరింత ఆదాయం లక్ష్యంగా ప్రభుత్వం నూతన పాలసీని తీసుకురాబోతుంది.  

No comments:
Write comments