సుప్రీంలో నలుగురు న్యాయమూర్తుల ప్రమాణం

 

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23, (globelmedianews.com)
సుప్రీంకోర్టు జడ్జీలుగా జస్టిస్‌ క్రిష్ణమురారీ, జస్టిస్‌ శ్రీపతి రవీంద్ర భట్‌, జస్టిస్‌ వీ రామసుబ్రమణ్యన్‌, జస్టిస్‌ హృషికేశ్‌రాయ్‌లు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 34కు చేరుకుంది. కొత్త న్యాయమూర్తుల రాకతో సుప్రీంకోర్టులో మరో రెండు కోర్టు హాళ్లు ఏర్పాటు చేశారు. 16, 17 కోర్టు హాళ్లను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఈ రోజు నుంచి 16 ధర్మాసనాల్లో కేసుల విచారణ జరుగుతుంది.
జస్టిస్‌ కృష్ణమురారీ:
జస్టిస్‌ కృష్ణమురారీ అలహాబాద్‌కు చెందిన వారు. 1981లో బార్‌కౌన్సిల్‌ మెంబర్‌గా చేరి అలహాబాద్‌ హైకోర్టులో ప్రాక్టిస్‌ చేశారు. 2004 సంవత్సరంలో అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించబడ్డారు. 2018 సంవత్సరంలో పంజాబ్‌ హర్యాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. సుప్రీంకోర్టులో వీరి పదవీ కాలం 2023 జులై 8వ తేదీ వరకు న్యాయమూర్తిగా కొనసాగుతారు.
 సుప్రీంలో నలుగురు న్యాయమూర్తుల ప్రమాణం

జస్టిస్‌ రవీంద్రభట్‌:
జస్టిస్‌ రవీంద్రభట్‌ 2004వ సంవత్సరం నుంచి 15 సంవత్సరాల పాటు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఈ సంవత్సరం ఏప్రిల్‌ నెలలో రాజస్థాన్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డారు. కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్‌ ప్రాంతానికి చెందిన జస్టిస్‌ రవీంద్రభట్‌ ఢిల్లీలో న్యాయవిద్యను అభ్యసించి 1982వ సంవత్సరంలో న్యాయవాదిగా బార్‌ కౌన్సిల్‌లో నమోదు చేసుకున్నారు. 2023 అక్టోబర్‌ 23వ తేదీ వరకు సుప్రీంకోర్టు బడ్జీ పదవిలో కొనసాగనున్నారు.
జస్టిస్‌ వీ రామసుబ్రమణ్యన్‌:
జస్టిస్‌ వీ రామసుబ్రమణ్యన్‌ తమిళనాడు రాష్ట్రం చైన్నైకి చెందిన వారు. మద్రాస్‌ లా కాలేజీలో న్యాయవిద్యను అభ్యసించారు. 1983 ఫిబ్రవరి 16వ తేదీన న్యాయవాదిగా బార్‌ కౌన్సిల్‌లో నమోదు చేసుకున్నారు. 23 సంవత్సరాలపాటు చెన్నై హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టిస్‌ చేశారు. 2006 సంవత్సరంలో మద్రాస్‌ హైకోర్టు న్యాయవాదిగా నియమించబడ్డారు. సుప్రీకోర్టు న్యాయమూర్తిగా వారు 2023 జూన్‌ 30వ తేదీ వరకు కొనసాగనున్నారు.
జస్టిస్‌ హృషికేశ్‌రాయ్‌:
జస్టిస్‌ హృషికేశ్‌రాయ్‌ 2006వ సంవత్సరం గౌహతి హైకోర్టు న్యాయమూర్తిగా నియమించబడ్డారు. 2018వ సంవత్సరంలో కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డారు. 1982వ సంవత్సరంలో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి న్యాయవిద్య పట్టా అందుకున్న ఆయన బార్‌ కౌన్సిల్‌లో తన పేరు నమోదు చేసుకుని తరువాత గౌహతి హైకోర్టులో 2004వ సంవత్సరం వరకు సీనియర్‌ న్యాయవాదిగా ప్రాక్టిస్‌ చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2025 ఫిబ్రవరి 1వ తేదీ వరకు విధులు నిర్వహించనున్నారు.

No comments:
Write comments