నర్సులకు అందని కనీస వేతనాలు

 

వరంగల్, సెప్టెంబర్ 21, (globelmedianews.com)
ప్రయివేటు ఆస్పత్రులు, ప్రయివేట్‌ నర్సింగ్‌ విద్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న నర్సులకు కనీసవేతనం అమలు కావడం లేదు. వారికి రూ.20 వేల కనీస వేతనం అమలు చేయాలని ప్రొఫెసర్‌ జగదీష్‌ ప్రసాద్‌ కమిటీ సిఫారసు చేసిన సంగతి విదితమే. వీటిని అమలు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించి మూడేండ్లు గడిచినా వాటికి అతీగతీ లేకుండా పోయింది.దాదాపు 50 వరకు కార్పొరేట్‌ ఆస్పత్రులు, 300కు పైగా ప్రయివేటు ఆస్పత్రులు, నర్సింగ్‌ హౌంలున్నాయి. వీటిలో దాదాపు లక్ష మంది వరకు నర్సులు వివిధ హౌదాల్లో పని చేస్తున్నారు. ప్రసాద్‌ కమిటీ మార్గదర్శకాలు అమలైతే లక్ష మంది నర్సులకు కనీసవేతనంతో పాటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ప్రభుత్వ నర్సులతో సమానంగా వేతనం అందుతుంది. 
నర్సులకు అందని కనీస వేతనాలు

గత ప్రయివేటు నర్సింగ్‌ హౌంలు, ఆస్పత్రులు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో నర్సులతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని, కనీసవేతనాలను అమలు చేయకుండా, పని గంటలు పాటించకుండా, కనీస సదుపాయాలు కల్పించకుండా సాగుతున్న ఈ శ్రమదోపిడీకి అడ్డుకట్ట వేయాలని నర్సింగ్‌ సంఘాలు, ప్రజా సంఘాలు ఉద్యమాలు నిర్వహించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్లను ఆమోదించకపోవడంతో నర్సింగ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా 2011 లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రయివేటు యాజమాన్యాలు కనీసవేతనం ఇచ్చేలా చర్యలు చేపట్టే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరింది. దాదాపు ఐదేండ్ల పాటు సాగిన విచారణతో నర్సుల సమస్యలపై అధ్యయనానికి కమిటీ వేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో కేంద్ర కుటుంబ సంక్షేమ మంత్రి శాఖ 2016 జనవరి 29న కేంద్ర ఆరోగ్య సేవల డైరెక్టర్‌ జనరల్‌ ప్రొఫెసర్‌ జగదీశ్‌ ప్రసాద్‌ ఛైర్మెన్‌ గా కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ అధ్యయనం చేసి, ప్రయివేటు ఆస్పత్రుల్లో నర్సుల పరిస్థితి దుర్భరంగా ఉన్నట్టు తేల్చింది. వారికి కనీస వేతనం రూ.20 వేలు ఇవ్వాలని సిఫారసు చేసింది. 200 పడకల కన్నా ఎక్కువగా ఉన్న ఆస్పత్రుల్లో పని చేస్తున్న నర్సులకు ప్రభుత్వాస్పత్రుల్లో అదే కేడర్‌లో పని చేసే నర్సులతో సమానంగా, 100 నుంచి 200 లోపు పడకలు ఉన్న ఆస్పత్రిలో నర్సులకు 10 శాతం, 50 నుంచి 100 లోపు ఉన్న ఆస్పత్రుల్లో 25 శాతం కన్నా తక్కువ కాకుండా, 50 పడకల లోపు ఉన్న ఆస్పత్రిలో కనీస వేతనం రూ.20 వేలకు తగ్గకుండా ఇవ్వాలని సిఫారసు చేసింది. అదే విధంగా వైద్యసదుపాయం,రవాణా, వసతి తదితర సౌకర్యాలను ప్రభుత్వ నర్సులతో సమానంగా కల్పించాలని సూచించింది. ప్రొఫెసర్‌ జగదీష్‌ ప్రసాద్‌ చేసిన సిఫారసులను అమలుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. మార్గదర్శకాలను అమలు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ సర్కారుకు లేఖ రాసింది. 2016 అక్టోబర్‌ 20 నాటికి అమలు చేసి తమకు నివేదించాలని ఆ లేఖలో పేర్కొంది. వీటిని అమలు చేయాలని పలుమార్లు నర్సింగ్‌, ప్రజా సంఘాలు కోరినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా ప్రయివేటు నర్సులు కనీసవేతనాలకు నోచుకోలేకపోతున్నారు.మార్గదర్శకాలు అమలు కాకుండా కార్పొరేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు అడ్డుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్గదర్శకాలు అమలైతే 200 పడకల కన్నా ఎక్కువగా ఉన్న ప్రయివేటు ఆస్పత్రుల్లో నర్సులకు ప్రభుత్వ నర్సులతో సమానంగా వేతనాలు చెల్లించాల్సి ఉండడంతో మార్గదర్శకాలు అమలు చేయకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలో కార్పొరేట్‌ ఆస్పత్రులు 1000కి పైగా పడకలతో విలసిల్లుతున్నాయి. ప్రధానంగా ఉన్న నాలుగు కార్పొరేట్‌ ఆస్పత్రులు కలిపి దాదాపు 10 వేల పడకలున్నాయి. మల్టీ స్పెషాల్టీ సేవలందిస్తున్న ఈ ఆస్పత్రుల్లో ఒక్కో ఆస్పత్రిలో నర్సులు వందల సంఖ్యలో షిప్టుల వారీగా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి రూ.10 వేల నుంచి 15 వేల వరకు జీతం చెల్లిస్తున్నారు. సిఫారసులు అమలయితే ప్రభుత్వ నర్సులతో సమానంగా రూ.35 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ధనవంతులు, ఎగువమధ్యతరగతికి చెందిన రోగులు ఎక్కువగా వెళ్తున్న ఈ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ కింద నిధుల్లోనూ సింహభాగమే. ఇఎస్‌ఐ రోగుల నుంచి కూడా రెఫర్‌ మీద సంక్లిష్ట వ్యాధుల చికిత్సకు వస్తుంటారు. ప్రయివేటు వైద్యబీమా సౌకర్యంతో చేరే రోగులు కూడా చికిత్స కోసం కార్పోరేట్‌ ఆస్పత్రుల వైపే మొగ్గుచూపుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేసే సెంట్రల్‌ గవర్నమెంట్‌ హెల్త్‌ స్కీం (సీజీహెచ్‌ఎస్‌) కింద ఉద్యోగులు కూడా వైద్య సదుపాయం పొందుతున్నారు. ఆదాయానికి తక్కువేమి లేకపోయినా కనీసవేతనాలు అమలు చేయడం లేదని నర్సులు ఆవేదన చెందుతున్నారు.

No comments:
Write comments