యురేనియంకు అటవీశాఖ మోకాలడ్డు

 

హైద్రాబాద్, సెప్టెంబర్ 7, (globelmedianews.com)
తెలుగు రాష్ట్రాల్లోని ఐదు జిల్లాల్లో విస్తరించిన నల్లమల అడవుల్లో యురేనియం ప్రాజెక్టు ప్రతిపాదన అమోదయోగ్యం కాదని తెలంగాణ అటవీ శాఖ ప్రభుత్వానికి స్పష్టంచేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సమగ్ర వివరాలతో రూపొందించిన నివేదికను రెండు రోజుల క్రితం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపినట్లు తెలిసింది. నల్లమలలో సర్వే కోసం గతంలో ఇచ్చిన అనుమతులు, ఇటీవల కాలంలో అటామిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌ అటవీశాఖకు పంపిన ప్రతిపాదనలు, అటవీశాఖ కోరిన వివరణ, చివరగా తమ అభిప్రాయాలను ఆ నివేదికలో అటవీశాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్సర్వేటర్‌ (పిసిసిఎఫ్‌) వివరించారు. యురేనియం వెలికితీత ప్రక్రియలో వెలువడే వ్యర్థాలతో జీవ వైవిద్యానికి చిరునామాగా ముద్రపడిన నల్లమల ఛిద్రమవుతుందని అటవీశాఖ స్పష్టంచేసింది. 
యురేనియంకు అటవీశాఖ  మోకాలడ్డు

కృష్ణా నదిపై నిర్మించిన శ్రీశైలం, పులిచింతల ప్రాజెక్టులకు కూడా ప్రమాదం పొంచివుందని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. యురేనియం ప్రాజెక్టుతో గుండ్లకమ్మ నదికి కూడా ప్రమాదం పొంచివుందని, రివర్‌ క్యాచ్‌మెంట్‌ ఏరియా మాయమవుతుందని పర్యావరణవేత్తలు అంటున్నారు. అటవీశాఖ అభ్యంతరాలను పొందుపరుస్తూ అటమిక్‌ ఎనర్జీ కమిషన్‌కు లేఖ రాయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ప్రభుత్వం తరఫున సిఎస్‌, అటవీశాఖ నుంచి పిసిసిఎఫ్‌ కేంద్రానికి లేఖ రాయనున్నారు.నల్లమలలోని మొత్తం నాలుగు బ్లాక్‌లలో అమ్రాబాద్‌, ఉడుమిల్ల, నారాయణ్‌పూర్‌ బ్లాకుల్లో 83చదరపు కిలోమీటర్ల పరిధిలో 800 నుంచి వెయ్యి అడుగుల లోతులో సుమారు 4వేలకు పైగా బోర్లు వేసేందుకు అనుమతి కోరుతూ కేంద్రప్రభుత్వ అటామిక్‌ మినిరల్స్‌ డైరెక్టరేట్‌ ఉమ్మడి నల్గొండ, పాలమూరు జిల్లాల డిఎఫ్‌ఒలకు తాజాగా ప్రతిపాదనలు పంపింది. వీటిపై అటవీశాఖ ఉన్నతాధికారి ఒకరు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్ణయం రాకముందే కేంద్రం స్పందిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు. డ్రిల్లింగ్‌, రోడ్లు, మిషనరీ వినియోగం, తదితర టెక్నికల్‌ అంశాలపై స్పష్టత ఇవ్వకుండా ఎఎండి పదేపదే ప్రతిపాదనలు పంపడం గందరగోళానికి గురిచేస్తోందని ఆయన చెప్పారు.స్థానిక గిరిజన ప్రజలు, ప్రజా సంఘాలు, పర్యావరణవేత్తలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టును వెనక్కి పంపడమే మేలనే అభిప్రాయానికి అటవీశాఖ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని అటవీశాఖకే వదిలేసి, అధికారుల ద్వారా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోంది. కేంద్రం మొండిగా వ్యవహరిస్తే అప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్‌ జోక్యం చేసుకుంటారని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

No comments:
Write comments